ప్రపంచంలోని 10 అతిపెద్ద ఉద్యమాలు: ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు, నాయకులు కూలిపోయారు
Biggest Protest in the World: ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలతో పలువురు అధ్యక్షులు, ప్రధానమంత్రుల రాజీనామాలకు దారి తీశాయి. అవినీతి, ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణాలుగా ఈ ఉద్యమాలు జరిగాయి.

ప్రభుత్వాలను కూల్చిన ప్రజా ఉద్యమాలు
ప్రజల అసంతృప్తి ఎప్పటికప్పుడు దేశాధ్యక్షులను సవాలు చేస్తూ వచ్చింది. కొన్ని ఉద్యమాలు కేవలం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా, పలు దేశాల రాజకీయ నిర్మాణాన్నే కదిలించాయి. గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక శక్తివంతమైన ఉద్యమాలు చోటుచేసుకుని, పలువురు నేతల రాజీనామాలకు కారణమయ్యాయి. అలాంటి ఉద్యమాలు చూసిన దేశాల లిస్టులో ఇప్పుడు నేపాల్ కూడా చేరింది. ప్రజాగ్రహంతో ప్రభుత్వాలు, నాయకులు కూలిపోయిన టాప్ 10 సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బంగ్లాదేశ్ (2024: షేక్ హసీనా)
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానంపై వివక్ష ఉందని విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారింది. చివరకు ప్రజా ఒత్తిడితో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్‌లో ఆశ్రయం పొందారు.
2. శ్రీలంక (2022: గోటబయ రాజపక్సే)
ఆర్థిక సంక్షోభం, అవినీతి, దుర్వినియోగం కారణంగా నెలల తరబడి నిరసనలు జరిగాయి. ప్రజలు అధ్యక్ష భవనం, ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోగా, మహిందా రాజపక్సే రాజీనామా చేశారు.
3. నేపాల్ (2025: కె.పి.శర్మ ఒలీ)
అవినీతి, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ముల నిషేధంపై యువత కోపంతో పార్లమెంట్ భవనంపై దాడి చేసింది. పోలీస్ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. తీవ్ర ఒత్తిడిలో ప్రధానమంత్రి కె.పి.శర్మ ఒలీ రాజీనామా చేశారు. డిప్యూటీ పీఎం విష్ణు ప్రసాద్‌పై కూడా ప్రజలు దాడి చేశారు.
4. థాయ్‌లాండ్ (2025: పైతోంగ్‌టార్న్ షినావాత్రా)
కంబోడియాతో లీకైన సంభాషణ, సైనిక దుర్వినియోగంపై జూలై 2025లో వేలాది మంది నిరసనలు చేపట్టారు. కోర్టు ఆదేశాల తర్వాత ఆగస్టు 2025లో పైతోంగ్‌టార్న్ ను పదవి నుంచి తొలగించారు.
5. సూడాన్ (2022: అబ్దుల్లా హమ్దోక్)
2021 సైనిక తిరుగుబాటు తర్వాత ప్రజలు పౌర ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కోరుతూ రోడ్లపైకి వచ్చారు. సైన్యం కాల్పులు జరిపి 53 మందిని చంపింది. ప్రజాగ్రహంతో చివరికి ప్రధానమంత్రి హమ్దోక్ రాజీనామా చేశారు.
6. అల్జీరియా (2019: అబ్దెలాజిజ్ బూటెఫ్లికా)
‘హిరాక్’ పేరుతో ప్రారంభమైన ఈ ఉద్యమం, బూటెఫ్లికా ఐదవసారి అధ్యక్ష పదవి కోసం పోటీ చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా సాగింది. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఏప్రిల్ 2019లో బూటెఫ్లికా రాజీనామా చేశారు.
7. సెర్బియా (2025: మిలోస్ వుసేవిక్)
ఒక స్టేషన్ కూలిపోవడం, అవినీతి ఆరోపణలతో జనవరి 2025లో ప్రజలు నిరసనలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగడంతో 28 జనవరి 2025న ప్రధాని మిలోస్ వుసేవిక్ రాజీనామా చేశారు.
8. లెబనాన్ (2019: సాద్ హరీరి)
ఆర్థిక పతనం, అవినీతి, మతపరమైన రాజకీయ వ్యవస్థపై నిరసనలు 13 రోజులు కొనసాగాయి. 29 అక్టోబర్ 2019న ప్రధానమంత్రి సాద్ హరీరి రాజీనామా చేశారు.
9. బొలీవియా (2019: ఇవో మోరలెస్)
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 14 ఏళ్ల పాలన తర్వాత 10 నవంబర్ 2019న అధ్యక్షుడు ఇవో మోరలెస్ రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు.
10. కిర్గిజిస్తాన్ (2020: సోరోన్‌బే జీన్బెకోవ్)
పార్లమెంట్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రజలు ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. చివరికి జీన్బెకోవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ 10 భారీ ప్రజా ఉద్యమాలు రాజకీయ నాయకత్వంపై నేరుగా ప్రభావం చూపాయి. అవినీతి, ఆర్థిక సంక్షోభం, దుర్వినియోగం, ఎన్నికల అక్రమాలు ప్రజలను రోడ్లపైకి దింపాయి. ఈ సంఘటనలు ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ఎంత బలమైనదో మరోసారి నిరూపించాయి.