- Home
- Entertainment
- అల్లు అర్జున్‌కి `ఆర్య` రావడం వెనుక హీరో తరుణ్.. ఆ ఒక్క ఫోన్ కాల్ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?
అల్లు అర్జున్‌కి `ఆర్య` రావడం వెనుక హీరో తరుణ్.. ఆ ఒక్క ఫోన్ కాల్ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?
అల్లు అర్జున్ `ఆర్య` చిత్రంతో బిగ్ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్ పాత్ర ఉందట. ఆయన ఫోన్ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్ బ్రేక్ అందుకుని స్టార్ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్. ఆ సమయంలో `ఆర్య` కథ వచ్చిందని తెలిపారు బన్నీ.
ఇటీవల `ఆర్య 20ఏళ్లు` సెలబ్రేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అసలు ఆర్య ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పారు అల్లు అర్జున్. ఈ క్రమంలో ఆయన తరుణ్ పేరు ప్రస్తావించడం విశేషం. తరుణ్ వల్లే ఈ ప్రాజెక్ట్ తనకు వచ్చిందన్నారు. ఇందులో ఆ సంఘటన కూడా బయటపెట్టాడు బన్నీ.
Allu Arjun
`గంగోత్రి` సినిమా తర్వాత తనకు పేరు రాలేదని తెలిపాడు బన్నీ. అనేక కథలు విన్నాడట ఏదీ నచ్చలేదట. మంచి క్రేజీ మూవీ వస్తే బాగుండనిపించింది. కానీ రావడం లేదు. దీంతో డౌన్ అయిపోయాడట బన్నీ. ఆ సమయంలోనే `ఇడియట్`, `వెంకీ` సినిమాలు చూశాడట బన్నీ. ఇలాంటి మూవీ పడితే బాగుండనిపించిందట.
సరిగ్గా అదే సమయంలో తరుణ్ ఫోన్ చేశాడు. తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపాడు బన్నీ. తరుణ్ కోసం స్పెషల్‌గా `వెంకీ` మూవీ షో వేశారట. ప్రసాద్ ల్యాబ్‌లో షో. తరుణ్ కోరిక మేరకు వెళ్లాడట. ప్రసాద్ ల్యాబ్‌లో చాలా మంది వచ్చారు. సినిమా గురించి మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలోనే అందులో ఓ వ్యక్తి తనని కలిసి ఇలా కథ ఉంది చెబుతానన్నాడట. తాను పెద్దగా పట్టించుకోలేదు. లైన్ చెబితే విన్నాడట. అంతే ఆ దెబ్బకి ఫిదా అయిపోయాడట. అబ్బ తనకు కావాల్సింది ఇదే అని ఫిక్స్ అయ్యాడట. అతనే సుకుమార్. అయితే బన్నీ ఇలా ల్యాబ్‌కి వస్తుంటే సుకుమార్ చూసి మన కథకి కావాల్సిన వాడు ఇతనే అని ఫిక్స్ అయ్యాడట సుకుమార్. అందుకే వదల్లేదట.
ఒకటి రెండు సిట్టింగ్‌లు అయ్యాయి. ఇంకా ఫైనల్ కాలేదు. అల్లు అరవింద్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో ఈ మూవీ ఉండదని అంతా అనుకున్నారట. నెరేషన్స్ ఇచ్చి సుకుమార్ అలసిపోయాడట. ఇక ఈ సినిమాలు వద్దు అనుకున్నాడట. ఆ సమయంలో దర్శకుడు వీ వీ వినాయక్ ఎంట్రీ ఇవ్వడం ఆయన భరోసా ఇవ్వడం, ఆ తర్వాత చిరంజీవి వద్దకు కథ వెల్లడం, ఆయన ఓకే చెప్పడంతో ఈ మూవీ స్టార్ట్ అయ్యిందన్నారు.
ఇలా `ఆర్య` వెనుక ఇంత జరిగింది. ఆ రోజు తరుణ్ గానీ బన్నీకి ఫోన్ చేయకపోతే, సుకుమార్, బన్నీ కలిసేవాళ్లు కాదు, ఈ కథ చెప్పుకునేవాళ్లు కాదు. అసలు `ఆర్య` ఉండేది కాదేమో. బన్నీకి కూడా ఈ రేంజ్ కెరీర్ ఉండేది కాదేమో. అల్లు అర్జున్‌నే మొన్న ఈవెంట్‌లో `ఆర్య` లేకపోతే, సుకుమార్ లేకపోతే తాను లేను అని చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అల్లు అర్జున్ `పుష్ప2` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సుకుమార్ దర్శకుడు కావడం విశేషం. `పుష్ప` పెద్ద హిట్ అయ్యింది. `పుష్ప2` కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఈ సినిమా బన్నీ రేంజ్ మరింతగా పెరగబోతుందని చెప్పొచ్చు. మరోవైపు తరుణ్ సినిమాలు చేయడం లేదు. వరుస పరాజయాల అనంతరం ఆయన బ్రేక్ తీసుకున్నారు.