నేనా.. సౌదీకా..? అల్ నజర్ క్లబ్‌కు ఆడుతున్నాడనే వార్తలపై రొనాల్డో స్పందన
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ లో తన దేశం తరఫున పాల్గొంటున్నాడు. కానీ త్వరలోనే రొనాల్డో సౌదీ అరేబియాలోని ఓ క్లబ్ తరఫున ఆడనున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఫిఫా ప్రపంచకప్ లో పోర్చుగల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న కొద్దిరోజుల క్రితమే ఫ్రాంచైజీ టీమ్ కు గుడ్ బై చెప్పాడు. ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ యూనైటైడ్ తరఫున ఆడిన రొనాల్డో.. ఫిఫాకు ముందు తాను ఆ ఫ్రాంచైజీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. పరస్పర అంగీకారంతో మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి బయటకు వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే రొనాల్డో ఫిఫా తర్వాత ఏ ఫ్రాంచైజీకి ఆడతాడు..? మళ్లీ యూరోపియన్ లీగ్ ఫ్రాంచైజీల కన్ను రొనాల్డో మీదే ఉన్నా అతడు మాత్రం సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ కు ఆడనున్నాడనే వార్తలు వస్తున్నాయి.
మూడేండ్ల పాటు అల్ నజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ప్రతీ యేటా సుమారు రూ. 600 కోట్లకు పైగా రొనాల్డోకు ముట్టజెప్పేందుకు డీల్ ఓకే అయిందని కూడా వార్తలు వచ్చాయి. మరికొన్ని వార్త పత్రికలు మూడేండ్లపాటు ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల డీల్ కుదరిందని కూడా రాసుకొచ్చాయి.
అయితే దీనిపై తాజాగా స్వయంగా రొనాల్డోనే స్పందించాడు. తాను ఏ క్లబ్ కు వెళ్లడం లేదని.. ప్రస్తుతానికి తన దృష్టంతా ప్రపంచకప్ మీదే ఉందని చెప్పాడు. పోర్చుగల్ తో మ్యాచ్ కు ముందు ఓ యూరోపియన్ టీవీ ఛానెల్ ఇదే ప్రశ్నను రొనాల్డోను అడగగా.. ‘లేదు.. అది నిజం కాదు..’ అని చెప్పడం విశేషం.
ఇక ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా బుధవారం పోర్చుగల్ - స్విట్జర్లాండ్ నడుమ జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో రొనాల్డో బెంచ్ కే పరిమితం కావడం గమనార్హం. రొనాల్డోకు కోచ్ ఫెర్నాండో సాంటోస్ కు మధ్య విబేధాలు తలెత్తాయని.. జట్టుతో కూడా రొనాల్డోకు సంబంధాలు దెబ్బతిన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్విట్జర్లాండ్ తో మ్యాచ్ లో రొనాల్డో ఆడకున్నా.. పోర్చుగల్ దుమ్మురేపింది. కొత్త కుర్రాడు రామోస్.. ఆట 17వ నిమిషంలో గోల్ కొట్టి పోర్చుగల్ కు ఆధిక్యంలో నిలిపాడు. తర్వాత పెపె ఆట 30వ నిమిషంలో గోల్ చేశాడు. హాఫ్ టైమ్ తర్వాత రామోస్ మళ్లీ రెచ్చిపోయాడు. ఆట 51, 67వ నిమిషాల్లో మరో రెండు గోల్స్ చేశాడు. మధ్యలో మన్యూల్ అకంజి (58వ నిమిషంలో) మరో గోల్ కొట్టాడు. 90 నిమిషాలు ముగిసిన తర్వాత అదనపు టైమ్ లో కూడా పోర్చుగల్ తరఫున రాఫెల్ లియో గోల్ చేయడంతో ఆ జట్టుకు తిరుగులేని ఆధిక్యం దక్కింది. ఫలితంగా పోర్చుగల్ 6-1 తేడాతో ఈ మ్యాచ్ లో గెలుపొందింది.