Leech: నొప్పి తెలియకుండా జలగ రక్తాన్ని ఎలా పీలుస్తుంది? ఆ టెక్నిక్ తెలిస్తే మతిపోతుంది
Leech: మన చర్మానికి జలగ (Leech) అంటుకున్నప్పుడు పెద్దగా నొప్పి తెలియకముందే అది రక్తాన్ని తాగడం మొదలుపెడుతుంది. జలగ శరీరం పైన అంటుకుని రక్తాన్ని పీల్చే విధానం వెనుక అత్యంత ఆశ్చర్యకరమైన జీవశాస్త్ర సూత్రాలు ఉన్నాయి.

రక్తం పీల్చే జీవులుగా పేరు..
జలగ అనగానే కాస్త నెగెటీవ్ పదంలా అనిపిస్తుంది. రక్తం పీల్చే జీవులుగా వీటికి కాస్త చెడ్డ పేరు ఉంది. మనుషులను కూడా జలగలా పట్టి పీడిస్తున్నావుకదా అని తిడుతుంటారు. ఇంతకీ ఈ జలగ సంగతేంటి. అవి రక్తాన్ని నొప్పి తెలియకుండా ఎలా పీల్చుతాయి. జలగకు శరీరంలో రెండు రకాల సక్కర్స్ (Suckers) ఉంటాయి. వెనుక వైపు ఉండే సక్కర్ శరీరాన్ని చర్మానికి గట్టిగా పట్టుకోవడానికి, అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ముందు వైపు ఉండే ఓరల్ సక్కర్ (Oral Sucker) ఆహారాన్ని పీల్చుకోవడానికి పనిచేస్తుంది. వైద్యపరంగా ఉపయోగపడే మెడిసినల్ లీచెస్ నోటి లోపల మూడు చిన్న రంపపు ఆకారపు దవడలు (Saw-like Jaws) ఉంటాయి. ప్రతి దవడ పైన చిన్న చిన్న పళ్ళు అమర్చబడి ఉంటాయి. జలగ చర్మానికి అతుక్కున్న తర్వాత ఈ మూడు దవడలు ఒకేసారి కట్ చేస్తాయి. అందుకే జలగ కుట్టినప్పుడు ఆ గాయం ఇంగ్లీష్ అక్షరం 'Y' ఆకారంలో కనిపిస్తుంది.
రక్తం గడ్డకట్టకుండా ఏం చేస్తుందో తెలుసా?
జలగ మన చర్మాన్ని కరిచే సమయంలో దాని లాలాజలం ద్వారా ఒక రకమైన అనస్థీషియాను గాయంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని నరాలను తాత్కాలికంగా మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల అది కొరికినట్లు మనకు అస్సలు నొప్పి తెలియదు. చర్మాన్ని కట్ చేయడం చాలా తేలికైన పని, కానీ అసలైన సవాలు రక్తాన్ని గడ్డకట్టకుండా చూసుకోవడమే. మానవ శరీరానికి గాయమైన వెంటనే రక్తం గడ్డకట్టడానికి (Blood Clotting) ప్రయత్నిస్తుంది.
అలా గడ్డకడితే జలగకు ఆహార సరఫరా ఆగిపోతుంది. దీనిని నివారించడానికి జలగ తన లాలాజలం (Saliva) ద్వారా ఒక శక్తివంతమైన రసాయన ఆయుధాన్ని విడుదల చేస్తుంది. జలగ లాలాజలంలో 'హిరుడిన్' (Hirudin) అనే శక్తివంతమైన యాంటీ కోయాగులెంట్ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి కీలకమైన 'త్రాంబిన్' (Thrombin) అనే ప్రోటీన్ ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల గాయం నుండి రక్తం వెంటనే గడ్డకట్టకుండా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
జలగ ఎంత రక్తం పీల్చుతుంది?
జలగ లాలాజలంలో కేవలం హిరుడిన్ మాత్రమే కాకుండా మరికొన్ని రసాయన సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి రక్తం లోని ప్లేట్లెట్స్ ఒకదానికొకటి అతుక్కుపోకుండా అడ్డుకోవడమే కాకుండా రక్తనాళాలు (Blood Vessels) వెడల్పు అవ్వడానికి (Widen) సహాయపడతాయి. ఇవన్నీ కలిసి గాయం దగ్గర రక్త ప్రవాహం ఆగిపోకుండా చూస్తాయి. ఆ తర్వాత జలగ ముందు సక్కర్ తో ఒత్తిడి (Suction) సృష్టించి రక్తాన్ని లోపలికి పీల్చుకుంటుంది. ఈ క్రమంలో దాని జీర్ణ వ్యవస్థ (Digestive tract) బాగా సాగుతుంది. కొన్ని జలగలు ఒక్కసారి ఫీడింగ్ లో తమ శరీర బరువు కంటే అనేక రెట్లు ఎక్కువ రక్తాన్ని తీసుకోగలవు.
జలగ విడిపోయిన తర్వాత కూడా
జలగ మన శరీరం నుండి విడిపోయిన తర్వాత కూడా గాయం నుండి కొంతసేపు రక్తం కారుతూనే ఉంటుంది. ఎందుకంటే జలగ లాలాజలంలోని యాంటీ కోయాగులెంట్ రసాయనాలు జలగ వెళ్లిపోయిన తర్వాత కూడా పని చేస్తూనే ఉంటాయి. జలగ కేవలం రక్తాన్ని పీల్చడమే కాకుండా, కట్ చేయడం, రక్తాన్ని గడ్డకట్టకుండా ఆపడం - రక్తాన్ని లాక్కోవడం వంటి క్లిష్టమైన ప్రక్రియలను చాలా సులువుగా చేస్తుంది. ఈ చిన్న జీవిలో ఉన్న ఈ ఫీడింగ్ మెకానిజం ఒక అద్భుతమైన బయోలాజికల్ సిస్టమ్ అని చెప్పవచ్చు.













