FIFA:రొనాల్డోకు బంపరాఫర్.. సౌదీతో రూ. 1800 కోట్ల డీల్..?
Cristiano Ronaldo: సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం చివరి ప్రపంచకప్ (?) ఆడుతున్నాడు. ఈ పోర్చుగల్ వీరుడు ఘనాతో జరిగిన తొలి మ్యాచ్ లో తన దేశానికి గోల్ కొట్టి విజయాన్ని అందించాడు. తాజాగా ఉరుగ్వేతో కూడా రాణించాడు.
పోర్చుగల్ ఫుట్‌బాల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో ఈసారి ఫిఫా ప్రపంచకప్ నెగ్గాలనే పట్టుదలలో తన జట్టు తరుఫున సూపర్ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సాకర్ దిగ్గజం ఇటీవలే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లోని మాంచెస్టర్ యూనైటైడ్ తో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిగంటల ముందు రొనాల్డో.. పీర్స్ మోర్గాన్ తో ఇంటర్వ్యూలో మాంచెస్టర్ యూనైటెడ్ జట్టు, మేనేజర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ ఇంటర్వ్యూ తర్వాత రొనాల్డోతో మాంచెస్టర్ యూనైటెడ్ తెగదెంపులు చేసుకుంది.
ఈ నేపథ్యంలో రొనాల్డో ఏ లీగ్ లో ఆడతాడు..? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. తాజాగా పలు అంతర్జాతీయ క్రీడా వెబ్‌సైట్లలో వస్తున్న సమాచారం మేరకు.. రొనాల్డో బంపరాఫర్ దక్కించుకున్నాడని తెలుస్తున్నది. సౌదీ అరేబియాకు చెందిన దిగ్గజ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ అల్ నసర్ తో రొనాల్డో భారీ డీల్ కుదుర్చుకున్నాడని సీబీఎస్ స్పోర్ట్స్ నివేదిక తెలిపింది.
ఈ డీల్ ప్రకారం.. అల్ నసర్ రొనాల్డోతో మూడేండ్లకు గాను 225 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1,840 కోట్లు. ఏడాదికి 75 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 612 కోట్లు)తో ఈ డీల్ కుదిరిందని, ఇందుకు రొనాల్డో కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం.
అల్ నసర్ ఆసియాలోనే అత్యంత విజయవంతమైన క్లబ్ లలో ఒకటి. ఇప్పటివరకూ అల్ నసర్ 9 లీగ్ టైటిల్స్ ను సొంతం చేసుకుంది. అల్ నసర్ - రొనాల్డో కలిస్తే ఇక అది మరింత సక్సెస్ పొందుతుందని అల్ నసర్ యాజమాన్యం భావిస్తున్నది. ఇందుకే భారీ అమౌంట్ అయినా వెచ్చించడానికి ముందుకొచ్చింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ - హెచ్ లో ఉన్న పోర్చుగల్ లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ లలో ఘన విజయాలు అందుకుంది. తొలి మ్యాచ్ లో ఘనాను ఓడించిన రొనాల్డో జట్టు.. రెండో మ్యాచ్ లో సోమవారం ఉరుగ్వేను కూడా ఓడించి గ్రూప్ టాపర్ గా ఉంది. ఈ విజయంతో పోర్చుగల్ రౌండ్ - 16కు కూడా ఎంపికైనట్టే. లీగ్ లో తమ చివరి మ్యాచ్ ను ఆ జట్టు సౌత్ కొరియాతో ఆడనుంది.