- Home
- Entertainment
- ఆ కమెడియన్ ఆస్తి ముందు నాగార్జున కూడా సరిపోరు, 500 ఎకరాలకు ఏకైక వారసుడు.. మొత్తం ఎలా పోయిందో తెలుసా
ఆ కమెడియన్ ఆస్తి ముందు నాగార్జున కూడా సరిపోరు, 500 ఎకరాలకు ఏకైక వారసుడు.. మొత్తం ఎలా పోయిందో తెలుసా
ఓ నటుడు సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు క్రేజీ కమెడియన్ గా రాణిస్తున్నారు. అతడి ఆస్తుల గురించి ఈ వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం గ్యారెంటీ.

బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన కమెడియన్
చిత్ర పరిశ్రమలో పొట్ట చేతపట్టుకుని వచ్చి అగ్ర స్థానానికి ఎదిగిన నటీనటులు ఎందరో ఉన్నారు. మరికొందరు ధనవంతులుగా, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు కమెడియన్ రాణిస్తున్న ఓ నటుడు ఉన్నారు. అతడి పేరు సత్యన్. ఇతడిని సత్యన్ అనే పేరుతో కంటే సైలెన్సర్ అనే పేరుతోనే అభిమానులు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు.
స్నేహితుడు మూవీలో గుర్తుండిపోయే పాత్ర
దళపతి విజయ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు చిత్రంలో సత్యన్ సైలెన్సర్ అనే పాత్రలో నటించారు. ఆ మూవీలో సత్యన్ కామెడీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. సత్యన్ బలమైన బ్యాగ్రౌండ్ నుంచే సినిమాల్లోకి వచ్చారు. సత్యన్ తండ్రి పేరు శివకుమార్. ఆయన కోయంబత్తూర్ సమీపంలో పెద్ద భూస్వామి. వీరికి ఏకంగా 500 ఎకరాల భూమి, పెద్ద బంగ్లా, వివిధ ఆస్తులు ఉండేవి. శివకుమార్ సినీ నిర్మాత గా కూడా రాణించారు.
ఆ ఆస్తి మొత్తం ఉండి ఉంటే..
కట్టప్ప సత్యరాజ్ కి సోదరుడే శివకుమార్. అంటే సత్యన్ కి ఆయన బాబాయ్ అవుతారు. శివకుమార్ కి సత్యన్ ఏకైక సంతానం మాత్రమే. వీళ్లకు అప్పట్లో ఉన్న 500 ఎకరాలు, బంగ్లా, వివిధ ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే.. చిత్ర పరిశ్రమలో సత్యన్ ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండేవారు కాదు. సౌత్ సినిమాలో అత్యధిక ధనవంతుడైన నటుల్లో నాగార్జున అగ్ర స్థానంలో ఉంటారు. సత్యన్ కుటుంబం కనుక తమ ఆస్తులని కాపాడుకుని ఉంటే నాగార్జునని మించేలా ధనికులుగా ఉండేవారు. కానీ అలా జరగలేదు.
వ్యాపారాల్లో నష్టాలు, సినిమాల్లో ఎదురుదెబ్బ
సత్యన్ తండ్రి శివకుమార్ సినిమా రంగంతో పాటు వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారు. ఒక్క చోట కూడా కలిసి రాలేదు. తీవ్రమైన నష్టాలు తలెత్తాయి. దీనితో కొద్ది కొద్దిగా శివకుమార్ తమ ఆస్తులని అమ్మేస్తూ వచ్చారు. తన కొడుకు సత్యన్ ని తమిళ సినిమాలో హీరోగా లాంచ్ చేయాలని శివకుమార్ భావించారు. దీనితో సత్యన్, కౌసల్య హీరో హీరోయిన్లుగా ఇళయవన్ అనే చిత్రాన్ని భారీ బడ్జెట్ లో 2000 సంవత్సరంలో శివకుమార్ నిర్మించారు. ఆ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. దీనితో శివకుమార్ కి మరింతగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ సినిమా నష్టాలు భర్తీ చేయడానికి శివకుమార్ మరికొన్ని ఆస్తులు అమ్మేశారు.
ఆస్తి మొత్తం పోయింది
ఆ తర్వాత కాలంలో శివకుమార్ మరణించారు. తండ్రి మరణించిన తర్వాత సత్యన్ కి ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యాయి. దీనితో కోయంబత్తూర్ సమీపంలో ఉన్న మిగిలిన ల్యాండ్, బంగ్లాని సత్యన్ అమ్మేసి చెన్నైకి వచ్చేశారు. ప్రస్తుతం సత్యన్ కి సినిమాల్లో వస్తున్న సంపాదన తప్ప తండ్రి నుంచి వచ్చిన ఆస్తులేమీ మిగల్లేదు. కోయంబత్తూర్ లో ఆస్తులు అమ్మేసిన తర్వాత సత్యన్ అటువైపు వెళ్లడమే మానేశారని బంధువులు చెబుతుంటారట. హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యన్ పరిస్థితులు కలిసి రాకపోవడంతో కమెడియన్ గా మారారు. ప్రస్తుతం సత్యన్ తమిళంలో క్రేజీ కమెడియన్లలో ఒకరు. స్నేహితుడు, తుపాకీ, 24, రాజా రాణి లాంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో భీష్మ, రాధే శ్యామ్ చిత్రాల్లో మెరిశారు.