Facts : 1 మిలియన్ ని 1M అంటారు.. మరి థౌజండ్ ని 1T కాకుండా 1K అని ఎందుకంటారు?
10 లక్షలకు ఇంగ్లీష్ లో 1 మిలియన్ అంటారు.. కాబట్టి 1M అంటారు. కానీ వెయ్యిని ఇంగ్లీషులో Thousand అంటారు… అలాంటప్పుడు 1T అని కాకుండా 1K అని ఎందుకు వాడుతున్నారు?
వెయ్యిని 1K అని ఎందుకంటారు?
సోషల్ మీడియా యుగంలో వెయ్యిని ‘K’ గా పేర్కొంటారు… ఓ వీడియో లేదా పోస్ట్ కి 1000 వ్యూస్ వచ్చాయంటే 1K అన్నమాట. ఇలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లో వీడియోలు, పోస్టుల కింద K అనే పదాన్ని తరచూ చూస్తుంటాం… పదివేల ఫాలోవర్లు ఉంటే 10K అంటాం, లక్ష వ్యూస్ వస్తే 100K అంటాం.
ఇక్కడ మీరో విషయం గమనించారా..? 10 లక్షలను ఇంగ్లీష్ లో మిలియన్ అంటారు… కాబట్టి 1M గా పేర్కొనడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ 1000 ని ఇంగ్లీష్ లో థౌజండ్ అంటారు… అలాంటప్పుడు 1T అనాలిగాని 1K అని ఎందుకంటారు. మరి 'T'కి బదులు 'K' ఎందుకు వాడుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న అక్షరం వెనుక కొన్ని శతాబ్దాల ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. అదేంటో తెలుసుకుందాం.
గ్రీకు సామ్రాజ్యం నుంచి పుట్టిన పదమే ఈ K
1000 ని T గా కాకుండా K గా పేర్కొనడం వెనక ఓ ఆసక్తికర ప్రాచీన స్టోరీ దాగివుంది. శతాబ్దాల క్రితం ప్రాచీన గ్రీకు దేశంలో థౌజండ్ ను K గా పేర్కొనే కల్చర్ మొదలైంది. గ్రీకు లాంగ్వేజ్ లో వెయ్యి అనే సంఖ్యను సూచించడానికి 'చిలియోయ్' (Chilioi) అనే పదాన్ని వాడేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది భాషా రూపాలు మారుతూ రావడంతో ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఈ పదాన్ని మరింత సులభతరం చేసి 'కిలో' (Kilo)గా మార్చారు. అలా వెయ్యి అనే సంఖ్యకు 'కిలో' అనే పదం స్థిరపడింది.
K అంటే ఏమిటి?
పద్దెనిమిదవ శతాబ్దం చివర్లో ఫ్రాన్స్ దేశం ప్రపంచానికి ఒక కొత్త తూనికలు, కొలతల వ్యవస్థను పరిచయం చేసింది… అదే మెట్రిక్ సిస్టమ్. ఇందులో ప్రతి వెయ్యి యూనిట్లను ఒక 'కిలో' అని పిలవడం ప్రారంభించారు. ఉదాహరణకు… వెయ్యి గ్రాములు కలిస్తే ఒక కిలోగ్రామ్, అలాగే వెయ్యి మీటర్లు కలిస్తే ఒక కిలోమీటర్ అవుతుంది. ఈ 'కిలో' అనే పదం మొదటి అక్షరమే ఇప్పుడు మనం చూస్తున్న 'K' అన్నమాట. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో సంఖ్యలను సులభంగా రాయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడింది.
'T' అక్షరాన్ని ఎందుకు వాడరు?
చాలామందికి వచ్చే సాధారణ సందేహం ఏంటంటే థౌజండ్‌కు 'T' వాడొచ్చు కదా అని. కానీ శాస్త్రీయ పరిభాషలో 'T' అనే అక్షరాన్ని 'టెరా' (Tera) కోసం కేటాయించారు. టెరా అంటే ఒక ట్రిలియన్ (లక్ష కోట్లు) అని అర్థం. ఒకవేళ వెయ్యికి కూడా 'T' వాడితే టెక్నికల్, ఆర్థిక రంగాల్లో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. అందుకే అంతర్జాతీయంగా స్పష్టత కోసం 'K' అక్షరాన్నే కొనసాగించారు.
సోషల్ మీడియా, డిజిటల్ ప్రపంచంలో క్రేజ్
ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరిగాక 'K' అక్షరానికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద సంఖ్యలు రాయడం కంటే 1K, 10K లేదా 50K అని రాయడం చాలా సులభమైంది.
కేవలం డిజిటల్ ప్రపంచంలోనే కాదు, ఈ రోజుల్లో ఉద్యోగాల జీతాల విషయంలో కూడా 40K, 50K అని సర్వసాధారణంగా మాట్లాడుకుంటున్నారు. భాషా పరిణామం, శాస్త్రీయ అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కలిసి ఒక సాధారణ గ్రీకు పదాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిహ్నంగా మార్చాయి. నిన్నటి తరం కొలతలకు పరిమితమైన 'కిలో', నేటి డిజిటల్ ప్రపంచంలో వెయ్యి అనే సంఖ్యకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.

