పిస్తా పప్పును ఎవరెవరు తినకూడదు?
పిస్తాలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పిస్తాలు అందరికీ మేలు చేయవు. అంటే కొంతమంది వీటిని తింటే సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇంతకీ పిస్తాలను ఎవరెవరు తినకూడదంటే?
టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లో పిస్తాలు ఒకటి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటి ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటిని లిమిట్ లోనే తినాలి. కానీ కొంతమంది వీటిని మోతాదుకు మించి తింటుంటారు. పిస్తాలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, రాగి, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, విటమిన్ బి 6, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిస్తాపప్పు తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇది మన అలసటను, బలహీనతను పోగొడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పిస్తాలను కొంతమంది మాత్రం తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అలెర్జీ
పిస్తాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే గింజలను లేదా విత్తనాలను అలెర్జీ ఉన్నవారు పిస్తాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పిస్తాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఒకవేళ మీకు అలెర్జీ ఉంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే పిస్తాలను తినాలి.
కిడ్నీ పేషెంట్లు
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి కూడా పిస్తాలు మంచివి కావు. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లున్నవారు వీటిని తింటే కిడ్నీలో రాళ్లు మరింత పెరుగుతాయి.
బరువు తగ్గాలనుకునేవారికి
ఊబకాయం తగ్గాలనుకునే వారు పిస్తాలను తినకపోవడమే మంచిది. ఒకవేళ తిన్నా తక్కువ మొత్తంలోనే తినాలి. ఎందుకంటే పిస్తాలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ బరువును బాగా పెంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు పిస్తాలను తక్కువ తినడమే మంచిది.
జీర్ణ సంబంధ సమస్యలు
చాలా మందికి జీర్ణ సమస్యలు ఎప్పుడూ వస్తుంటాయి. ఇలాంటి వారు కూడా పిస్తాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఎండాకాలంలో పిస్తాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. ఇలాంటి వాటిని తినడం వల్ల ఎసిడిటీ, అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పిస్తాలను ఎక్కువగా తినకూడదు.
ఏదైనా వ్యాధికి రెగ్యులర్ గా మందులు వేసుకుంటే
ఏదైనా అనారోగ్య సమస్య ఉండి మీరు క్రమం తప్పకుండా మందులను వాడుతున్నట్టైతే పిస్తాలను తినకపోవమే మంచిది. అలాగే పిస్తాలు ఉన్న ఆహారాలను తినకూడదు. ఒకవేళ వాటిని తినాలనుకుంటే డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మందులతో చెడు ప్రభావాలను కలిగిస్తాయి.
చిన్న పిల్లలు
చిన్న పిల్లలు కూడా పిస్తాలను తినకూడదు. ఎందుకంటే చాలా మంది పిల్లలు పిస్తాలను నమలకుండా అలాగే మింగేస్తుంటారు. ఇది గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది. దీనివల్ల పిల్లలకు ఊపిరిఆడదు.