శోభన్ బాబు పూజ గదిలో స్టార్ హీరో ఫోటో, ఆయన అంటే ఎందుకు అంత ప్రాణం
సాధారణంగా స్టార్ హీరోల ఫోటోలను అభిమానులు తమ ఇంట్లో పెట్టుకుంటుంటారు, డైహార్ట్ ఫ్యాన్స్ అయితే ఏకంగా పూజగదిలో పెట్టి పూజిస్తుంటారు. కానీ శోభన్ బాబు లాంటి స్టార్ హీరో పూజగదిలో మరో హీరో ఫోటో ఉండటం ఏంటి? ఇంతకీ ఎవరా హీరో

హీరోలను దేవుళ్లుగా కొలిచే అభిమానులు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిల్మ్ స్టార్స్ ను దేవుళ్లుగా కొలుస్తుంటారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లను కూడా దేవతలుగా మార్చి గుళ్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే స్టార్ హీరోలను మాత్రం తమ దేవుళ్లుగా భావించే వారు చాలామంది ఉన్నారు. హీరోల కోసం ప్రాణాలు అర్పించిన అభిమానులు ఎందరో. అంతే కాదు స్టార్ హీరోల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం చాలా కామన్, అభిమానం ఎక్కువైతే ఆ ఫోటోలు పూజగదిలో కూడా కనిపిస్తుంటాయి. ఇక దివంగత స్టార్ హీరోల విగ్రహాలు ప్రతీ సెంటర్ లో చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎమ్జీఆర్, శోభన్ బాబు, ఇలా అలనాటి హీరోలను పూజ్యులుగా చూస్తుంటారు ఫ్యాన్స్. అయితే సాధారణ అభిమానుల మాదిరగా శోభన్ బాబు కూడా తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ఫోటోను పూజగదిలో పెట్టుకున్నారని మీకు తెలుసా?
సోగ్గాడు, అందాల నటుడు
ఫిల్మ్ ఇండస్ట్రీలో అందాల నటుడు, సోగ్గాడు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు. క్రమశిక్షణ కలిగిన లైఫ్ స్టైల్ కు ఆయన బెస్ట్ ఎక్జాంపుల్. అప్పట్లో శోభన్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా మహిళా అభిమానులు అయితే శోభన్ బాబును ఎంతో ఇష్టపడేవారు. ఓ షూటింగ్ లో ఓ మహిళా అభిమాని ఆయనకు ముద్దు కూడా పెట్టిందని సమాచారం. హీరోయిన్లు అయితే శోభన్ బాబుతో సినిమాలు చేయడానికి క్యూలో ఉండేవారట. ఆ రేంజ్ లో ఫాలోయింగ్ సాధించిన శోభన్ బాబుకు ఎంతో ఇష్టమైన హీరో, ఒక రకంగా ఆరాధించే వ్యక్తి నందమూరి తారకరామారావు.
శోభన్ బాబు పూజ గదిలో ఎన్టీఆర్ ఫోటో
శోభన్ బాబు ఎవరితో అయినా చాలా లిమిట్ లో ఉండేవారు. ఆయన అనవసరంగా ఎవరితో ఎక్కువగా మాట్లాడరు, అనసవరంగా ఎక్కువ ఖర్చులు పెట్టరు. కానీ శోభన్ బాబు అభిమానించారంటే మాత్రం ఆ వ్యక్తి మహోన్నతుడై ఉంటాడు. శోభన్ బాబు గురించి ఓ సందర్భంలో కృష్ణం రాజు మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. " ఓ సారి చెన్నైలో ఉన్న శోభన్ బాబు ఇంటికి వెళ్తే.. ఆయన ఫూజగదిలో నిలువెత్తు ఎన్టీఆర్ ఫోటో కనిపించింది, చూసి ఆశ్చర్యపోయాను, ఎన్టీఆర్ అంటే శోభన్ బాబుకు అంత ఇష్టం, ఆయన్ను శోభన్ బాబు ఆరాధిస్తుంటాడు'' అని కృష్ణం రాజు అన్నారు.
ఎన్టీఆర్ ఆరాధ్యుడు ఎలా అయ్యాడు
నందమూరి తారకరామారావు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు తెలుగువారందరి బ్రాండ్ . సినిమాలు రాజకీయాలు, పాలన ప్రతీ విషయంలో ఎన్టీఆర్ తన మార్క్ చూపించి మహోన్నతుడిగా నిలిచారు. నటుడిగా ఆయన కృష్ణడు, రాముడు, శంకరుడు, వీరబ్రహ్మంగారు, కర్ణుడు, అర్జునుడు, రావణుడు, ఇలా ఎన్నో మైథలాజికల్ పాత్రలు అద్భుతంగా పోషించారు. రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ ను చూసిన ఆడియన్స్ నిజమైన దేవుడిలా ఆయన్ను కొలిచేవారు. తిరుపతి యాత్రకు వెళ్లిన ప్రజలు చెన్నై వెళ్లి ఎన్టీఆర్ ను దర్శించుకుంటే యాత్రలు ముగిసినట్టుగా భావించేవారు. ఆతరువాత కాలంలో ముఖ్యమంత్రిగా 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి పథకాలు ప్రజలలో ఎన్టీఆర్ ను దేవుడిని చేశాయి. పేదవారికి ఎన్టీఆర్ ఆరాధ్యుడు అయ్యాడు.
ఎన్టీఆర్ గురించి శోభన్ బాబు మాటల్లో
ఎన్టీఆర్ గురించి చాలా సందర్భాల్లో శోభన్ బాబు ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆయన కల్మషంలేని వ్యక్తిత్వం తనకు నచ్చుతుందన్నారు. నటుడిగా కోట్ల అభిమానం చూసిన ఎన్టీఆర్, కోఆర్టిస్ట్ ల విషయంలో కూడా చాలా ప్రేమగా ఉంటారని శోభన్ బాబు అన్నారు. అంతే కాదు ఒక హీరో తన సినిమాలో మరో హీరోకు ఛాన్స్ ఇవ్వడమనేది చాలా అరుదైన విషయం, అది కూడా అప్పుడప్పుడు ఎదుగుతున్న తనలాంటి చిన్న హీరోకు ఎన్టీఆర్ ఛాన్స్ లు ఇచ్చి ప్రోత్సహించారని, అందుకే ఆయన మహనీయుడయ్యాడని శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శోభన్ బాబు గురించి కృష్ణం రాజు ఏమన్నారంటే..?
శోభన్ బాబు సేవా సమతి గతంలో నిర్వహించిన కార్యక్రమంలో శోభన్ బాబు గురించి దివంగత నటుడు కృష్ణం రాజు కొన్ని విషయాలు పంచుకున్నారు. ''శోభన్ బాబను ను అందరు పిసినారి అంటుంటారు. కానీ ఆయన అలా కాదు.. నిజమే ఆయన ఎక్కువ ఖర్చు పెట్టడు అనవసరంగా, అనవసర దానాలు చేయడు, అవనసరంగా మాట్లాడడు, నిజంగా తన సహాయం కావల్సిన చోట ఖచ్చితంగా అనుకున్నదానికి ఎక్కువే చేస్తాడు. చనిపోవడానికి నాలుగు రోజుల ముందే నాకు ఫోన్ చేశాడు. ఫ్యామిలీతో నాలుగు రోజులు చెన్నై వచ్చి వెళ్లమన్నాడు. కానీ సడెన్ గా శోభన్ బాబు మరణవార్త తెలిసి షాక్ అయ్యాను '' అని కృష్ణంరాజు అన్నారు.