మన ఆడబిడ్డల దశాబ్దాల పోరాటానికి దక్కిన పలితమే.. ఈ వరల్డ్ కప్..!
ICC Womens World Cup 2025 : స్వదేశంలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొట్టింది... తమ కలను సాకారం చేసుకుంది, ట్రోఫీని ఒడిసిపట్టింది. అయితే ఈ విజయం వెనక అమ్మాయిల దశాబ్దాల పోరాటం దాగివుంది.

ఈ మహిళల విజయం... పురుషాధిక్య సమాజానికి జవాబు
మహిళలు వన్డే ప్రపంచకప్‌ను సాధించడం కేవలం ఒక ఆటలో విశ్వవిజేతగా నిలువడం వరకే పరిమితవుతుందా? ఒక క్రీడలో జెండాను ఎగరేయడంగా మాత్రమే చూడగలమా? లేదు, అది అనేక రకాలుగా మహిళలు సాధించిన విజయంగా చూడాల్సి వుంటుంది. క్రికెట్‌లో వాళ్లు విశ్వవిజేతగా నిలిచారంటే పురుషాధిక్య సమాజంపై తిరుగుబాటు చేసి సాధించిన విజయంగా కూడా చూడాల్సి వుంటుంది. భారత మహిళా క్రికెట్ జట్టు 2005లో, 2017లో ఫైనల్ వరకు చేరుకుంది. కానీ ఫైనల్‌లో ఓటమి పాలై కప్‌ను సాధించలేకపోయింది, క్రీడాకారులు మారినా ఆ జ్వాల మహిళా జట్టులో రగులుతూనే ఉంది.
ప్రస్తుతం ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టు సభ్యులు మాత్రమే కాదు, క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకున్న అమ్మాయిలు కూడా పలు రకాలైన వివక్షను ఎదుర్కున్నారు. అమ్మాయిలకు క్రికెట్ ఆట కుదరదనే వ్యాఖ్యలను విని కూడా వాళ్లు తమ పట్టును వీడలేదు. 2017లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు ఎదురైన వ్యాఖ్యలు ఇప్పటికీ తడితడిగానే ఉన్నాయని పూనమ్ రౌత్ మాటల్లో వ్యక్తమైంది. ''మీరు ఏమైనా సాధించారా, అమ్మాయిలు ఏం చేయగలుగుతారు, నిజంగా అమ్మాయిలు క్రికెట్ ఆడగలరా?'' అనే ప్రశ్నలు ఎదురైనట్లు మహిళలు విశ్వవిజేతలుగా నిలిచిన తర్వాత ఆమె బైటపెట్టారు. ఇటువంటి వ్యాఖ్యలకు అమ్మాయిలు తమ చేతల ద్వారా సమాధానం చెప్పారు.
మహిళా క్రికెటర్ల పోరాటం...
అమ్మాయిలు విశ్వవిజేతలుగా నిలువడం రాత్రికి రాత్రి జరిగింది కాదు. దాని వెనక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఈ విజయం కేవలం ప్రస్తుత జట్టు సభ్యులదే కాదు, క్రికెట్‌ను కష్టకాలంలో ముందుకు నడిపించిన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా వంటివారిది కూడా. అందుకే విజయం తర్వాత కప్‌ను హర్మన్‌ప్రీత్ సేన మిథాలీరాజ్, ఝులన్ కి అందించింది. తద్వారా తమ విజయం వెనక వారున్నారనే సంకేతాన్ని పంపింది. అది ముందుకు అనుకుని చేసింది కాదు.. ఒక ఉద్వేగభరితమైన సందర్భం అది. ఇంతటి సహృదయ చర్య పురుషుల క్రికెట్‌లో ఇప్పటి వరకు తాను చూడలేదని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మహిళల ప్రస్తుత విజయం వెనక సుదీర్ఘకాలం కెప్టెన్సీ చేసిన మిథాలీ రాజ్ వుంది. క్రికెట్‌లో ఆమె సాధించిన వ్యక్తిగత విజయాలు తక్కువేమీ కాదు. అమ్మాయిలను వెంట తీసుకుని వెళ్తూ తాను నడిచింది. (ఆమెకు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన స్థలం ఆమె చేతికి ఇంకా అందిందో లేదో తెలియదు). ఇది ప్రస్తుత విజేతలకు, మాజీ మహిళా క్రికెటర్లకు గర్వకారణమే కాదు, దేశ మహిళలందరికీ ఒక స్ఫూర్తి.
అమ్మాయిలు 1973 నుంచి 2006 వరకు భారత మహిళా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ ఆడుతూ వచ్చారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడానికి అమ్మాయిలకు అది తీవ్రమైన కష్టకాలం. ఆ తర్వాత ఆ సంఘాన్ని బిసీసీఐలో విలీనం చేశారు. మహిళల జట్టు 1978లో మొదటిసారి ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొంది. వారికి ఆర్థిక వనరులు ఉండేవి కావు. 2005లో ఇంగ్లాండుపై భారత జట్టు ఫైనల్‌లో ఓడిపోయింది. అప్పుడు వారి మ్యాచ్ ఫీజు కేవలం వేయి రూపాయలు. మొత్తం టోర్నమెంట్‌లో ఒక్కో అమ్మాయికి కేవలం 8 వేల రూపాయలు మాత్రమే దక్కాయి. ఇటువంటి పరిస్థితిలో వారికి గుప్తంగా సాయపడినవాళ్లు ఉన్నారు. బాలీవుడ్ నటి మందిరా బేడి అస్మి జ్యువెల్లర్స్ వాణిజ్య ప్రకటనకు తనకు దక్కిన సొమ్మును మహిళా క్రికెట్ జట్టుకు విరాళంగా ఇచ్చింది. ఆ సొమ్ముతో అమ్మాయిలు ఇంగ్లాండు పర్యటనకు వెళ్లడానికి విమానం టికెట్లు కొనుక్కున్నారు. అంతేకాకుండా పలువురి నుంచి విరాళాలు సేకరించి ఇచ్చింది. మహిళా క్రికెట్ సంఘం పెద్దలు కూడా ఎంతో శ్రమించారు. అమ్మాయిలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లినప్పుడు తమ మిత్రుల ఇళ్లలో వుండేవారు. కేవలం మూడు బ్యాట్లతోనే జట్టు సభ్యులంతా బ్యాటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయాణమంతా ఝులన్ గోస్వామి, మిథాలీరాజ్ నాయకత్వాల్లో జరిగింది.
మహిళా క్రికెట్ మహర్దశ
మహిళా క్రికెట్ సంఘం భారత క్రికెట్ మండలి (బిసిసీఐ)లో విలీనమైన తర్వాత కూడా సరైన గుర్తింపు కోసం 2022 దాకా ఆగాల్సి వచ్చింది. జైషా బిసీసీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు పురుషులతో సమానంగా అమ్మాయిలకు మ్యాచ్ ఫీజు నిర్ణయించి, అమలు చేశారు. అది మహిళా క్రికెటర్లకు లభించిన వరం. ఆ తర్వాత అమ్మాయిలు ఊపిరి పీల్చుకుని క్రికెట్‌పై పూర్తి స్థాయిలో మనసు పెట్టడానికి వీలు కలిగింది. మిథాలీ రాజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత జట్టు సభ్యులు ముందుకు సాగారు.
పురుషాధిక్య సమాజంలో అమ్మాయిలను క్రికెట్ క్రీడ వైపు మళ్లించడం, వారిని ప్రోత్సహించడం వాళ్ల తల్లిదండ్రులకు ఒక సవాల్ లాంటిదే. ప్రస్తుత జట్టు సభ్యులది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. ఒక్కో అమ్మాయిపై ఒక్కో సినిమా తీయగలిగినంత స్టొరీ వుంది. ఉదాహరణకు షెఫాలీ వర్మనే తీసుకుందాం. ఆమె జుట్టు కత్తిరింపు చూస్తే తాను నడిచిన వచ్చిన తీరుకు సంకేతంగా అనిపిస్తుంది. ఆమె సోదరుడు స్థానిక క్రికెట్ క్లబ్‌లో శిక్షణ పొందేవాడు. ఆ సమయంలో షెఫాలీ వర్మకు పదేళ్ల లోపు వయస్సు. అమ్మాయిలను అనుమతించేవారు కాదు. అయితే ఆమె తండ్రి చేసిన పని మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. షెఫాలీకి ఆమె తండ్రి జుట్టు కత్తిరింపజేసి, మగవాళ్ల డ్రెస్ వేసి ఒక మగ పిల్లవాడిగా భ్రమింపజేసి అందులో చేర్పించాడు. నిజంగా సినిమా కథలా అనిపించడం లేదా? ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ కప్ జట్టులో ఆడిన నల్లపురెడ్డి శ్రీచరణిది బీద కుటుంబం. అటువంటి స్థితిలోనూ ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో దీప్తి శర్మ తర్వాతి స్థానం ఆమెదే. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే 15 సినిమా కథలు దొరుకుతాయి.
జెమిమా చేసిన తప్పేంటి..?
ఇక మరో విషయానికి వద్దాం. విశ్వాసం ఒక ఊతకర్ర. దేహాన్ని, మనస్సును కూడదీసుకోవడానికి ఏ పోరాటంలోనైనా అది ఉపయోగపడుతుంది. అయితే మతానికి అంతకు మించిన విస్తృతి ఉండకూడదు. కానీ ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో దాని విస్తృతి పెరుగుతున్నది. మన దేశం గురించి చెప్పాల్సి వస్తే భిన్నత్వంలో ఏకత్వం అంటాం. అయితే ఈ నినాదంతో హద్దులు చెరిపేయాల్సింది పోయి మతపరమైన హద్దులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్‌లో వీరోచిత పోరాటం చేసిన జెమీమా రోడ్రిగ్స్‌పై ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘నువ్వు నిలబడు, జీసస్ నీకు సహాయపడుతాడు’ అని అన్నందుకు ఆమె తీవ్రమైన ద్వేషాన్ని ఎదుర్కుంటున్నది.
వాస్తవానికి ఆస్ట్రేలియా మహిళల జట్టు సెమీ ఫైనల్‌ను కూడా మొత్తం టోర్నమెంటులోని ఒక మ్యాచ్ లాగానే చూసింది. దాన్ని అత్యంత కీలకమైన మ్యాచ్‌గా చూడలేదు. తాము గెలిచి తీరుతామనే ఉద్దేశంతోనే వుంది. ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం సాధ్యం కాదని భారతీయలు కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా జెమీమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ పెట్టని గోడలా నిలబడింది. తాను నమ్మిన విశ్వాసంతో జీసస్‌ను స్మరిస్తూ ముందుకు సాగింది. ఆమె 127 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలింది. నుదట బొట్టు పెట్టుకుని, మణికట్టుకు దారాలు కట్టుకుని ఆడిన దీప్తి శర్మ సాయాన్ని కూడా కోరింది. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను నిలబడుతా అని ఆమె దీప్తిని అడుగుతూ వెళ్లింది. ఇక్కడ మతపరమైన విభేదాలు కనిపించలేదు. మ్యాచ్ గెలవడం ఒక్కటే లక్ష్యంగా అమ్మాయిలు ముందుకు సాగారు. ఆస్ట్రేలియాపై గెలిచి ఉండకపోతే భారత్ చేతికి కప్ అందేది కాదు. మొత్తం టోర్నమెంటులో అదే కీలకం. దక్షిణాప్రికాపై గెలవడానికి అది అవసరమైన విశ్వాసాన్ని అందించింది. దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జెమీమా బ్యాటింగ్‌లో అంతగా రాణించలేదు, విఫలమైందని చెప్పలేం. ఫీల్డింగ్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ప్రార్థనలు చేస్తుండడం కనిపించింది. నటన చేతకాని చిలిపి అమ్మాయి జెమీమా దాని పర్యవసనాలు తెలియక ఉద్వేగంలో జీసస్ పేరు ప్రస్తావిస్తే దానికి పెడర్థాలు తీశారు. దేశం కోసం భేదభావం లేకుండా మిగతా అమ్మాయిలతో కలిసిమెలిసి, వారిని ఉత్సాహపరుస్తూ, తాను ఉత్సాహం పొందుతూ ఉద్వేగభరితమైన స్థితిలో నిలకడ ప్రదర్శించిన అమ్మాయిని మతం పేరు మీద కించపరచడం, ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం దేశానికి మంచిది కాదనే ఇంగితం కూడా లేకుండా పోయింది.
ముస్లిం ఆటగాళ్లు లేకుండా పురుషుల జట్టును ఊహించగలమా? జహీర్ ఖాన్, షమీ, సిరాజ్, ఇంకా పలువురు భారత్ జట్టు కోసం ఎంతో నిబద్ధతతో ప్రదర్శన చేశారనే విషయం మనకు అర్థం కాదా? వాళ్లకు మతం ముఖ్యమైందా, దేశం ముఖ్యమైందా అనే ఇంగితం లేకపోతే ఎలా?
మహిళల సత్తాను చాటిచెప్పే విజయం
మొత్తం మీద అమ్మాయిల జట్టు ప్రపంచకప్ వితేతలు కావడం అనేకమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అంతేకాదు, కఠినమైన పరిస్థితిలో కూడా మహిళలు గట్టిగా, ధైర్యంగా నిలబడగలరని నిరూపించారు. వారి విజయం వెనక పని చేసిన హెడ్ కోచ్ మజందార్‌ను ఇక్కడ మెచ్చుకోవాల్సిందే. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే జెమీమాను ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాడు. అటువంటి స్థితిలో సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ కావాలని ఆయన అనుకున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఆమెకు తోడు నిలిచి, విలువైన ఇన్నింగ్స్ ఆడింది. దీప్తి శర్మ, రిచా ఘోష్ ఒక్కరేమిటి అందరూ తమ తమ పాత్రలను బాధ్యతయుతంగా నిర్వహించారు. జట్టులో ఆ కలిసికట్టుతనం, పరస్పర సహకార గుణం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ మతమేదీ పని చేయలేదు. తాము గెలిచి దేశానికి గౌరవం తేవాలనే పట్టుదల, దీక్ష మాత్రమే పనిచేశాయి. పురుషాధ్యిక సమాజంలో తాము ఎదుర్కున్న సవాళ్లకు సమాధానం కూడా పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించి ముందు ముందు ఎవరిని కూడా మతం పేరు మీద దూషించకూడదని అర్థం చేసుకుంటే, మరిన్ని విజయాలు సాధ్యమవుతాయి.
కాసుల ప్రతాప్ రెడ్డి, ఏసియా నెట్ న్యూస్ తెలుగు మాజీ సంపాదకులు