Diabetes: ఇవి తిన్నా.. షుగర్ కంట్రోల్ అవుతుంది
డయాబెటీస్ ఉన్నవారికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు.

షుగర్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని రకాల ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. దీంతో ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మందులతో పాటుగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. వీటితో పాటుగా రోజువారి ఆహారంలో కొన్నింటిని చేర్చాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే కొన్ని పోషకాహారాలను తింటే డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. బ్లడ్ షుగర్ తగ్గడానికి మధుమేహులు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పచ్చి ఆకులు
బచ్చలికూర, కాలే,స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలు డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ ఆకు కూరల్లో కార్భోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ను తగ్గిస్తుంది. అలాగే మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిలో మిమ్మల్ని హెల్తీగా ఉంచే విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, వంటి రకరకాల బెర్రీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఇవి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడానికి కూడా బాగా సహాయపడతాయి. ఈ పండ్లలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తింటే శరీరంలో మంట తగ్గుతుంది. అలాగే ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. బెర్రీల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది.
గింజలు, విత్తనాలు
వాల్ నట్స్, బాదం, చియా విత్తనాలు వంటి గింజలు, విత్తనాలు బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ లు మెండుగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. గింజలు, విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సున్నితత్వానికి ఎంతో అవసరం.
క్వినోవా
క్వినోవా కూడా డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచిది. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేఅవకాశమే ఉండదు. క్వినోవాలో గ్లూటెన్ అసలే ఉండదు. కాబట్టి గ్లూటెన్ సున్నితత్వం ఉన్నవారికి ఇది మంచిది.
Avocado
అవోకాడో
అవోకాడోలు షుగర్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో హెల్తీ ఫ్యాట్స్, పొటాషియం, ఫైబర్ మెండుగా ఉంటాయి. అవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అవోకాడోలో మెండుగా ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.