గర్భిణులు, బాలింతలు చందనం వాడకూడదా?
చందనానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. బ్యూటీకి సంబంధించిన ఎన్నో ప్రాడక్ట్ లలో చందనాన్నివిరివిగా ఉపయోగిస్తుంటారు. మెడిసిన్ తయారీలోనూ చందనం చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని ఔషధ గుణాలున్న చందనాన్ని గర్భిణులు, బాలింతలు, 6 నెలల లోపు పిల్లలకు వాడకూడదనే విషయం మీకు తెలుసా? అసలు ఎందుకు వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చందనానికి ఆయుర్వేదంలో, ఆధ్యాత్మికతలో ప్రముఖ స్థానం ఉంది. చందనం సాధారణంగా లేత గులాబీ, పసుపు రంగులో ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చందనాన్ని అందం కోసం కూడా ఎక్కువగా వాడతారు.
చందనం ఔషధగుణాలు
చందనం మనసుకు ప్రశాంతతను కలిగించడంతోపాటు, ఒత్తిడిని తగ్గించి, ఉత్సాహాన్నిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చందనాన్ని ఆయుర్వేదంలో వివిధ రకాలుగా వాడతారు. గాయాలు, మచ్చలు, వాపు, గడ్డలు, చర్మ సమస్యలకు చందనం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
అందం కోసం చందనం
అందం కోసం కూడా చందనాన్ని ఎక్కువగా వాడతారు. వారంలో రెండు సార్లు ముఖానికి చందనం రాసుకుంటే మచ్చలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా, అందంగా ఉండటానికి చందనం సహాయపడుతుంది. గాయాలపై చందనం రాస్తే త్వరగా మానుతాయి.
నుదిటిపై చందనం అందుకే..
సువాసన ద్రవ్యాలలో కూడా చందనానికి ప్రముఖ స్థానం ఉంది. ఆధ్యాత్మిక విషయాల్లో దేవుళ్లకు అర్చన, బొట్టు పెట్టడానికి చందనం పొడిని వాడతారు. అందుకే ఇది అందరూ ఇష్టపడే శుభప్రదమైన వస్తువుగా ప్రసిద్ధికెక్కింది. ప్రతిరోజూ నుదుటిపై చందనం పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అందుకే చాలామంది నుదుటిపై చందనం పెట్టుకుంటూ ఉంటారు.
చందనాన్ని వీరు వాడకూడదు
ఎన్నో ప్రయోజనాలున్న చందనాన్ని చలికాలంలో గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల లోపు పిల్లలు వాడకూడదు. అలాగే దీర్ఘకాలిక జలుబు, ఆస్తమా, మూర్ఛలు వంటి సమస్యలు ఉన్నవారు కూడా చలికాలంలో చందనం వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చందనం వాడచ్చా?
చందనం చల్లదనాన్ని కలిగిస్తుంది కాబట్టి, వర్షాకాలం, చలికాలంలో దీన్ని వాడటం వల్ల జలుబు సమస్య తీవ్రమవుతుంది. అదే సమయంలో వేసవిలో శరీరస్థితిని బట్టి చందనం వాడుకోవచ్చు. దురద ఉన్న చోట చందనం రాస్తే కొన్నిసార్లు అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.