కీరవాణి వివాదంలోకి మెల్లిగా సమంతను లాగారే
వివాదాలును సమంత వదిలేసినా ఆమెను వివాదాలు మాత్రం వదలటం లేదు. తాజాగా ఆమె ప్రమేయం లేకుండా ఓ వివాదంలోకి ఆమె ఎంట్రి ఇచ్చింది.

Samantha
సమంత రుతు ప్రభు.. ఈ పేరు వినగానే ఆత్మ విశ్వాసం కలిగిన అందమైన అమ్మాయి మన కళ్ల ఎదురుగా కనిపిస్తుంది. అలాగే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్‌తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. అయితే గత కొంతకాలంగా వాటిన్నటికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా తన సినిమాలేవో తను చేసుకుంటోంది. అయితే వివాదాలును ఆమె వదిలేసినా ఆమెను వివాదాలు వదలటం లేదు. తాజాగా ఆమె ప్రమేయం లేకుండా ఓ వివాదంలోకి ఆమె ఎంట్రి ఇచ్చింది.
తెలంగాణ జాతిగీతానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చటంపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రా ష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను సినీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదమని తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ పేర్కొన్నది. ఇది ఎంతమాత్రం సహేతుకం కాదని, తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగిస్తుందని విమర్శించింది. కవి, రచయిత అందెశ్రీ ర చించిన ‘జయజయహే తెలంగాణ’ రా ష్ట్ర గీతంగా ప్రకటించడం సంతోషించే విషయమైనా, ఈ పాటను ఇతర రాష్ట్రాల కళాకారుల గళానికి అప్పగించడం సరైన నిర్ణయం కాదని తెలిపింది.
అలాగే జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల మంది ప్రజల కలల ప్రతిరూపం అని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనమేంది.. అంటూ ప్రశ్నించారు.
మరో ప్రక్క సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తెలంగాన రాష్ట్ర గీతంకు సంబంధించిన పూర్తి బాధ్యతను అందెశ్రీ కి అప్పగించాం అన్నారు. రచయిత అయిన ఆయన కు ఎవరితో సంగీతం చేయించాలి అనే విషయంలో మేము ఎలాంటి సూచన చేయలేదు. ఆయన ఇష్టం ప్రకారం కీరవాణి గారితో సంగీతాన్ని చేయిస్తున్నారు. అందులో ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు అన్నారు. రచయిత అయిన అందెశ్రీ గారికి ఆ స్వేచ్చ ఉంటుంది అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కీరవాణిపై విమర్శలు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నపళంగా వాటి నుంచి తప్పించుకోవటానికి, ఈ వివాదం మొత్తాన్ని చాకచక్యంగా అందెశ్రీపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ‘సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకునే బాధ్యతను అందెశ్రీకే అప్పగించాను’ అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడీ వివాదంలోకి సమంతను సైతం లాగారు. ఈ ఇష్యూపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ...రాష్ట్రాలు వేరు అంటూ జనాలను విడతీయటం పద్దతి కాదు. ప్రవీణ్ కుమార్ అలా మాట్లాడకూడదు. ఆయన అదే ఉద్దేశ్యంలో ఉంటే కనుక మొదట భారతీయ రాష్ట్ర సమితి గవర్నమెంట్ అపాయింట్ చేసిన తెలంగాణా స్పోర్ట్స్ రిప్రజెంటివ్ పుల్లెల గోపీచంద్ ఏ రాష్టం వారో చెప్పాలి. అలాగే వేరే రాష్ట్రానికి చెందిన సమంతను ఎందుకు హ్యాండలూమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారో వివరణ ఇవ్వాలి. వీళ్లెవరూ తెలంగాణా వాళ్లు కాదు. కానీ వారికి BRS కీ పొజిషెన్స్ ఇచ్చింది అని అన్నారు.
ఇక అప్పట్లో మంత్రి కేటీఆర్ సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ట్విటర్ లో ప్రకటించారు.తెలంగాణలో ఎంతో మంది ఉండగా ఆమెనే ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు అని కొందరు అప్పట్లో ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అసలే బ్రాండ్ అండాసిడర్ అంటే బోలెడు డబ్బులు కురిపించే సర్కారు ఈమెకు ఎంత ముట్టజెప్పారో అని కొంతమంది నసిగారు కూడా.
అలాగే చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత పలు ప్రాంతాల్లో కూడా పర్యటించారు. చేనేతకు చేయూనిస్తానని పదే పదే ప్రకటించారు. అయితే ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై డౌట్ వచ్చిన చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు ఆర్టీఐ కింద ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. సమంత ను తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని , అసలు ఆమెకు ప్రభుత్వం తరఫున పైసా కూడా ఇవ్వలేదని చాలా స్పష్టంగా బదులిచ్చారు.
చేనేత వస్త్రాలకు సమంత బ్రాండ్ అంబాసిడర్ కాదంటూ వచ్చిన వార్తలపై స్పందించిన డైరెక్టర్ ఒక ప్రకటన కూడా అప్పట్లో విడుదల చేశారు. నిజమే! 'సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు' చేనేతరంగం అభివృద్ధికి, చేనే త వస్త్రాలపై ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన సమంతను మంత్రి కేటీఆర్ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించి గౌరవించారని తెలిపారు. ఆమె సేవలను సంతోషంగా వినియోగించుకుంటామని చెప్పారు.
చేనేత వస్త్రాలంటే తనకు ఇష్టమని, అందుకే టెస్కోతో కలిసి స్వచ్ఛందంగా చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పిస్తానని సమంత చెప్పారన్నారు. ఈ కారణంగానే ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించినట్లు తెలిపారు. దీనికనుగుణంగానే సమంత ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. AD పలు చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను, ప్రాంతాలను కూడా సందర్శించారని తెలిపారు.
‘‘నాకు చేనేత వస్త్రాలంటే అత్యంత ఇష్టం. సాధ్యమైనప్పుడల్లా వాటినే ధరిస్తాను. చేనేతను ఒక కళగా నేను భావిస్తాను. ఈ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది’’ అని వివరించారు. చేనేత కార్మికుల కోసం తాను చేయాలనుకుంటున్న పలు కార్యక్రమాలపై ఈ సందర్భంగా అధికారులతో ఆమె చర్చించారు.
తెలంగాణ లో పలు ప్రాంతాల్లో లభించే చేనేత ఉత్పత్తుల గురించి, ముఖ్యంగా ఇక్కత్, పోచంపల్లి వంటివాటి బ్రాండ్ వ్యాల్యూను మరింత పెంచే విషయంలో తన అలోచనలను అధికారులతో పంచుకున్నారు. సిరిసిల్లలో అత్యధికంగా ఉన్న మరమగ్గాల కార్మికుల ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించేందుకు డిజిటల్ ప్రింటింగ్ వంటి పరిజ్ఞానాలను ఉపయోగించవచ్చన్నారు. చేనేత ప్రోత్సాహం కోసం తాను చేపట్టబోయే కార్యక్రమాల పూర్తి వివరాలను వెల్లడిస్తాననన్నారు.
కరీంనగర్ జిల్లాలోని చేనేతల నుంచి తాను సేకరించిన పలు రకాల వస్త్రాల శాంపిళ్లను ఈ సందర్భంగా ఆమె తీసుకొచ్చారు. ఇలాంటి వస్త్రాలకు మార్కెట్ కల్పించేందుకు తనకు తెలిసిన డిజైనర్లు, సంస్థలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం తలపెట్టిన మంచి కార్యక్రమానికి నటి సమంత మద్దతు పలకడం, చేనేత కార్మికుల కోసం పని చేసేందుకు నేరుగా ముందుకు రావడం హర్షణీయమని కేటీఆర్ అన్నారు. సమంతకు ధన్యవాదాలు తెలిపారు. ఇదంతా గడిచిపోయిన విషయం.
సమంత ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక యోగ చేస్తూ బిజీగా ఉంటోంది. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో అలరించిన భామ.. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
Samantha
తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరస చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. మధ్యలో ఈమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.
సినిమాలతో పాటు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉగ్రవాది తరహా పాత్రలో నటించి షాకిచ్చింది. అప్పటివరకు గ్లామరస్ రోల్స్‌లో సామ్‌ని చూసిన ఫ్యాన్స్.. ఈ సిరీస్‌లో సమంత డీ గ్లామర్ గెటప్, ఫైట్స్ చేయడం చూసి అవాక్కయ్యారు.
2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు బయటపెట్టిన సమంత.. జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేర దీన్నుంచి కోలుకుంది. పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చు!
ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సమంతలో ఓ మంచి మనిషి కూడా ఉంది. పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం 'ప్రత్యూష సపోర్ట్' అనే ఎన్జీవో స్థాపించి చాలామందికి సహాయపడుతోంది. ఇలా సమంత జీవితం చూసుకుంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని స్థాయి నుంచి మొదలై.. స్టార్ హీరోయిన్ హోదా అనుభవించి.. పెళ్లి జీవితంతో విమర్శలు ఎదుర్కొని.. పరిస్థితులు ఎదురు తిరిగిన నిలబడి గెలిచిన బ్యూటీ సామ్.