Pattu Sarees: మనదేశంలో పట్టు చీరలకు పెట్టింది పేరు ఈ నగరాలు.. అక్కడ ధరలు ఎంత తక్కువంటే
Pattu Sarees: పట్టుచీరలకు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి వేడుకకు పట్టుచీర ఉండాల్సిందే. అయితే భారతదేశంలో కొన్ని నగరాలు పట్టుచీరలకు పెట్టింది పేరు. ఇక్కడ తక్కువ ధరకే మంచి చీరలు దొరుకుతాయి.

పట్టుచీరల నగరం ఇది
భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పట్టు చీరలే. మన దేశంలో పట్టు చీరలకు అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం తమిళనాడులోని కాంచీపురం. దీనిని 'సిల్క్ సిటీ' అని పిలుస్తారు. ఇక్కడ చేనేత కార్మికులు నేసే కంచి పట్టు చీరలు దట్టమైన మల్బరీ పట్టు, నాణ్యమైన జరీ, ఆలయాల డిజైన్లతో ఎంతో మన్నికగా ఉంటాయి. దక్షిణ భారతదేశ పెళ్లిళ్లలో వధువులు వీటినే కట్టుకునేందుకు ఇష్టపడతారు. ఇక్కడ కంచి పట్టు చీరల ధరలు సాధారణంగా రూ. 8,000 నుంచి మొదలవుతాయి. అసలైన వెండి, బంగారు జరీతో నేసిన భారీ పెళ్లి చీరలు రూ. 50,000 నుంచి రూ. 2 లక్షలకు పైగా పలుకుతాయి. కంచి తరువాతా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసి (బనారస్) పట్టు చీరలకు పెద్ద కేంద్రం. సున్నితమైన బంగారు, వెండి జరీతో అద్భుతంగా నేసే బనారసీ పట్టు చీరలు రూ. 5,000 నుంచి రూ. 1 లక్ష వరకు అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నాణ్యమైన పట్టు చీరలకు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ ధర్మవరం నగరాన్ని 'ఆంధ్రప్రదేశ్ సిల్క్ సిటీ' అంటారు. రెండు రంగుల షేడ్స్, పెద్ద కొంగు, బంగారు జరీ అంచులతో ధర్మవరం పట్టు చీరలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటి ధరలు రూ. 5,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటాయి. కాకినాడ సమీపంలోని ఉప్పాడ పట్టణం తేలికపాటి పట్టు చీరలకు ప్రసిద్ధి. కంచి, ధర్మవరం చీరలతో పోలిస్తే ఇవి చాలా తేలికగా ఉండి, రోజంతా కట్టుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఉప్పాడ పట్టు చీరలు రూ. 4,000 నుంచి రూ. 30,000 మధ్య లభిస్తాయి. తిరుపతి దగ్గరలోని వెంకటగిరిలో నెమళ్లు, చిలుకలు, మామిడి పిందెల జాందానీ డిజైన్లతో నేసే పట్టు చీరలు రూ. 3,500 నుంచి రూ. 25,000 వరకు దొరుకుతాయి. సులభంగా కట్టుకునే విధంగా ఉండటం వీటి ప్రత్యేకత.
తమిళనాడులో..
తమిళనాడులోని ఆరణి, కర్ణాటకలోని మైసూరు నగరాలు కూడా పట్టు వస్త్రాలకు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆరణిలో ప్రకాశవంతమైన రంగులు, రెండు వైపులా వేర్వేరు అంచులతో తేలికపాటి పట్టు చీరలను నేస్తారు. పండుగలకు, బహుమతులుగా ఇవ్వడానికి ఎక్కువగా వాడే ఈ చీరల ధరలు రూ. 3,000 నుంచి రూ. 15,000 వరకు ఉంటాయి. ఇక మైసూరు సిల్క్ చీరలు చాలా మృదువుగా, సింపుల్ అంచులతో ఎంతో హుందాగా ఉంటాయి. గుళ్లకు, అధికారిక వేడుకలకు బాగా నప్పే వీటి ధరలు రూ. 4,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటాయి. అయితే పట్టు నాణ్యత, జరీ రకం, చేనేత పనితనాన్ని బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి. సెమీ సిల్క్ చీరలు తక్కువ ధరకే దొరికినా, అసలైన స్వచ్ఛమైన పట్టు చీరలను కొనేటప్పుడు 'సిల్క్ మార్క్' ట్యాగ్ చూసి కొనడం ఎంతో మంచిది.











