Hyderabad : పంజాగుట్టకు ఆ పేరు ఎలా వచ్చింది? గుట్ట అంటే కొండ కాదా..!
హైదరాబాద్ లో ఉండేవారు తరచూ పంజాగుట్ట పేరు వింటుంటారు… నగరంలో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఇక్కడికి ఒక్కసారిగా వెళ్లివుంటారు. మరి నగర నడిబొడ్డన గల ఈ పంజాగుట్టకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

పంజాగుట్ట అసలుపేరు ఏమిటో తెలుసా?
పంజాగుట్ట... హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరు ఈ పేరు వినే ఉంటారు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతం గురించి తెలిసే ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున గల పంజాగుట్ట మీదుగా మెట్రోలో, బస్సుల్లోనే కాదు సొంత వాహనాల్లో నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీతో పాటు బంజారాహిల్స్ వంటి ప్రాంతానికి అతి సమీపంలో ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ తో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి... అందుకే పంజాగుట్ట పరిసరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. పంజాగుట్ట సర్కిల్ అంటే తెలియని హైదరబాదీ ఉండడంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ నగరంలో ఇంతటి కీలకమైన ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలోని ఏదైనా గుట్ట అంటే కొండ ఉండివుంటుందని.. దానివల్లే ఈ పేరు వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి పంజాగుట్టలో గుట్ట అంటే కొండ కాదట. అసలు పంజాగుట్టకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
పంజాగుట్టకు ఆ పేరు ఎలా వచ్చింది?
హైదరాబాద్ రాజధానిగా గొల్కొండ కోట నుండి కుతుబ్ షాహీలు పాలించిన విషయం తెలిసిందే. వీరి కాలంలోనే పంజాగుట్ట అనేది ఓ పవిత్ర స్థలంగా వెలుగొందినట్లు చరిత్ర చెబుతోంది. నగరంలోని ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేసేవారట. మరి ఇది ముస్లింలకు పవిత్ర స్థలంగా ఎలా మారిందో తెలిపే ఓ చారిత్రక కథ నేటికీ ప్రచారంలో ఉంది.
ప్రచారంలో ఉన్న కథ ప్రకారం... కుతుబ్ షాహీల కాలంలో ఓ జనరల్ స్థాయి ఉన్నతాధికారికి ఓ రోజు రాత్రి పడుకున్నప్పుడు కల వచ్చిందట. అందులో ముస్లింలు దైవంగా కొలిచే మహ్మద్ ప్రవక్త అల్లుడు హజ్రత్ అలీ ఓ కొండపై ప్రార్థనలు చేసినట్లుగా కనిపించిందట. దీంతో సదరు జనరల్ తన కలలో వచ్చిన కొండ ఎక్కడుందో కనుగొనేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ కాలంలో గుట్టలతో నిండివున్న పంజాగుట్ట ప్రాంతంలో అలాంటి ఓ కొండ కనిపించిందట. దానిపైకి వెళ్లిచూడగా ఓ బండరాయిపై అరచేతులు, మోకాలి ఆకారంలో గుర్తులు కనిపించాయి. ఇక్కడే హజ్రత్ అలీ ప్రార్థన చేసినట్లుగా సదరు జనరల్ తో పాటు ప్రజలు కూడా నమ్మడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతాన్ని 'పంజాఘుట్నా' గా పిలిచేవారు. కాలక్రమేణా ఇది పంజాగుట్టగా మారింది.
పంజాఘుట్నా అంటే ఏమిటి?
పంజాగుట్టలోకి పేరు మొదట పంజాఘుట్నా. ఇక్కడ పంజా అంటే అరచేయి అని అర్థం... ఈ చిహ్నాన్ని ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పంజాలో ఉండే ఐదువేళ్లు ముస్లింలు దైవంగా భావించే ఐదుగురిని సూచిస్తాయి... వారు మహ్మద్ ప్రవక్త, ఆయన కుమార్తె హజ్రత్ ఫాతిమా, అల్లుడు హజ్రత్ అలీ, మనవళ్ళు హజ్రత్ హసన్, హజ్రత్ హుస్సేన్.
ఇక ఘుట్నా అంటే ఉర్దూలో మోకాలు అని అర్థం. హజ్రత్ అలీ ప్రార్థన చేయగా రాయిపై అరచేయితో పాటు మోకాలి గుర్తులు ఏర్పడ్డాయి... అందుకే ఈ ప్రాంతాన్ని పంజాఘుట్నాగా పిలిచేవారు. అంటే పంజాగుట్టలో గుట్ట అంటే కొండ కాదన్నమాట... వాడుకలో ఘుట్నా కాస్త గుట్టగా మారింది.
ఇప్పటికీ పంజాగుట్టలో హజ్రత్ అలీ ప్రార్థన చేసినట్లుగా పేర్కొనే ప్రాంతం ఉంది... ఇక్కడ ఇప్పుడు మసీదు ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు... నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ వేడుకలు కూడా జరుగుతుంటాయి.













