ఈ ఆసక్తికరమైన విశేషాలు ఈ వారం మీరు మిస్ అయ్యారేమో ఒకసారి చదివేయండి
వారంలో జరిగే అన్ని వార్తలను చదవడం కష్టం. కొన్ని మిస్ అవుతూ ఉంటారు. అలా మీరు కొన్ని రకాల ఆసక్తికరమైన వార్తలు మిస్ అయితే మేము ప్రతి ఆదివారము వాటిని మీకు అందిస్తాము. ఈ వారంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇదిగో.

పాలు ఆర్డర్ చేస్తే 18 లక్షలు పోయాయి
ఆన్లైన్ ఆర్డర్లు పెరిగిపోయిన కాలం ఇది. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహిళ లీటర్ పాలు ఆర్డర్ చేస్తే పద్దెనిమిదన్నర లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ముంబైకి చెందిన 71 ఏళ్ల మహిళ ఆన్లైన్ లో లీటర్ పాలు ఆర్డర్ చేసింది. తర్వాత రెండు రోజుల్లో తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న లక్షలు పోయినట్టు గుర్తించింది. పాలు ఆర్డర్ చేశాక ఆ పాల కంపెనీకి ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నానంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. పాలు ఆర్డర్ చేయడానికి మొబైల్ ఫోన్ కు లింకు పంపుతున్నానని ఆ లింకు మీద క్లిక్ చేయమని చెప్పాడు. ఆమె లింక్ క్లిక్ చేసింది. తర్వాత దాదాపు పద్దెనిమిదిన్నర లక్షలు ఆమె అకౌంట్ లోనుంచి ఖాళీ అయిపోయాయి. అది కూడా ఒక బ్యాంకు ఖాతా కాదు మూడు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయి. లింక్ పై క్లిక్ చేసిన తర్వాతే అతడు ఆమె ఫోన్‌ని హ్యాక్ చేశాడని తెలిసింది. ప్రస్తుతం దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. నిందితుడిని పోలీసులు పట్టుకోలేదు.
అమెరికాలో తొలిసారి ఎగిరిన భారత త్రివర్ణ పతాకం
అమెరికాలోని ప్రసిద్ధ ప్రదేశాలలో సియాటెల్ ఒకటి. అక్కడ 605 అడుగుల ఎత్తయిన స్పేస్ నీడిల్ పై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఐకానిక్ బిల్డింగ్ పై ఇండియా జెండా ఎగిరింది. అమెరికాలో ఒక విదేశీ జండా ఎగరడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఇది ఒక చారిత్రాత్మక ఘటన కూడా. సియోటెల్ భారత కాన్సులేట్ జనరల్ ప్రకాష్ గుప్తాతో పాటూ ఎంతోమంది ప్రముఖులు ఈ చారిత్రాత్మకమైన ఘటనలో పాల్గొన్నారు. అంతేకాదు సియాటిల్‌లోని కాన్సులేటుకు దగ్గరలో విందును కూడా ఏర్పాటు చేశారు. స్పేస్ నీడిల్ పై త్రివర్ణ పతాకం ఎగురుతుండగా ఆ చారిత్రాత్మక క్షణాన్ని చూసేందుకు అమెరికాలోని ఇండియన్లు ఎంతోమంది అక్కడ గుమిగుడారు.
గవర్నర్లు గ్రహాంతరవాసులు కాదు
ప్రభుత్వం పంపిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి మూడు నెలల గడువు, గవర్నర్లకు ఒక నెల గడువు ఇస్తున్నట్టు ఏప్రిల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం నిర్దేశించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తన అభిప్రాయాన్ని సమర్పించింది. ఇటువంటి గడువును నిర్దేశించడం వల్ల అది సున్నితమైన అధికార విభజనకు దారితీస్తుందని, ఇది రాజ్యాంగ గందరగోళానికి దారి తీసే అవకాశం ఉందని కూడా లేఖలో రాసుకొచ్చింది. గవర్నరు, రాష్ట్రపతి కార్యాలయాలు పూర్తిగా రాజకీయంగానే పనిచేస్తాయని, ప్రజాస్వామ్య పాలన లోని ఉన్నత ఆదర్శాలను సూచిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. వాటిలో ఏవైనా లోపాలు ఉంటే అనవసరమైన న్యాయ జోక్యం కన్నా రాజకీయంగా లేదా రాజ్యాంగ యంత్రాంగాల ద్వారా సరిదిద్దుకుంటే బాగుంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర సమాఖ్య విభాగాలలో గవర్నర్లు గ్రహాంతరవాసులు, విదేశీయులుగా పరిగణించకూడదని... గవర్నర్లు కేవలం కేంద్రం దూతలు మాత్రమే కాదని వారు దేశ ప్రతినిధులని ఆ లేఖలో రాసుకొచ్చారు.
పాతికేళ్ల క్రితం హత్య చేస్తే ఇప్పుడు దొరికిపోయాడు
చేసిన పాపం ఊరికే పోదు. ఎప్పుడో ఒకసారి బయటపడే తీరుతుంది. అలా 1999లో సౌదీ అరేబియాలో హత్య చేస్తే ఇప్పుడు సిబిఐకి దొరికిపోయాడు హంతకుడు. సౌదీ అరేబియాలో 1999లో జరిగిన హత్య కేసులో 26 సంవత్సరాలకు పైగా పరారీలో ఉన్న వ్యక్తిని ఆగస్టు 16న సిబిఐ అరెస్టు చేసింది. ఆగస్టు 11న మదీనా నుండి కొత్త గుర్తింపు కార్డు, పాస్‌పోర్టుతో తిరిగి ఇండియాకి వస్తున్న మహమ్మద్ దిల్షాద్ అనే వ్యక్తిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబిఐ అరెస్టు చేసింది. 26 ఏళ్ల తర్వాత తాను చేసిన హత్యకు శిక్షను అనుభవిస్తానని ఆ వ్యక్తి కూడా అనుకోని ఉండడు. తాను దొరకనని భావనతోనే కొత్త గుర్తింపు కార్డుతో దేశంలోకి అడుగు పెట్టాడు. కానీ సిబిఐ చాలా చాకచక్యంగా అతడిని అరెస్టు చేసింది. దిల్షాద్ ను ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దర్యాప్తు అధికారులు చెబుతున్న ప్రకారం మొహమ్మద్ దిల్షాద్ 1999లో రియాజ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక వ్యక్తిని హత్య చేశాడు. అతడు సౌదీ నుంచి తప్పించుకొని భారతదేశానికి వచ్చాడు. అంతేకాదు కొత్త పాస్ పోర్టుతో పాతికేళ్లుగా ఖతార్, కువైట్, సౌదీ అరేబియాలకు కూడా ప్రయాణం చేశాడు. అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అయితే నకిలీ పాస్‌పోర్టును గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడంతో లుక్ అవుట్ నోటీసు బయటపడింది. దీని గురించి తెలియక దిల్షాద్ సౌదీ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.
అతిపెద్ద పాల ఉత్పత్తిదారు ఆ రాష్ట్రమే
లోక్ సభలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాగేల్ పాల పరిశ్రమపై పత్రాన్ని సమర్పించారు. అందులో దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇక రెండో స్థానంలో రాజస్థాన్ ఉంది. మన దేశం మొత్తం మీద పాల ఉత్పత్తి 239.30 మిలియన్ టన్నులుగా ఆయన చెప్పారు. అయితే ఈ పాలల్లో 53 శాతం ఆవులువి కాగా, గేదెల నుంచి 43 శాతం పాలు వస్తున్నట్లు వివరించారు.