హార్ట్ పేషెంట్లు తినకూడని ఆహారాలు ఇవి..
హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హార్ట్ పేషెంట్లు కొన్ని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ సమస్యను మరింత పెంచుతాయి.
ప్రస్తుత కాలంలో.. బిజీ లైఫ్ కారణంగా ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న విషయాలను జనాలు పట్టించుకోవడం మానేశారు. దీనివల్లే లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. ఇందులో ఒకటి గుండె సంబంధిత సమస్య. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె జబ్బులు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మనం తినే ఆహారపు అలవాట్లు బాగుంటే.. గుండె జబ్బులే కాదు ఎన్నో రోగాల ముప్పును కూడా తగ్గించుకోవచ్చు. మీరు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చక్కెర, ఉప్పు, కొవ్వు
ఎక్కువ మొత్తంలో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు కూడా గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. మీకు ఇప్పటికే గుండె జబ్బులు ఉంటే వీటికి వీలైనంత దూరంగా ఉండండి. అలాగే మీ గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోండి.
ఎర్ర మాంసం
గొడ్డు మాంసం, గొర్రె, పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది డయాబెటీస్ సమస్యను కూడా పెంచుతుంది. వీటిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇదే గుండెజబ్బులకు దారితీస్తుంది. అలాగే ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
సోడా
సోడా కూడా హార్ట్ పేషెంట్లకు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో సిఫార్సు చేసే దానికంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. సోడా తాగేవారు బరువు బాగా పెరుగుతారు. అలాగే ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు కూడా వస్తాయి.
కాల్చిన ఆహారాలు
కుకీలు, కేకులు, మఫిన్లు టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి మీ ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అలాగే మైదా పిండి మీ రక్తంలో చక్కెరను పెంచుతుంది. దీంతో మీ ఆకలి విపరీతంగా పెరుగుతుంది. దీంతో మీరు తీపి పదార్థాలనే ఎక్కువగా తింటారు. కానీ ఇవన్నీ మీ గుండె జబ్బులను మరింత పెంచుతాయి.
హార్ట్ పేషెంట్లు ఐస్ క్రీం పే తినకూడదు. అలాగే షుగర్ కు దూరంగా ఉండాలి. మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని కూడా తగ్గించాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.