Pulses storage: పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?
పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

కందిపప్పు, మినపప్పు, బఠానీలు, బీన్స్, శనగలు వంటి పప్పు ధాన్యాలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి వంట చేయడానికి ఏదో ఒక పప్పు అవసరం అవుతూనే ఉంటుంది. వీటిలో చాలా పోషకాలు, ప్రోటీన్ ఉంటాయి. అందుకే రెగ్యులర్ గా మన భోజనంలో భాగం చేసుకుంటూ ఉంటారు. ఈ పప్పులతో మనం చాలా రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం.
వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వాటిని ఎక్కువ మొత్తంలో కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే, తెచ్చిన కొద్ది రోజులకే పురుగులు పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా మంచి డబ్బాలో నిల్వ చేసినా కూడా పురుగు పట్టేస్తూ ఉంటుంది. పప్పు నాణ్యత కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా.. పప్పులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయండి:
పప్పులు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే వాటిని నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడమే. పప్పులు తేమను త్వరగా పీల్చుకుంటాయి కాబట్టి వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే తేమ లోపలికి రాకుండా ఉంటుంది, అవి తాజాగా ఉంటాయి. దీనికోసం మీరు గాజు జాడీ, ప్లాస్టిక్ డబ్బా లేదా గట్టి మూతలు ఉన్న లోహపు డబ్బాలను ఉపయోగించవచ్చు. వాటిలో పప్పుల్ని నిల్వ చేయవచ్చు. ముఖ్యంగా గాలి చొరబడకుండా గట్టిగా మూసి ఉంచండి.
చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి:
వేడి నుండి పప్పుల్ని రక్షించడం చాలా ముఖ్యం. కాబట్టి వాటిని ప్రత్యక్ష సూర్యకాంతి, తేమ నుండి దూరంగా చల్లని ప్రదేశంలో ఉంచి నిల్వ చేయండి. వేడి, అధిక తేమ పప్పుల్ని త్వరగా చెడిపోయేలా చేస్తాయి, పురుగులు, చీడపురుగులు వస్తాయి. కాబట్టి పప్పుల్ని స్టవ్‌లు, కిటికీల దగ్గర ఉంచకండి.
జిప్ లాక్ బ్యాగ్:
చాలా నెలలైనా పప్పులు చెడిపోకుండా ఉండాలంటే వాటిని జిప్ లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయవచ్చు. ఈ బ్యాగ్‌లు గాలిని బయటకు పంపుతాయి. పప్పులు చెడిపోకుండా ఉండటమే కాకుండా, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కూడా సహాయపడతాయి. ఈ విధంగా నిల్వ చేసిన పప్పులు ఒక సంవత్సరం అయినా వాటి పోషకాలను కోల్పోకుండా అలాగే ఉంటాయి.
వెల్లుల్లి:
పప్పుల్లో పురుగులు పట్టకుండా ఉండాలంటే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పప్పులు ఉన్న డబ్బాల్లో వేయండి. వెల్లుల్లి పురుగుల నుండి పప్పుల్ని రక్షించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి ఎండిపోతే వాటిని తీసేసి కొత్త వాటిని వేయండి. దీనివల్ల మీ పప్పు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది. కాదు అంటే.. మీరు ఎండు కొబ్బరి చిప్పను పప్పుల డబ్బాలో ఉంచినా కూడా పురుగులు పట్టవు.
బిర్యానీ ఆకు:
బిర్యానీ ఆకు సహజమైన క్రిమిసంహారకం, కాబట్టి దీన్ని పప్పులు ఉన్న డబ్బాల్లో వేస్తే పురుగులు, చీడపురుగులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పప్పులు చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.