- Home
- Entertainment
- ఓటీటీలో ఇండియా వైడ్ రికార్డ్ సృష్టించిన కింగ్డమ్, థియేటర్లలో ఫ్లాపై ఇక్కడ మాత్రం దుమ్ములేపుతోంది
ఓటీటీలో ఇండియా వైడ్ రికార్డ్ సృష్టించిన కింగ్డమ్, థియేటర్లలో ఫ్లాపై ఇక్కడ మాత్రం దుమ్ములేపుతోంది
విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలో ఆశించిన స్థాయికి చేరకపోయినా, ఓటీటీలో సంచలనం సృష్టిస్తూ వరుసగా రెండు వారాలు భారత్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించినా, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో దూసుకెళ్లలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం డిజిటల్ ప్రపంచంలో రికార్డులు సృష్టిస్తోంది.
ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 7 వరకు ఓటీటీలో కింగ్డమ్ భారత్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మొత్తం 5.9 మిలియన్ వ్యూస్‌ను సాధించి, ఈ సినిమా ఓటీటీలో దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు.
కింగ్డమ్ బాలీవుడ్ చిత్రాలు మెట్రో ఇన్ ఇండియా, మాలిక్, ఇన్‌స్పెక్టర్ జెండే, మా వంటి సినిమాలను వెనక్కి నెట్టి, డిజిటల్ స్క్రీన్లపై తన ఆధిపత్యాన్ని చూపించింది. థియేటర్లలో అంత బాగా రాణించకపోయినా, ఓటీటీలో ఈ స్థాయి స్పందన రావడం ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ విజయంతో కింగ్డమ్ సీక్వెల్‌పై కూడా చర్చలు మొదలయ్యాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్, వెంకిటేష్, భూమి శెట్టి, మనీష్ చౌధరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీకి కింగ్డమ్ చిత్రంతో వరుసగా రెండో షాక్ తగిలింది. ఆమె డెబ్యూ చేసిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కాగా.. కింగ్డమ్ కూడా నిరాశపరిచింది. భాగ్యశ్రీ తన అందంతో యువతని మాయ చేస్తోంది కానీ.. ఇలా ఫ్లాపులు ఎదురుకావడం ఆమె కెరీర్ కి అంత మంచి సంకేతం కాదు అని నెటిజన్లు అంటున్నారు.