2027 నాటికి మీ ఉద్యోగం ఉంటుందా? ఉండదా? : ఎడిటర్ కాలమ్
Artificial intelligence: ఏఐ రాకతో 2027 నాటికి ఉద్యోగాల పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఆ మార్పుకు తగినట్లు మనం సిద్ధం కాకుంటే కష్టాలు తప్పవు. ఈ వివరాలను ఎడిటర్ కాలమ్‌లో డీటైల్డ్ గా తెలుసుకుందాం.

ఇక తెలివి ఒకరి సొత్తు కాదు
నిన్న, నేను న్యూయార్క్ టైమ్స్ (The New York Times)లో స్టోరీని చదువుతూ ఉంటే.. "AI మీ ఉద్యోగాన్ని మింగేస్తుందని భయపడుతున్నారా.. అయితే మీరు ప్లంబర్ గానో లేక, ఎలక్ట్రీషియన్ గానూ లేక మరేదైనా బ్లూకాలర్ జాబ్ చేస్తూ ఉంటే మీకు ప్రమాదం తక్కువ అనే స్టోరీ కనిపించింది. ఇప్పుడు అదే నిజమని అనిపిస్తోంది. అత్యంత వేగంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) 2027 కి అంటే మరో రెండేళ్లలో ఎలాంటి పరిస్థితులను సృష్టిస్తుందో.. సమాజాన్ని ఎలా మారుస్తుందో ఓ సారి విశ్లేషించుకుందాం.
ప్రస్తుతం మనం భౌతిక శ్రమను పక్కన పెట్టి, తెలివితో.. కంప్యూటర్ సాయంతో చేసే పనులను లక్ష్యంగా చేసుకున్న AI యుగంలోకి అధికారికంగా ఎంటరై పోయాం. 2027 నాటికి, AI అభివృద్ధి కేవలం చాట్‌బాట్‌లతో ఆగిపోదు, అది కార్మికుల మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, మన జీవనశైలి మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకురాబోతోంది.
2027 నాటికి AI అభివృద్ధి: ఊహించని వేగం
నిన్నటి దాకా అంటే జనరేటివ్ ఏఐ రాకముందు కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్‌లు, ఏవైనా సరే ఒక పనిని మాత్రమే చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేవి. కానీ తర్వాత వచ్చిన జనరేటివ్ AI (GenAI) చాలా వేగంగా వృద్ధి చెందుతోంది.. విస్తరిస్తోంది. దీన్ని నాలుగేళ్ల కిందటి వరకూ ఎవరూ ఊహించలేకపోయారు. 2016లో ఓ సర్వే చేస్తే.. 2024 నాటికి AI భాషలను అనువదించడంలో మానవులను అధిగమిస్తుందని, 2026 నాటికి హైస్కూల్ ఎస్సేలు రాయగలదని మాత్రమే నిపుణులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఏఐ.. ముందు ఊహించినద దానికన్నా వందరెట్లు స్మార్ట్ అయిపోయింది.
ఆటోమేషన్ లో పెరిగిన వేగం
2027 నాటికి అత్యంత ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతున్నాం. ట్రక్ డ్రైవర్ పనిని AI మానవుడి కంటే మెరుగ్గా, చౌకగా చేయగలదని 50% నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల AI 2027" పేరుతో జరిగిన ఒక అంచనా ప్రకారం.. కోడింగ్, AI పరిశోధనల ఆటోమేషన్‌లో వేగవంతమైన పురోగతి వస్తుంది. నిజానికి, ఈ వేగం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు కోడింగ్, రైటింగ్, ఆటో మేషన్ ఇలా రకరకాల అవసరాల కోసం AI వాడుతున్న ఉద్యోగులు, వారానికి కనీసం మూడు రోజులు వాటిని వాడినా.. తర్వాత వారు ఏఐ లేకపోతే పని చేయలేని స్థాయికి చేరుకుంటారు. దీన్ని బట్టి మనం ఏఐ మనల్ని ఎంత బానిసలుగా మార్చనుందో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు AI ఎఫీషియన్సీని అతిగా ప్రచారం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఫ్లాగ్‌షిప్ LLM (Large Language Model) అయిన ChatGPT తాజా వెర్షన్‌తో దాదాపు చరమాంకానికి చేరుకుందని.. మునుపటి వాటి కంటే మెరుగైన పనితీరును ఇవ్వడం లేదని, కానీ ఖర్చు 10 రెట్లు పెరిగిందని టెక్ రంగంలో ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగాలపై ప్రభావం: యువతకే పెద్ద దెబ్బ
AI ప్రభావం ఇప్పుడు వైట్-కాలర్ ఉద్యోగులపై ఎక్కువగా ఉంటోంది. కొత్తగా కెరీర్‌ను ప్రారంభించే Gen Z (22–25 ఏళ్ల) అయినా, 15 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులు, నిపుణులైనా ఇప్పుడు ఉద్యోగ కష్టాలు ఎదుర్కొంటున్నారు.
* ఎంట్రీ లెవల్ ఉద్యోగాల క్షీణత: 2022 చివరలో జనరేటివ్ AI విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి, AI కి ఎక్కువగా ఫోకస్ అయిన ఉద్యోగాలలో ఉన్న 22–25 ఏళ్ల యువ టెకీలు 13 శాతం మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇది జాబ్ మార్కెట్‌లో కొత్త గ్రాడ్యుయేట్‌లకు ఎదురుగాలిలా మారింది.
* ఆటోమేషన్ vs. ఆగ్మెంటేషన్: ChatGPT వచ్చాక, ఆటోమేషన్‌కు గురయ్యే ఉద్యోగాలలో నియామకాలు 17% తగ్గాయి. అయితే, AI తో కలిసి పనిచేయడం (Augmentation) ద్వారా మెరుగుపడే ఉద్యోగాలలో నియామకాలు 22% పెరిగాయి. 2030 నాటికి, మొత్తం US ఉద్యోగాలలో 30% ఆటోమేట్ అయ్యే అవకాశం ఉందని, 60% ఉద్యోగాలలో పనులు AI వల్ల గణనీయంగా మారిపోతాయని అంచనా.
* క్రియేటివ్ క్రైసిస్ : 2027 నాటికి క్రియేటివ్ రంగంలో సంక్షోభం తీవ్రంగా ఉంటుంది. కథా రచయితలు, డిజైనర్లు, డబ్బింగ్ ఆర్టిస్టుల వంటి ఉద్యోగాలు ఏఐ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటాయి. కొన్ని అంచనాల ప్రకారం, రాబోయే మూడు సంవత్సరాలలో 200,000 కంటే ఎక్కువ ఉద్యోగుల జాబ్ లాస్ ను ఎదుర్కుంటారు.
* మీ నైపుణ్యం ఇకపై స్కిల్ కాదు : AI ఎరాలో మీ కోర్ స్కిల్ జీవిత కాలం తగ్గిపోతుంది. ఇప్పటి వరకూ ఏదైనా నేర్చుకుంటే దాని ద్వారా 4 నుండి 6 సంవత్సరాల వరకు పని చేసుకునే వీలుండేది. ఇప్పుడు ఆ కాలం 12 నుండి 18 నెలలకు తగ్గింది. అంటే పాత స్కిల్స్ త్వరగా అవుట్ డేట్ అయిపోతాయి. దీంతో డిగ్రే చేశాం కదా.. ఉద్యోగం వచ్చేసింది ఇక సేఫ్ అనుకుంటే నడవదు. జీవితకాలం మనం అప్ స్కిల్ అవుతూనే ఉండాల్సి ఉంటుంది. లేకుంటే ఉద్యోగం పోతుంది.
జీవన శైలి, సమాజంలో మార్పులు
AI అభివృద్ధి మన జీవనశైలిని, ఆర్థిక స్థిరత్వాన్ని పలు కోణాల్లో ప్రభావితం చేయనుంది. 2027 నాటికి AI చుట్టూ ఉన్న ఆర్థిక బబుల్ అత్యంత ఆందోళన కలిగించే అంశం. 2025లో, విశ్లేషకులు ఈ AI బబుల్ 1990ల నాటి డాట్-కామ్ బబుల్ కంటే 17 రెట్లు పెద్దదని, 2008 నాటి గ్లోబల్ రియల్-ఎస్టేట్ బబుల్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా మారిందని హెచ్చరించారు. అంటే ఇది తేడా కొట్టిందంటే.. అత్యంత భారీ ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. కేవలం ఒకటి రెండు దేశాలు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేయనుంది.
ఇప్పుడు బంగారం పెరగడానికి మూల కారణం ఇదే. ఈ అనిశ్చితి వల్లే బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2026 మధ్య నాటికి ఔన్స్ బంగారం $4,000/oz కి చేరుకుంటుందని J.P. మోర్గాన్ పరిశోధన అంచనా వేసింది. ఈ అనిశ్చితిని అంచనా వేయడానికి ఫైనాన్స్ సంస్థలు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) ఆధారిత సెంటిమెంట్ అనాలిసిస్ వంటి AI టూల్స్‌ను ఉపయోగించారు.
2027 నాటికి ఏ ఉద్యోగాలు ఎంత వరకు సేఫ్?
* వైద్యం, మానవ సేవలు: నర్స్ ప్రాక్టీషనర్లు (45.7% వృద్ధి), మెంటల్ హెల్త్ కౌన్సెలర్‌లు, ఫిజికల్ థెరపిస్ట్‌లు. AI వైద్య నిర్ధారణకు సహాయపడినా, మానవ స్పర్శ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం ఇక్కడ ఎక్కువ.
* నైపుణ్యం కలిగిన వృత్తులు (Skilled Trades): ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్స్. ఈ ఉద్యోగాలకు భౌతిక శ్రమ అవసరం. ఇవి యంత్రాలతో నేరుగా సంబంధం లేని పనులు. కాబట్టి, ఆటోమేషన్ రిస్క్ తక్కువ. పవన టర్బైన్ టెక్నీషియన్లు (45% వృద్ధి), సోలార్ ఇన్‌స్టాలర్‌లు (22% వృద్ధి) కూడా ఉద్యోగ భద్రతను కలిగి ఉంటారు.
* సైబర్ సెక్యూరిటీ, AI ఎథిక్స్: ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులు (33% వృద్ధి), AI ఎథిక్స్ స్పెషలిస్టులు (అధిక వృద్ధి) వంటి సాంకేతికత, నైతికతకు సంబంధించిన ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఉద్యోగం వచ్చినా నిరంతర అధ్యయనం తప్పదు.
ఏఐకి 1000 రెట్లు ASI
మొత్తానికి 2027లో, AI కేవలం ఒక టెక్నాలజీ కాదు; ఇది మన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ మార్కెట్, మన ఉనికినే పునర్నిర్మిస్తున్న ఒక శక్తిగా మారనుంది. సరైన స్కిల్ లేని Gen Z ఉద్యోగాలు నశించడం ఒక వాస్తవం. అయినప్పటికీ, ఈ అంతరాయం సరిగ్గా తమను తాము సన్నద్ధం చేసుకునే వారికి భారీ అవకాశాలను తెస్తుంది. ఇప్పుడు ఉద్యోగం చేసి బతకాలంటే.. ఉన్న మార్గం ఒకటే. ఆటోమేషన్‌కు గురయ్యే పనుల నుంచి, మానవ సామర్థ్యాలు అవసరమయ్యే పనులు నేర్చుకోవడం.. ఆ వైపు మారడం ఏ ఏఐతోనే ఇలా ఉంటే సూపర్ ఇంటెలిజెన్స్ వస్తే.. అంటే ASI మన భవిష్యత్తు ఇంకా భయానకంగా మారనుంది. ఆ వివరాలు మరో స్టోరీలో చూద్దాం.