వెన్నెల కిషోర్...ప్రమోషన్స్ వివాదం, విమర్శలు, అసలేం జరిగింది?
వెన్నెల కిశోర్ హీరోగా నటించిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమా ప్రమోషన్స్ కి ఆయన హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. కిషోర్ తాను హీరో కాదని, తన పాత్ర చిన్నదే అని స్పష్టం చేశారు. చిత్ర బృందం మాత్రం కథే హీరో అంటూ ప్రమోషన్స్ కొనసాగిస్తోంది.
'వెన్నెల' కిశోర్ తెలుగులో నెంబర్ వన్ కమిడియన్. అదే సమయంలో ఆయన హీరోగా కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఓటిటి బిజినెస్ బాగానే జరుగుతున్నాయి. ఈ యేడాది వెన్నెల కిషోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111' వచ్చింది.వెళ్లింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ సినిమానే ''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్''
క్రిస్మస్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని బాక్సాఫీస్ బరిలో దిగుతున్న చిత్రాలలో ''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'' కూడా ఒకటి. డిసెంబర్ 25వ విడుదల కాబోతున్న ఈ చిత్రానికి అంతకంటే ముందుగా అంటే మంగళవారం సాయంత్రమే కొన్ని ఏరియాలలో ఎర్లీ బర్డ్స్ షోస్ పేరుతో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. మెల్లి మెల్లిగా బజ్ క్రియేట్ అవుతున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'' సినిమా హీరో వెన్నెల కిషోర్ కాబట్టి ఆ ప్రమోషనల్ కంటెంట్ లో వెన్నెల కిషోర్ ను హైలైట్ చేస్తూ వచ్చారు మేకర్స్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఇతర పోస్టర్స్.. ఇలా అన్నిట్లో ఆయన్నే ప్రధానంగా చూపించారు. కానీ ప్రమోషన్ ఈవెంట్స్ లల్లో మాత్రం వెన్నెల కిశోర్ ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో సినిమా ప్రచారానికి సహకరించడం లేదంటూ రూమర్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కిషోర్.. ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చారు. తాను సినిమాలో హీరో కాదని స్పష్టం చేసారు.
''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'' మూవీ కోసం ఏడు రోజుల కాల్షీట్స్ చాలని చెప్పి, 10 రోజులు తీసుకున్నారని వెన్నెల కిషోర్ చెబుతున్నారు. స్క్రీన్ ప్లే మార్పించి మళ్లీ కొత్తగా డబ్బింగ్ చెప్పించారని తెలిపారు. పబ్లిసిటీకి రావడం లేదని అంటున్నారు కానీ, తాను యుఎస్ కు వెళ్తున్నాని ముందే యూనిట్ కు తెలుసని చెప్పారు.
మొదట్లో సినిమాలో తనది మధ్యలో వచ్చే చిన్న పాత్ర అని, ఏడుగురిని విచారించే పాత్ర కోసం ఏడు రోజుల కాల్ షీట్స్ సరిపోతాయని చెప్పారట. షూట్ చేసిన తర్వాత, మళ్ళీ ఇంకా ఒక రోజు కావాలంటే వెళ్లి షూటింగ్ చేసి వచ్చారట కిషోర్. అయితే కొన్నాళ్ళకు మళ్ళీ వచ్చి సాంగ్ లో కనిపించాలని చెప్పి అదనంగా ఇంకో రోజు అడిగారట. ఇలా సినిమా కోసం మొత్తం పది వర్కింగ్ డేస్ తీసుకున్నారట.
అయితే గెటప్ శ్రీను, అనీష్ కురివెళ్ల లాంటి వారు ఫోన్ చేసి సినిమాలో హీరో మీరే అంట కదా? అని వెన్నెల కిషోర్ ను అడగడంతో.. ఇదే విషయాన్ని డైరెక్టర్ ను అడిగారట వెన్నెల కిశోర్. సినిమాలో హీరో వేరే ఉన్నాడని దర్శకుడు సమాధానమిచ్చారట.
ఆ తర్వాత స్క్రీన్ ప్లే అంతా మార్చేసి మళ్లీ కిషోర్ తో కొత్తగా డబ్బింగ్ చెప్పించారట. కానీ ఇప్పుడేమో 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమాకి తనే హీరో అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారని వెన్నెల కిషోర్ అంటున్నారు. తానేదో సినిమా ప్రచారానికి సహకరించడం లేదనే విధంగా మాట్లాడుతున్నారని, తాను యుఎస్ వెళ్తున్నాననే విషయం కూడా చిత్ర యూనిట్ కు ముందే తెలుసని వివరణ ఇచ్చారు.
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమా రైట్స్ తీసుకున్న వంశీ నందిపాటి ఇటీవల మీడియా మీట్ లో ఇదే విషయం మీద కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రమోషన్స్ కు హీరో ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా.. ''సినిమాలో వెన్నెల కిషోర్ హీరో కాదు. సినిమాకి కథే హీరో.
సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను. ఇప్పుడు కథను నమ్మే ముందుకు తీసుకెళ్తున్నాను. కథలో ఒక ప్రధాన పాత్రను ఆయన పోషించాడు. అంతే తప్ప హీరో కాదు'' అని వంశీ అన్నారు. వెన్నెల కిశోర్ ప్రమోషన్స్ కు ఎందుకు రాలేదనే దానిపై స్పందిస్తూ.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలిపారు.
''ఒక కామన్ ఇంటర్వ్యూకి వచ్చారు. ప్రస్తుతం ఆయన యూఎస్ లో ఉన్నారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోతున్నాడు. ఒకటీ రెండు సార్లు రిక్వెస్ట్ కూడా చేసాం. కానీ కుదరలేదు. సహజంగానే ఆయన చాలా ఇంట్రావర్ట్. ఇంటర్వూస్ కి, ఈవెంట్స్ కి తనని దూరంగా ఉంచమని ముందే చాలా జెంటిల్ అండ్ సాఫ్ట్ గా చెబుతారు'' అని వంశీ నందిపాటి తెలిపారు. పర్టిక్యులర్ గా ఒక ఆర్టిస్టు అని కాకుండా కాకుండా, కంటెంట్ ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏదైనా సినిమా తీసినప్పుడు అది అందరి ప్రోడక్ట్.. కాకపోతే ప్రమోషన్స్ కి రావడానికి ఒక్కొక్కరికి కుదురుతుంది, ఒక్కొక్కరికి కుదరక రారు అని వంశీ చెప్పుకొచ్చారు.