Crow Behavior: కాకులు కూడా పగబడతాయా? మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకుంటాయా?
Crow Behavior: మన ఇంటి దగ్గర, రోడ్డు పక్కన, చెట్లపై కనిపించే కాకులను మనం పెద్దగా పట్టించుకోం. కానీ మీరు ఒక కాకిని ఇబ్బంది పెడితే.. అది మిమ్మల్ని మర్చిపోవంట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా...అసలు కాకులు మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకోగలవా?
కాకులు మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకోగలవా?
మన ఇంటి దగ్గర, రోడ్డు పక్కన, చెట్లపై కనిపించే కాకులను మనం పెద్దగా పట్టించుకోం. కానీ మీరు ఒక కాకిని ఇబ్బంది పెడితే.. అది మిమ్మల్ని మర్చిపోకపోవచ్చు. అంతేకాదు.. అదే కాకి మిమ్మల్ని చూసినప్పుడు అరవడం, చుట్టూ ఉన్న కాకులను అప్రమత్తం చేయడం కూడా జరగొచ్చు. అసలు కాకులు మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకోగలవా?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు కాకులపై ప్రత్యేకమైన ప్రయోగాలు చేశారు. వాటిలో కాకులు వ్యక్తిగత మనుషులను గుర్తించగలవని, ముఖ్యంగా తమకు ప్రమాదంగా అనిపించిన వ్యక్తి ముఖాన్ని గుర్తుంచుకోగలవని తేలింది.
ఒక మాస్క్.. కాకుల జ్ఞాపకశక్తికి పరీక్ష
పరిశోధకులు కాకులను పట్టుకునే సమయంలో ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను ధరించారు. ఆ మాస్క్‌ను కాకులు ప్రమాదంగా గుర్తించాయి. తర్వాత అదే మాస్క్‌ను ధరించిన వ్యక్తిని కాకులు చూసినప్పుడు గట్టిగా అరుస్తూ మిగిలిన కాకులను కూడా అప్రమత్తతను ప్రదర్శించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇలా గుర్తించడం కొంతకాలం తర్వాత కూడా కనిపించింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వివరాల ప్రకారం, ప్రయోగాల్లో కాకులు ఆ మాస్క్‌ను రెండేళ్ల వరకు గుర్తించిన సందర్భాలు నమోదయ్యాయి.
ఒక కాకి నేర్చుకున్న విషయం.. మిగతావాటికీ తెలుస్తుంది
ఇదే కాదు...ఒక కాకి ప్రమాదకరమైన వ్యక్తిని గుర్తిస్తే.. మిగతా కాకులు కూడా ఆ వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2011లో ప్రచురితమైన పరిశోధనలో, ప్రమాదకరమైన వ్యక్తి ముఖాన్ని కాకులు ప్రత్యక్ష అనుభవం ద్వారా మాత్రమే కాకుండా ఇతర కాకుల ప్రవర్తనను గమనించడం ద్వారా కూడా నేర్చుకోగలవని పరిశోధకులు గుర్తించారు. ఈ సమాచారం ఇతర కాకులకు వ్యాపించి, కొన్ని సందర్భాల్లో తరువాతి తరాలకు కూడా చేరే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది. అంటే.. ఒక కాకి ఎదుర్కొన్న ప్రమాదం, ఆ కాకితోనే ఆగిపోకుండా దాని గుంపులోని ఇతర కాకులకు చేరవేస్తాయి.
మనిషిని మంచివాడా.. ప్రమాదమా? అని గుర్తిస్తాయా?
కాకులు కేవలం ముఖాన్ని గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు.. ఆ వ్యక్తితో తమకు ఎదురైన అనుభవాన్ని కూడా ఆ ముఖంతో అనుసంధానం చేసుకోగలవని పరిశోధనలు చెబుతున్నాయి. 2012లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు కాకుల మెదడు కార్యకలాపాలను పరిశీలించారు. ప్రమాదకరమైన మాస్క్‌ను చూసినప్పుడు, భయం కనిపించింది. అంటే కాకి ఒక ముఖాన్ని చూసి.. దానితో గతంలో ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
అందుకే కాకులు ఒక్క వ్యక్తినే టార్గెట్ చేసినట్టు కనిపిస్తాయా?
మీరు ఎప్పుడైనా ఒక కాకి మీపై పదే పదే అరుస్తుండటాన్ని గమనించి ఉండొచ్చు. దానికి కారణం యాదృచ్ఛికం కాకపోవచ్చు. గతంలో ఆ వ్యక్తి నుంచి కాకికి ఎదురైన అనుభవం దాని ప్రవర్తనను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ప్రతి కాకి ప్రతి మనిషి ముఖాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పడం మాత్రం సరైంది కాదు. శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయం ఏమిటంటే.. కొన్ని కాకులు అన్ని ముఖాలను గుర్తుంచుకోలేకపోయినా...ప్రమాదకరం అని తెలిస్తే మాత్రం కచ్చితంగా గుర్తుంచుకుంటాయి.
కాబట్టి.. ఇకపై మీ ఇంటి ముందు కాకి గట్టిగా అరుస్తుంటే, దాన్ని పట్టించుకోండి. అది మిమ్మల్ని గుర్తుపట్టిందా? లేక మీ గురించి మిగతా కాకులకు ఏదైనా చెబుతోందా? అనేది ఆలోచించండి.

