తమలపాకు.. ఇన్ని రోగాలు రాకుండా చేస్తుందా? అవెంటో తెలిస్తే ఈ ఆకును తినకుండా ఉండరు
సాధారణంగా పూజలు, శుభకార్యాల్లో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మికంగానే కాదు ఔషధంగానూ తమలపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు తమలపాకులోని ఔషధ గుణాలు ఏంటి? అవి ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత సంస్కృతిలో తమలపాకుది ప్రత్యేక స్థానం. తమలపాకును అనేక సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం తమలపాకు అలంకార మొక్కగా అనేక ఇళ్లలో ఉన్నప్పటికీ, దాని ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. తమలపాకును ఎక్కువగా పూజలు, శుభకార్యాల్లో ఉపయోగించి తర్వాత పడేస్తూ ఉంటారు. అసలు తమలపాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మీకు తెలుసా?
నొప్పి మాయం
తమలపాకు నొప్పి నివారిణి అని చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో తమలపాకుతో నూనెలు కూడా తయారు చేస్తుంటారు. ఇంట్లో ఎవరికైనా చిన్న చిన్న గాయాలు, వాపులు వచ్చినప్పుడు తమలపాకు రసాన్ని నొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఖాళీ కడుపుతో..
తమలపాకును రాత్రి నీటిలో నానబెట్టి, ఆ నీటిని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. PH స్థాయిలను పునరుద్ధరిస్తాయి.
గ్యాస్ రాకుండా..
పెళ్లిళ్లు, శుభకార్యాలలో.. వింధు భోజనం తర్వాత తమలపాకు, వక్క ఇవ్వడం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆచారంగా ఉంది. ఇందులో సంస్కృతితో పాటు శాస్త్రం కూడా ఉంది. ఎక్కువగా ఆవిరి పదార్థాలు తింటే వచ్చే గ్యాస్ ఇతర సమస్యలను తమలపాకు తొలగిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఇలా చేస్తే...
పిల్లల నుంచి పెద్దల వరకు కఫం సమస్యను తొలగించడానికి తమలపాకు పత్తి, కషాయం మంచి పరిష్కారం. తమలపాకును రసంలా కూడా తీసుకోవచ్చు. తమలపాకు కషాయం చేసేటప్పుడు కొద్దిగా జీలకర్ర, మిరియాలు కలపడం వల్ల కఫం సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
నోటి దుర్వాసన
నోటిలో బ్యాక్టీరియా చేరడం వల్ల దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు, కడుపు సంబంధిత సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. దీన్ని పరిష్కరించడానికి, తమలపాకును బాగా నమిలి, దాని రసాన్ని మింగాలి. ఇది నోటి సమస్యకు పరిష్కారం చూపుతుంది.
కీళ్ల నొప్పులు
నొప్పి సమస్యలకు తమలపాకు మంచి ఔషధం. నడుము నొప్పి, ఆస్టియోపోరోసిస్, కీళ్లవాతం, ఎముకలను బలోపేతం చేయడానికి తమలపాకు పత్తి వేసుకోవడంతో పాటు, ఉదయం 2 తమలపాకులను బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.
షుగర్ కంట్రోల్
తమలపాకు లేదా దాని పొడిని నీటిలో కలిపి తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ కణాలను..
తమలపాకును తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇందులోని ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడుతాయంటున్నారు.
డిప్రెషన్ తగ్గుతుంది
విరామం లేకుండా పని చేయడం, ఇతర కారణాల వల్ల డిప్రెషన్‌కు గురైతే... ఒక తమలపాకును నమిలి తింటే చాలు. మనసు తేలికగా, ఉత్సాహంగా ఉండటం గమనిస్తారు. తమలపాకును నీటిలో మరిగించి టీలా కూడా తాగవచ్చు.