రోజూ లవంగాలు తింటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
సాధారణంగా మనం లవంగాలను చికెన్, మటన్, బిర్యానీ వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సరే అందులో వేసిన వాటిని అయినా సరిగ్గా తింటామా.. అంటే అది లేదు. ఒక్క లవంగం పన్ను కింద పడగానే ఎక్కడ లేని చిరాకు వస్తుంది కొందరికి. వెంటనే వాటిని ఏరి పక్కన పడేస్తుంటారు. కానీ మనం పడేసే లవంగాల్లో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

మనం వాడే మసాలా దినుసుల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరీ ముఖ్యంగా లవంగాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. రోజు లవంగాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
వ్యాధులు రాకుండా..
లవంగాల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్, యూజినాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణజాల వాపు, ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులను నివారించడంలో లవంగాలు సాయపడతాయి.
రోగనిరోధక శక్తి...
లవంగాల్లోని యూజినాల్ ఒక మంచి క్రిమిసంహారిణి. ఇది బాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పళ్ళకి మంచిది
లవంగాలు పళ్ళకు, నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే టూత్ పేస్ట్ లలో ఎక్కువగా లవంగాలను వాడుతుంటారు. రోజూ లవంగాలు నమిలితే నోటిలోని బాక్టీరియా నశిస్తుంది.
కాలేయం ఆరోగ్యం కోసం..
శరీరంలోని విషాలను బయటకు పంపే కాలేయ ఆరోగ్యానికి లవంగాలు మేలు చేస్తాయి. లవంగాల్లో యూజినాల్ తో పాటు థైమాల్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది కాలేయంలో కొత్త కణాలు ఏర్పడటానికి, విషాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
షుగర్ పేషెంట్లకు ఇలా..
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇన్సులిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో గ్లూకోజ్, లిపిడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో లవంగాలు సాయపడతాయి. నెలకు 1 నుంచి 3 గ్రాముల లవంగాలు తీసుకోవడం వల్ల ఇవి నియంత్రణలో ఉంటాయి.