కైకాల మృతికి ప్రముఖుల సంతాపం.. రాంచరణ్, నాని, బాలయ్య ఎమోషనల్ కామెంట్స్
లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ(87) తుదిశ్వాస విడిచారు. కైకాల చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే కైకాల పలు అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదం తీరక ముందే టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ(87) తుదిశ్వాస విడిచారు. కైకాల చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే కైకాల పలు అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్నారు.
ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఫిలిం నగర్ లోని తన నివాసంలో కైకాల మరణించారు. కైకాల మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కైకాల సత్యనారాయణ ఇండస్ట్రీలో అందరి మనిషిగా మెలిగారు. దాదాపు 60 ఏళ్ల పాటు సత్యనారాయణ సినీ జీవితంలోనే గడిపారు. పలు తారలతో అధిక చిత్రాలు చేసిన ఘనత కైకాలకే దక్కుతుంది.
కైకాల మరణించిన విషాద సమయంలో సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలుపుతున్నారు. రాంచరణ్ ట్విట్టర్ వేదికగా ' కైకాల సత్య నారాయణగారి మృతి నన్ను ఎంతగానో బాధించింది. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సంతాపం తెలిపాడు.
కైకాల మృతికి బాలకృష్ణ కూడా సంతాపం ప్రకటించారు. కైకాల సత్యనారాయణగారి మరణం దిగ్బ్రాంతి కలిగించింది. ఆయన ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో గడిపారు. పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో నట సార్వభౌముడిగా అలరించారు. మా కుంటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి మంచి అనుభందం ఉంది. నాన్నగారితో ఎన్నో చిత్రాల్లో కలసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. నటుడిగా మాత్రమే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన ఈరోజు మనమధ్య లేకపోవడం దురదృష్టకరం అని బాలకృష్ణ తన సంతాపం ప్రకటించారు.
ఇక హీరో నాని కూడా కైకాల మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కైకాల గారి మరణవార్త విని నా హృదయం ముక్కలయింది. తెలుగు సినిమా గోల్డెన్ ఎరాలో నాకు నచ్చిన గొప్ప నటుల్లో ఒకరు. ఆయన ఆహార్యం లెజెండ్ అనే పదానికి సరిపోతుంది. మన ఇంట్లో మనిషి అనిపిస్తారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని నాని ట్వీట్ చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేస్తూ.. కైకాల సత్యనారాయణ గారు ఇక లేరని తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఆయన నిజమైన లెజెండ్. ఆయన పోషించిన చాలా పాత్రలు ఇతరులకి అసాధ్యం అని పేర్కొన్నాడు. రవితేజ కూడా తన సంతాపం ప్రకటించాడు. కైకాల మృతి నా హృదయానికి ఎంతో బాధ కలిగించింది. ఇండియన్ సినిమా గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి.