- Home
- Entertainment
- ఇల్లు తాకట్టు పెట్టి కృష్ణ చేసిన సాహసం, ఇండస్ట్రీ పెద్దలను ఎదిరించి సూపర్ స్టార్ చేసిన సినిమా ఏదో తెలుసా?
ఇల్లు తాకట్టు పెట్టి కృష్ణ చేసిన సాహసం, ఇండస్ట్రీ పెద్దలను ఎదిరించి సూపర్ స్టార్ చేసిన సినిమా ఏదో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సాహసాల హీరో అంటే కృష్ణ పేరు ముందుగా వినిపిస్తుంది. కృష్ణ తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కృష్ణ పట్టుదల ఎలా ఉంటుందంటే?

టాలీవుడ్ కు టెక్నాలజీని పరిచయం చేసిన హీరో
కృష్ణ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి సూపర్ స్టార్ గా మారడానికి ఎంతో కష్టపడ్డారు. తెలుగు సినిమాకు కృష్ణ టెక్నాలజీ తో సొగబులద్దారు. టాలీవుడ్ లో ఫస్ట్ కలర్ సినిమా కృష్ణదే. ఫస్ట్ జేమ్స్‌బాండ్ మూవీ, ఫస్ట్ కౌబాయ్ మూవీ, డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసిన తొలి హీరో కూడా కృష్ణనే. తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం, ఫస్ట్ కలర్ సినిమా కూడా కృష్ణ చేసిందే. సింహాసనం సినిమాతో టాలీవుడ్ లో తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ ను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా కృష్ణ టాలీవుడ్ కు అందించిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. కలర్ ప్రింట్స్ కోసం ముందుగానే ఫారెన్ కంపెనీలకు లక్షలు పంపించి, తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాల ద్వారా సరికొత్త అనుభూతిని కలిగించారు కృష్ణ.
కృష్ణ కెరీర్ లో చేసిన సాహసాలు ఎన్నో
సినిమా అంటే కృష్ణకు ప్రాణం. అందుకే సినిమానే లోకంగా బ్రతికారు. రోజుకు నాలుగు షిప్ట్ లు పనిచేసిన రికార్డు ఆయన సొంతం. అంతే కాదు ఒక ఏడాదిలో 17 సినిమాలు రిలీజ్ చేసి, టాలీవుడ్ లో ఎవరు అందుకోలేని ఘనత సాధించారు కృష్ణ. టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లో, డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం అంటే, ఏ హీరో కూడా ఆ సాహసం చేయలేరు. కానీ కృష్ణ ఆ పనిచేసి చూపించారు. స్కూటర్ చేజింగ్ సీన్స్ కూడా కృష్ణ ఓన్ గానే చేసేవారట. ఇక సినిమా నిర్మాణం విషయంలో కూడా కృష్ణ పట్టుదల వేరు. ఎన్టీఆర్ వద్దన్నా వినకుండా అల్లూరి సీతారామరాజు చేసి హిట్ కొట్టారు. చిరంజీవి దూసుకుపోతున్న రోజల్లో తన కెరీర్ కాపాడుకోవడం కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు కృష్ణ.
ఇల్లు తాకట్టుపెట్టి మరీ తీసిన సినిమా
సినిమా కోసం ఎంత పెద్ద నిర్ణయాలైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు కృష్ణ. తానే హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ.. పైగా డ్యూయల్ రోల్ చేసిన సినిమా సింహాసనం. ఈసినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు కృష్ణ. సెట్ కోసమే ఆరోజుల్లో 50 లక్షల వరకూ ఖర్చు చేశారు. సినిమా నిర్మాణంలో ఏమాత్రం రాజీపడకుండా పూర్తి చేశారు. ఇండస్ట్రీలో పెద్దలు వద్దని ఎంత వారిస్తున్నా కూడా వినకుండా సింహాసనం సినిమా కోసం భారీగా బడ్జెట్ ను ఖర్చు చేశారు కృష్ణ. ఆర్ధికంగా కాస్త ఇబ్బందులు ఎదురైతే తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ, సినిమా నిర్మాణంలో పెట్టారు. ఆయన అనుకున్నదానకంటే ఎక్కువగానే సింహాసనం సినిమా రాబట్టింది. 40 కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. 2 కోట్లకు పైగా వసూళ్లను కూడా సాధించింది సినిమా.
నిర్మాతల పాలిట దేవడు సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణను ఇండస్ట్రీలో దేవుడిలా కొలుస్తారు. మరీ ముఖ్యంగా నిర్మాతల పాలిట ఆయన నిజంగా దేవుడే. రెమ్యునరేషన్స్ ఇచ్చినా ఇవ్వకుండా అడిగేవారు కాదట, తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే.. ఆనిర్మాతతో మరో సినిమా చేయడానికి వెంటనే కాల్షీట్లు ఇచ్చి, ఫైనాన్స్ కూడా ఇప్పించేవారట. ఇలా నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని నమ్మే వ్యక్తి కృష్ణ. అందుకే నిర్మాతలు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా, వారు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినా.. చూసీ చూడనట్టు ఉండేవారట కృష్ణ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఎలా అయితే తమ ప్రత్యకతను చాటుకున్నారో, కృష్ణ కూడా తన మార్క్ సినిమాలతో ఇండస్ట్రీలో చిరస్థాయిలో నిలిచిపోయారు.