Gardening Tips: చిన్న బాల్కనీలో ఎక్కువ మొక్కలు ఎలా పెంచాలో తెలుసా?
మొక్కలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. రోజూ కాసేపు మొక్కలతో సమయం గడిపితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మరి తక్కువ ప్లేస్ లో లేదా చిన్న బాల్కనీల్లో మొక్కలను ఎలా పెంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

చిన్న బాల్కనీలో మొక్కలు ఎలా పెంచాలి?
ఇంట్లో చిన్న బాల్కనీ లేదా తక్కువ ప్లేస్ ఉంటే మొక్కలు పెంచుకోవడం కష్టమని చాలామంది అనకుంటారు. కానీ ఎంత చిన్న ప్లేస్ ఉన్నా మొక్కలను ఈజీగా పెంచుకోవచ్చు. మొక్కలు మంచి గాలినే కాదు, మనస్సుకు ఆనందాన్ని కూడా ఇస్తాయి. చిన్న బాల్కనీల్లో మొక్కలు ఎలా పెంచుకోవాలి? ఏ మొక్కలు పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బాల్కనీల్లో ఇవి చెక్ చేయాలి!
బాల్కనీ చిన్నదైనా, పెద్దదైనా మనకు నచ్చినట్లుగా మొక్కలు పెంచుకోవచ్చు. అయితే మొక్కలు పెంచే ముందు.. మీ బాల్కనీలోకి సూర్యరశ్మి మంచిగా వస్తోందా లేదా చెక్ చేసుకోవాలి. కొన్ని మొక్కలకు ప్రత్యక్ష సూర్యకాంతి అవసరమవుతుంది కాబట్టి సూర్యుడి కిరణాలు బాల్కనీలో పడుతున్నాయో లేదో చూసుకోవాలి. గాలి ప్రవాహం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ గాలి వస్తే కొన్ని మొక్కలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలి.
సరైన కుండీలు ఎంచుకోవాలి
తక్కువ స్థలానికి అనువైన కుండీలను ఎంచుకోవాలి. హ్యాంగింగ్ పాట్స్, వాల్ మౌంట్ పాట్స్ లేదా వర్టికల్ గార్డెన్ బెస్ట్. రీయూజ్ చేసే ప్లాస్టిక్ బాటిల్స్, బాక్సులు, పాత గిన్నెలు కూడా కుండీలుగా ఉపయోగించవచ్చు. నీరు పోయేందుకు హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. తక్కువ స్థలంలో మంచి మొక్కలు పెంచాలంటే.. తేలికపాటి, పోషకాలు ఉన్న మట్టి బాగుంటుంది.
ఏ మొక్కలు పెంచాలంటే?
బాల్కనీల్లో పెంచుకోవడానికి కూరగాయల మొక్కలు చాలా అనువైనవి. టమాటా, మిర్చి, బీరకాయ, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలు, కరివేపాకు, పాలకూర, కొత్తిమీర, పుదీనా, తోటకూర వంటి ఆకుకూరలు పెంచుకోవచ్చు. వీటిని పెంచుకోవడం ద్వారా నాణ్యమైన కూరగాయలు లభించడంతో పాటు బయట కూరగాయలు కొనే బాధ తప్పుతుంది. ఖర్చు తగ్గుతుంది.
ఔషధ, పూల మొక్కలు
మనం బాల్కనీల్లో ఔషధ, పూలు, పండ్ల మొక్కలు కూడా పెంచుకోవచ్చు. గులాబీ, బంతి, మందార, చామంతి, లిల్లీ వంటి పూల మొక్కలు పెంచుకోవచ్చు. తులసి, అలొవెరా, స్నేక్ ప్లాంట్ వంటివి కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు ఇంటి అందాన్ని పెంచుతాయి.
వాటరింగ్ టిప్స్
ప్రతి మొక్కకు రోజూ నీరు అవసరం ఉండదు. మట్టి పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం నీరు పోస్తే సరిపోతుంది. నీరు ఎక్కువగా పోయడం వల్ల మొక్కల వేర్లు బయటకు వచ్చి.. అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది.
కీటకాల నివారణ
మొక్కల పెరుగుదలకు సేంద్రియ ఎరువులు ఉపయోగించడం మంచిది. మొక్కలకు తెగుళ్లు సోకితే.. ఇంట్లోనే కీటకాల నివారణ మందులు తయారు చేసుకోవచ్చు. పసుపు, వెల్లుల్లి వాటర్, వేప నూనె వంటివి వారానికి ఒకసారి ఉపయోగించడం ద్వారా తెగుళ్లను నివారించవ్చచు.
తక్కువ స్థలంలోనే..
తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు పెంచాలంటే.. వాల్ మౌంట్ స్టాండ్స్, హ్యాంగింగ్ బాస్కెట్లు, పాప్ బాటిల్స్ వంటివి ఉపయోగించవచ్చు. పాత షెల్ఫ్‌లను గార్డెనింగ్ ర్యాక్‌లుగా మార్చవచ్చు.
ఫైనల్ గా..
మొక్కల ఎదుగుదలను రోజూ గమనించండి. వాటితో సమయం గడపండి. వారానికి ఒక్కసారి ప్రణాళిక ప్రకారం మొక్కలకు ఎరువులు వేయండి. గార్డెనింగ్ మంచి అలవాటు మాత్రమే కాదు.. ఒక థెరపీ కూడా.