ఫిఫాలో ఓడినా భారీ డీల్.. సౌదీ క్లబ్‌కు ఆడనున్న రొనాల్డో.. రెండేండ్ల కాంట్రాక్టుకు అన్ని కోట్లా..!
Cristiano Ronaldo: ఇటీవలే ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా ప్రపంచకప్ లో సెమీస్ చేరడంలో విఫలమైన పోర్చుగల్ జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో తాజాగా భారీ డీల్ కుదుర్చుకున్నాడు.
కొద్దిరోజుల క్రితమే ఎడారి దేశం ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో భారీ ఆశలతో బరిలోకి దిగాడు సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. 37 ఏండ్ల రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్ అని ఫ్యాన్స్ భావిస్తున్న నేపథ్యంలో అతడు తన జట్టుకు కప్ అందిస్తాడని అంతా అనుకున్నారు.
కానీ క్వార్టర్స్ వరకూ నెగ్గుకొచ్చిన పోర్చుగల్.. ఆ దశలో మొరాకో తో జరిగిన పోరులో 0-1తో దారుణంగా ఓడింది. దీంతో రొనాల్డో ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయి. అదీగాక హెడ్ కోచ్ తో గొడవ, ఫిఫా ప్రారంభానికి ముందు మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి తప్పుకున్న రొనాల్డో తర్వాత అడుగులు ఎటుదిశగా పడతాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.
ఆ ఎదురుచూపులకు రొనాల్డో తెరదించాడు. ఇకనుంచి రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
‘కొత్త చరిత్రకు నాంది. ఇది మా క్లబ్ కు మరింత గొప్ప విజయం సాధించడానికి మాత్రమే కాదు, మా దేశంలో లీగ్, భవిష్యత్ తరాలలో ఆటపై స్ఫూర్తి నింపడానికి సంకేతం. సౌదీకి స్వాగతం రొనాల్డో..’ అని ట్వీట్ చేసింది.
2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ (రెండేండ్లు) రొనాల్డో.. అల్ నజర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ విలువ 500 మిలియన్ యూరోలుగా ఉందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 4,400 కోట్లు.
Image Credit: Getty Images (File Photo)
ఫిఫా ప్రపంచకప్ సందర్భంలో ఇదే డీల్ పై పలు రకాల కథనాలు వినిపించాయి. అప్పుడు రొనాల్డో వీటిని కొట్టిపారేసాడు. తాను ఎవరితో ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు భారీ డీల్ తో ప్రేక్షకులకు ముందు రావడం గమనార్హం.