ప్రముఖ టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూత.. ఆయన ఏ సినిమాలు నిర్మించారంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేద రాజు టింబర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. అల్లరి నరేష్‌తో `మడత కాజా`, `సంఘర్షణ`(పోరాలి) వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్(54) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నిర్మాత వేదరాజు భౌతిక కాయానికి నేడు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
వేద రాజు టింబర్ ఓ వైపు వ్యాపార రంగంలో ఉన్నారు. ఆయన కన్ స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే సినిమాలపై అభిరుచితో నిర్మాతగా మారారు. అల్లరి నరేష్‌తో సినిమాలు తీశారు. `మడతా కాజా`, అలాగే `సంఘర్షణ` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. దీంతోపాటు ఇప్పుడు మరో సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన కన్నుమూయడం అత్యంత విచారకరం. త్వరగా కోలుకుని ఇంటికి ఆరోగ్యంగా తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఇంతలోనే ఇంతటి విషాదం చోటు చేసుకుంది. నిర్మాత వేద రాజు మృతి పట్ల చిత్ర పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన `మడత కాజా`(2011) చిత్రానికి సీతారామరాజు దంతులూరి దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో స్నేహా ఉల్లాల్ హీరోయిన్. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఆదరణపొందింది.
అదే ఏడాది వేదరాజు టింబర్ తమిళంలో యాక్షన్ థ్రిల్లర్ `పోరాలి`(సంఘర్షణ) చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అల్లరి నరేష్‌తోపాటు స్వాతి రెడ్డి, నివేతా థామస్, వసుందరా కాశ్యప్, సూరి, గాంజా కరుపు ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సముద్రఖని దర్శకుడు కావడం విశేషం. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.