రొనాల్డో లేకుండానే బరిలోకి దిగిన పోర్చుగల్.. కెప్టెన్‌ను ఎందుకు పక్కనబెట్టినట్టు..?
FIFA WC 2022: తన కెరీర్ లో చివరి ప్రపంచకప్ (?) ఆడుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు ఊహించని షాక్ తాకింది. ప్రిక్వార్టర్స్ లో భాగంగా మంగళవారం అర్థరాత్రి ఖతర్ వేదికగా ముగిసిన స్విట్జర్లాండ్ - పోర్చుగల్ మ్యాచ్ లో రొనాల్డో ఆడలేదు.
సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ జాతీయ జట్టు షాకిచ్చింది. 37 ఏండ్ల రొనాల్డోకు ఇది చివరి ప్రపంచకప్ (?)గా భావిస్తుండగా మంగళవారం ముగిసిన ప్రిక్వార్టర్స్ గేమ్ లో భాగంగా స్విట్జర్లాండ్ తో మ్యాచ్ లో రొనాల్డో లేకుండానే పోర్చుగల్ బరిలోకి దిగింది.
రొనాల్డో ను బెంచ్ కే పరిమితం చేసిన పోర్చుగల్.. కెప్టెన్ లేకున్నా అత్యద్భుత ఆటతీరుతో స్విట్జర్లాండ్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో పోర్చుగల్ ఏకంగా 6-1 తేడాతో స్విస్ జట్టును ఇంటిబాట పట్టించింది. రొనాల్డో స్థానంలో వచ్చిన గొంకాలో రమోస్ హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ క్వార్టర్స్ కు అర్హత సాధించింది.
అయితే రొనాల్డోను ఎందుకు ఆడించలేదు...? బెంచ్ కు పరిమితం చేయడానికి గల కారణాలేంటి..? అన్నది తీవ్ర చర్చనీయాంశమైంది. రొనాల్డో కు పోర్చుగల్ హెడ్ కోచ్ ఫెర్నాండో సాంటోస్ కు మధ్య విభేదాల కారణంగానే ఈ మ్యాచ్ లో దిగ్గజ ఆటగాడిని పక్కనబెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ స్విట్జర్లాండ్ తో మ్యాచ్ కు ముందు పోర్చుగల్ హెడ్ కోచ్ మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు. ఇది వ్యూహంలో భాగమేనని చెప్పడం గమనార్హం. సాంటోస్ మాట్లాడుతూ.. ‘క్రిస్టియానో, రామోస్ ఇద్దరు డిఫరెంట్ ప్లేయర్స్. కెప్టెన్ (రొనాల్డో) తో నాకు, టీమ్ కు ఎటువంటి సమస్యా లేదు. ఇది వ్యూహంలో భాగమే..’ అని తెలిపాడు.
లీగ్ దశలో సౌత్ కొరియాతో మ్యాచ్ లో జట్టు ప్రదర్శనపై రొనాల్డో.. కోచ్ తో పాటు ఆటగాళ్లపై అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న సాంటోస్.. రొనాల్డోపై పగ తీర్చుకున్నాడని కూడా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్ లో బెంచ్ మీదే ఉన్న రొనాల్డో.. ఆట 73వ నిమిషంలో ఫీల్డ్ లోకి వచ్చాడు.
2008 తర్వాత మేజర్ టోర్నీలలో రొనాల్డోను బెంచ్ మీద కూర్చోబెట్టడం ఇదే ప్రథమం. ఇదిలాఉండగా రొనాల్డో లేకున్నా పోర్చుగల్ దుమ్మురేపింది. కొత్త కుర్రాడు రామోస్.. ఆట 17వ నిమిషంలో గోల్ కొట్టి పోర్చుగల్ కు ఆధిక్యంలో నిలిపాడు. తర్వాత పెపె ఆట 30వ నిమిషంలో గోల్ చేశాడు.
హాఫ్ టైమ్ తర్వాత రామోస్ మళ్లీ రెచ్చిపోయాడు. ఆట 51, 67వ నిమిషాల్లో మరో రెండు గోల్స్ చేశాడు. మధ్యలో మన్యూల్ అకంజి (58వ నిమిషంలో) మరో గోల్ కొట్టాడు. 90 నిమిషాలు ముగిసిన తర్వాత అదనపు టైమ్ లో కూడా పోర్చుగల్ తరఫున రాఫెల్ లియో గోల్ చేయడంతో ఆ జట్టుకు తిరుగులేని ఆధిక్యం దక్కింది.