Sugar Patients: షుగర్ పేషెంట్లకు రాగిపిండి మంచిదా? గోధుమపిండి మంచిదా?
షుగర్ పేషెంట్లు ఫుడ్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం తినాలి? ఏం తినకూడదు? తప్పకుండా తెలుసుకోవాలి. చాలామందికి రాగి, గోధుమలు తినడంపై కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ విషయాలను ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాం.

ప్రస్తుత లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ పేషెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. రాగి, గోధుమలు రెండూ కార్బోహైడ్రేట్లకు మూలం కాబట్టి, రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారికి ఏది మంచిదో తెలియక తికమక పడుతుంటారు. మరి ఈ రెండింటిలో షుగర్ పేషెంట్లకు ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమల్లోని పోషకాలు:
గోధుమల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే, గోధుమల్లో గ్లూటెన్ ఉండటం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గోధుమల్లోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి.
రాగిలోని పోషకాలు:
రాగిపిండిలో కాల్షియం, ఇనుము, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా, రాగి రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతుంది. రాగిలో గ్లూటెన్ ఉండదు.
ఏది మంచిది?
రక్తంలో చక్కెర ఉన్నవారు కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి కాబట్టి, గోధుమపిండి కంటే రాగిపిండి మంచిది. రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ గోధుమల కంటే చాలా తక్కువ. అంటే, ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతుంది. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర కూడా నెమ్మదిగా పెరుగుతుంది. రాగిలో గ్లూటెన్ ఉండదు. కాబట్టి షుగర్ పేషెంట్లు నిరభ్యంతరంగా తినవచ్చు.
ఎలా తినాలి?
- రాగి ఇడ్లీ, ఇడియప్పం, గంజి, చపాతీలు లాంటివి చేసుకుని తినవచ్చు. అయితే, ఎంత తినాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకోవడం మంచిది.
- రాగిపిండిని ఎక్కువగా తినకూడదు. డాక్టర్ చెప్పినంత మాత్రమే తినాలి.
- రాగిని ఇతర ధాన్యాలు, పప్పులతో కలిపి తింటే పోషకాలు పెరుగుతాయి.