RIP డీగో మారడోనా... ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆటలాడించిన మాంత్రికుడికి...
ఆటను సీరియస్‌గా ఆడేవాళ్లు ఓ టైపు. ఆడుతున్నంతసేపు పోటీని కూడా ఎంజాయ్ చేసే వాళ్లు మరోవైపు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా, రెండో రకానికి చెందినవాడు. ఫుట్‌బాల్ మైదానంలో కూడా స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను అలరించేవాడు మారడోనా. అందుకే అతన్ని సాకర్ మాంత్రికుడని పిలుస్తారు. తన ఆటతో ప్రపంచాన్ని గెలిచిన మారడోనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...
మారడోనా అసలు పేరు డీగో అర్మాండో మారడోనా... 1960, అక్టోబర్ 30న అర్జెంటీనాలోని బ్యూన్‌ఎయిర్స్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు మారడోనా.
నలుగురు కూతుళ్ల తర్వాత పుట్టిన మొదటి కొడుకు కావడంతో మారడోనాను గారబం చేసేవాళ్లు అతని తల్లిదండ్రులు. మారడోనాకి ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు.
మారడోనా తమ్మళ్లు హుడో, రౌల్ కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్లుగా రాణించారు.. 8 ఏళ్ల వయసులోనే తన ఫుట్‌బాల్ ప్రతిభను చాటాడు మారడోనా.
ఎస్ట్రేల్లా రోజా క్లబ్‌కి తొలిసారి ఫుట్‌బాల్ ఆడిన మారడోనా... అర్జెంటీనోస్ జూనియర్స్‌కి ఆడడంతో మంచి గుర్తింపు సాధించాడు.
12 ఏళ్ల వయసులో ఫస్ట్ డివిజన్ గేమ్స్ ఇంటర్వెల్ సమయంలో బంతితో జిమ్మిక్కులు చేసి ఫుట్‌బాల్ వీక్షకులు, స్పెక్యులేటర్ల కంట్లో పడ్డాడు మారడోనా...
1976, అక్టోబర్ 20న ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ‘అర్జెంటీనోస్ జూనియర్స్’కి ఆడిన మారడోనా... 16వ నెంబర్ జెర్సీతో ఎంట్రీ ఇచ్చాడు.
అర్జెంటీనా ప్రిమెరా డివిజన్ నుంచి ఎంట్రీ ఇచ్చిన అతిపిన్న వయసు ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మారడోనా, ఎంట్రీ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే గోల్ సాధించాడు.
అర్జెంటీనా జూనియర్స్‌కి 1976 నుంచి 1981 దాకా ఐదేళ్లు ఆడిన మారడోనా 167 మ్యాచుల్లో 115 గోల్స్ సాధించాడు. ఆ తర్వాత 4 మిలియర్ల డాలర్లకి బోకా జూనియర్స్ జట్టుకి మారాడు మారడోనా...
అర్జెంటీనా జాతీయ జట్టు తరుపున 91 మ్యాచుల్లో 34 గోల్స్ చేసిన మారడోనా... 16 ఏళ్ల వయుసులోనే హంగేరీపై మ్యాచ్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆరంగ్రేటం చేశారు.
1978లో జరిగిన వరల్డ్‌కప్‌లో మారడోనాను పక్కనబెట్టాడు కోచ్ సిజర్ లూయిస్ మెనోట్టి. 17 ఏళ్ల పిల్లాడు వరల్డ్‌కప్‌లో ఏ మాత్రం ప్రభావం చూపించగలడనే సందేహంతో అతన్ని జట్టు నుంచి తప్పించాడు కోచ్ మెనోట్టి.
అయితే 1979లో ఫిఫా వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్ ఆడిన మారడోనా... ‘స్టార్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. ఆరు మ్యాచుల్లో ఆరు గోల్స్ చేశాడు.
1982లో తొలిసారి వరల్డ్‌కప్ ఆడిన మారడోనా... ఐదు మ్యాచుల్లో రెండు గోల్స్ మాత్రమే చేశాడు. అంతేకాకుండా ఐదు మ్యాచుల్లో ఫౌల్స్ చేసి ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యాడు.
1986లో అర్జెంటీనాకి కెప్టెన్‌గా వ్యవహారించిన డీగో మారడోనా...ఆ జట్టుకు వరల్డ్‌కప్ అందించాడు. ఈ టోర్నీలో అర్జెంటీనా ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గేమ్ అంతా మైదానంలో ఉన్నాడు మారడోనా. ఐదు గోల్స్ చేయడమే కాకుండా ఐదు గోల్స్ అసిస్ట్ చేశాడు.
అటాకింగ్ మిడిల్ ఫీల్డర్‌గా, సెకండ్ స్ట్రైయికర్‌గా ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎన్నో చిత్రాలు చేసిన డీగో మారడోనా... బంతినా పాస్ చేయడంలోనూ, కంట్రోల్ చేయడంలోనూ, డ్రిబ్బింగ్ చేయడంలో ప్రత్యేకమైన స్కిల్స్ చూపించి మెజిషియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ దిగ్గడం పిలేతో కలిసి ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డు గెలిచిన మారడోనా... పీలే కంటే 35 శాతం ఎక్కువ ఓట్లు సంపాదించుకోవడం విశేషం. డీగో మారడోనాకి 53.6 శాతం ఓట్లు రాగా, పీలేకి 18.53 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫిఫా మ్యాగజైన్, జ్యూరీ ఓటింగ్‌లో పీలేకి ఎక్కువ ఓట్లు రావడంతో ఇద్దరికీ కలిపి ఈ అవార్డు ఇచ్చారు.
అతిచిన్న వయసులోనే ఫుట్‌బాల్ ప్రపంచంలోని తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న మారడోనా... అనేక వివాదాల్లో కూడా ఇరుక్కున్నాడు.
తనకు వచ్చిన బీభత్సమైన క్రేజ్‌ను తట్టుకోలేకపోయిన మారడోనా... దాని నుంచి తప్పించుకునేందుకు సెక్స్, డ్రగ్స్, అల్కహాల్ వంటివాటికి అలవాటు పడ్డారు...
మారడోనా ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేసిన అధికారులు, వాటి ఆధారంగా అతనిపై అనేక కేసులు పెట్టారు. అతని శరీరంలో డ్రగ్స్ అవశేషాలు దొరకడంతో 15 నెలలు ఫుట్‌బాల్ నుంచి నిషేధానికి గురైన మారడోనా... అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.
నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మారడోనా... అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. 22 ఏళ్ల పాటు వ్యసనాలతో సావాసం చేసిన మారడోనా 2007లో అన్నింటికీ స్వస్తి చెప్పాడు.
1986 ప్రపంచకప్‌లో మారడోనా కొట్టిన ఓ గోల్... ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా గుర్తింపు తెచ్చింది. మెక్సికో వేదికగా జూన్ 22న ఇంగ్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన మారడోనా... ఓ గోల్ చేసేటప్పుడు బంతికి అతని చేతి తగిలింది. రిఫరీలు దాన్ని గమనించకపోవడంతో గోల్‌గా ఇచ్చారు. ఈ గోల్ గురించి మారడోనాను ప్రశ్నించగా... ‘దేవుడి చేతితో గోల్ సాధించా...’ అంటూ సమాధానం ఇచ్చాడు. అందుకే మారడోనా మరణం తర్వాత ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ను ట్రెండ్ చేశారు అభిమానులు.