Shambhala Nagaram: శంభాల నగరం మనదేశంలో ఎక్కడుంది? దీనికెందుకంత ప్రాధాన్యం?
Shambhala Nagaram: తెలుగు సినిమాల్లో శంభాల నగరం పేరు ఎక్కువ వినిపిస్తుంది. మొదట కల్కి సినిమాలో, ఇప్పుడు శంబాల పేరు మీద సినిమా విడుదలైంది. అసలు ఈ నగరం మనదేశంలో ఏ ప్రాంతానికి చెందింది.

కల్కి సినిమాలో శంభాల నగరం
ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో తొలిసారి శంభాల నగరం గురించి విన్నాము. అది ఒక ఫాంటసీ విలేజ్ లాగా చూపించారు. ఇప్పుడు ఈ నగరం పేరు మీదే సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ నగరం గురించి తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సినిమాల్లో శంభాలా నగరాన్ని ప్రపంచాన్ని కాపాడే కేంద్రంగా చూపిస్తారు. మరికొన్ని కథల్లో కలియుగానికి ముగింపు తీసుకొచ్చే అవతారానికి పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. ఇలా వెండితెరపై చూసిన శంభాల నగరం నిజంగా భారతదేశంలో ఉందా? మన చరిత్రలో శంభాల ఉండేదా? పురాణాల్లో చెప్పిన ఒక రహస్య స్థలమా? అనే ప్రశ్న చాలామందిలో ఉంది. చరిత్ర, పురాణాలు, బౌద్ధ గ్రంథాలు శంభాలా నగరం గురించి ఏమి చెబుతున్నాయో తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పురాణాలలో శంభాల నగరం
భారత పురాణాల్లో శంభాల నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా విష్ణు పురాణం, భాగవత పురాణం వంటి గ్రంథాల్లో శంభాల నగర ప్రస్తావన కనిపిస్తుంది. కలియుగం చివరిలో ధర్మాన్ని స్థాపించేందుకు విష్ణువు కల్కి అవతారంగా అవతరిస్తాడని.. ఆ కల్కి అవతారం శంభాల గ్రామంలో జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇదే కథగా ప్రభాస్ కల్కి సినిమా వచ్చింది. అక్కడ ప్రపంచ శ్రేయస్సు కోసం ఋషులు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారు నివసిస్తారని చెప్పుకుంటారు. శంభాల ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం లాగా పురాణాల్లో కనిపిస్తుంది. అయితే ఈ వర్ణనల్లో ఆ నగరం ఎక్కుడుందో చెప్పే స్పష్టమైన భౌగోళిక వివరాలు మాత్రం లేవు. దీంతో అదొక కల్పిత నగరంగా మిగిలిపోయింది. ఈ నగరం పేరు చెబితే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఇది నిజమైన నగరంగా కాకుండా, ధర్మాన్ని కాపాడే పవిత్ర స్థలానికి ప్రతీకగా మాత్రమే చెప్పుకుంటారు.
బౌద్ధులు నివసించారా?
శంభాల నగరం గురించి బౌద్ధ సాహిత్యంలో కూడా ఎన్నో సార్లు ప్రస్తావన ఉంది. ముఖ్యంగా కాలచక్ర తంత్రంలో శంభాల ఒక అత్యంత పవిత్ర రాజ్యంగా చెప్పుకుంంటారు. అక్కడ నివసించే వారు జ్ఞానవంతులు, ధర్మపరులు అని చెప్పుకుంటారు. ఆ రాజ్యం భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని కూడా బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కొన్ని కథనాల ప్రకారం శంభాల నగరం హిమాలయ ప్రాంతాలకు అవతల వైపు ఉంటాయని చెప్పుకుంటారు. సాధారణ మనుషులకు ఈ నగరంలోకి ప్రవేశం ఉండదని అంటారు. అందుకే ఆ నగరం ఎక్కడుందో కూడా సాధారణ వ్యక్తులకు తెలియదు. చైనా, టిబెట్ దేశాల్లో కూడా శంభాల గురించి కథలు ఉన్నాయి. అందుకే కొంతమంది పరిశోధకులు శంభాల అనేది ఒక భౌతిక నగరం కాదని అంటారు. కేవలం మనసు శుద్ధి, ఆత్మజ్ఞానం ఉన్నవారికే ఆ నగరం కనిపిస్తుందనే భావన ప్రచారంలో ఉంది.
ఎలాంటి ఆధారాలు లేవు
చరిత్ర పరంగా పరిశీలిస్తే శంభాల అనే పేరుతో ఉన్న నగరం లేదా రాజ్యం ఉందని నిర్ధారించే ఎలాంటి పురావస్తు ఆధారాలు ఇప్పటివరకు లేవు. భారత చరిత్రలో ఉన్న నగరాలు, రాజ్యాల గురించి శాసనాలు, నాణేలు, పురావస్తు అవశేషాలు లభిస్తాయి. కానీ శంభాల విషయంలో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. అయితే కొన్ని గ్రామాలు, ప్రాంతాలకు శంభాల, శంబల్, శంబలపూర్ వంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ శంభాల నుంచి పుట్టినవే అని భావిస్తారు. ఒడిశాలోని శంబల్పూర్, ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ నగరం పేరు ఉంది. అయితే వీటితో పురాణాల్లో చెప్పిన శంభాలతో నేరుగా సంబంధం ఉందని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే శంభాల నగరం భారత చరిత్రలో ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. భారత పురాణాలు, బౌద్ధ సాహిత్యం శంభాలను ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే చూపిస్తున్నాయి. శంభాల అనేది మనకు ధర్మం, న్యాయం, శాంతి విలువలను గుర్తు చేసే ఒక ప్రతీక నగరం. అందుకే శంభాల నగరం చరిత్రలో కనిపించకపోయినా, భారతీయ సాంస్కృతిక భావజాలంలో అది ఇప్పటికీ జీవించే ఉంటుంది.

