సౌదీలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌లోకి మకాం మార్చిన రొనాల్డో.. నెలకు అద్దె ఎంతో తెలిస్తే...
Cristiano Ronaldo: సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్రపంచకప్ ముగిసిన తర్వాత సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ ‘అల్ నజర్’కు మారిన విషయం విదితమే. తాజాగా రొనాల్డో రియాద్ లోని అత్యంత విలాసవంతమైన హోటల్ లో అద్దెకు దిగాడు.
కొద్దిరోజుల క్రితమే ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా ప్రపంచకప్ లో క్వార్టర్స్ లో మొరాకో చేతిలో ఓడిన తర్వాత ఇంటిబాట పట్టిన పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో.. త్వరలోనే సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నజర్’ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు రొనాల్డో,అల్ నజర్ మధ్య ఒప్పందం కూడా కుదిరింది.
రెండేండ్ల పాటు అల్ నజర్ తో ఆడనున్న రొనాల్డోకు ఆ క్లబ్ కూడా భారీగానే ముట్టజెప్పింది. డీల్ విలువ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 4,400 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవలే సౌదీకి చేరుకున్న రొనాల్డోకు ఇక్కడి ప్రభుత్వం, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
మరి రియాద్ (సౌదీ రాజధాని) కు వచ్చిన రొనాల్డో లీగ్ మొదలయ్యేదాకా ఎక్కడ ఉంటాడు..? రియాద్ లోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ లలో ఒకటైన కింగ్‌డమ్ టవర్ లో ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్ లో రొనాల్డో అద్దెకు దిగాడు. సౌదీలోని అత్యంత విలాసవంతమైన హోటల్స్ లో ఇదీ ఒకటి.
సౌదీలో శాశ్వత నివాసం ఏర్పరుచుకునేదాకా రొనాల్డో ఇక్కడే ఉంటాడు. ఫోర్ సీజన్స్ లో నెలకు అద్దె రూ. 2.5 కోట్లు. ప్రస్తుతం తన పార్ట్నర్ జార్జినా రోడ్రిగ్, పిల్లలతో కలిసి ఉంటున్న రొనాల్డోకు ఇక్కడి హోటల్ సిబ్బంది సకల సదుపాయాలను అందిస్తున్నదని తెలుస్తున్నది.
ఫైవ్ స్టార్ హోటల్ అయిన ఫోర్ సీజన్స్.. రొనాల్డో కోసం చైనా, జపాన్ తో పాటు ఇండియా వంటకాలను కూడా రుచి చూపిస్తుందట. ఇందుకోసం ఆ హోటల్ ప్రత్యేక చెఫ్ లను నియమించుకుందని సమాచారం. రొనాల్డోకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో హోటల్ యాజమాన్యం సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.
కింగ్‌డమ్ టవర్స్ లోని 48, 50వ ఫ్లోర్ లలో ఈ హోటల్ ఉంది. హోటల్ లో రొనాల్డోకు ప్రత్యేకంగా లివింగ్ రూమ్, ప్రైవేట్ ఆఫీస్ , మీడియా రూమ్ వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. కింగ్‌డమ్ టవర్స్ లో షాపింగ్ చేసుకోవడానికి వీలుగా అక్కడ మల్టీ నేషనల్ బ్రాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలుస్తున్నది.
ఇదిలాఉండగా రొనాల్డో కోసం సౌదీ చట్టాలను సైతం పక్కనబెట్టింది. సౌదీలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లకు అనుమతి లేదు. అక్కడి చట్టాల ప్రకారం అది చెల్లదు. కానీ రొనాల్డో.. రోడ్రిగ్ విషయంలో మాత్రం దీనిని చూసీ చూడనట్టు వదిలేయాలని సౌదీ అధినేతల నుంచి ఆదేశాలు జారీ అయిందని సమాచారం.