- Home
- Entertainment
- Mahesh Babu: ముంబై బ్యాక్‌డ్రాప్‌లో హైబడ్జెట్ యాక్షన్ గేమ్.. మహేష్ బాబు కొత్త ప్లాన్ ఇదే
Mahesh Babu: ముంబై బ్యాక్‌డ్రాప్‌లో హైబడ్జెట్ యాక్షన్ గేమ్.. మహేష్ బాబు కొత్త ప్లాన్ ఇదే
Mahesh Babu Shotgun Games: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ముంబైకి చెందిన షాట్‌గన్ గేమ్స్ స్టూడియోలో పెట్టుబడి పెట్టారు. హైబడ్జెట్ యాక్షన్ గేమ్ ప్రాజెక్ట్ టేక్‌డౌన్ నిర్మాణంలో భాగం కానున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అమెరికా, యూరప్ మార్కెట్లే టార్గెట్.. మహేష్ బాబు చేతికి భారీ గేమింగ్ ప్రాజెక్ట్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు సరికొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ పీసీ, కన్సోల్ గేమింగ్ స్టూడియో షాట్‌గన్ గేమ్స్ లో ఆయన వ్యూహాత్మక పెట్టుబడి పెట్టారు. కేవలం ఇన్వెస్టర్‌గా మాత్రమే కాకుండా, ఈ స్టూడియో రూపొందిస్తున్న ప్రధాన ఫ్రాంచైజీ గేమ్స్ నిర్మాణంలో కూడా మహేష్ బాబు భాగస్వామి కానున్నారు. భారతీయ గేమింగ్ రంగానికి ఈ ఒప్పందం ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది.
అసలేంటి ఈ ప్రాజెక్ట్ టేక్‌డౌన్?
షాట్‌గన్ గేమ్స్ సంస్థ ప్రస్తుతం ప్రాజెక్ట్ టేక్‌డౌన్ అనే ఒక భారీ బడ్జెట్ యాక్షన్-అడ్వెంచర్ గేమ్‌ను రూపొందిస్తోంది. ముంబై నగర నేపథ్యంలో ఈ గేమ్ కథ సాగుతుంది. ఈ గేమ్‌ను కేవలం మన దేశం కోసమే కాకుండా ఉత్తర అమెరికా, యూరప్, యూకే వంటి అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్నారు. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X/S, పీసీ ప్లాట్‌ఫామ్‌లపై గేమర్లకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్టూడియో పనిచేస్తోంది.
యాక్షన్ డిజైన్, ఇతర ప్రాజెక్టులు
ఈ గేమ్‌లో యాక్షన్ సన్నివేశాలను అత్యంత సహజంగా, థ్రిల్లింగ్‌గా తీర్చిదిద్దడానికి ప్రముఖ భారతీయ యాక్షన్ డైరెక్టర్ విక్కీ అరోరా పనిచేస్తున్నారు. ఆయన ఈ గేమ్ ఆక్షన్ డిజైన్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రాజెక్ట్ టేక్‌డౌన్ తో పాటు, షాట్‌గన్ గేమ్స్ సంస్థ రోల్ ఎమ్ అవుట్ అనే మరో కో-ఆపరేటివ్ ఇండీ అడ్వెంచర్ గేమ్‌ను కూడా నిర్మిస్తోంది.
షాట్‌గన్ గేమ్స్ ప్రస్థానం ఇదే
2022లో జీత్ చందన్, విధిత్ మెహతా కలిసి షాట్‌గన్ గేమ్స్ సంస్థను స్థాపించారు. ప్రారంభంలో ఈ కంపెనీ వెబ్3, మొబైల్ గేమ్స్‌పై మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టింది. అయితే 2024 నాటికి తమ వ్యూహాన్ని మార్చుకుని పీసీ, కన్సోల్ గేమ్స్ తయారీ వైపు అడుగులు వేసింది. 2025 ఆగస్టులో ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ల నుండి ఈ స్టూడియో 1 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్‌ను కూడా సమీకరించింది.
స్టూడియో వ్యవస్థాపకుల ధీమా
భారీ స్థాయి కథలను ఎంచుకోవడంలో, సామాన్య ప్రేక్షకులను అలరించే అంశాలను గుర్తించడంలో మహేష్ బాబుకు ఎంతో అనుభవం ఉంది. ఆయనకున్న ఈ అనుభవం తమ గేమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్తుందని స్టూడియో వ్యవస్థాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో తయారైన కన్సోల్, పీసీ గేమ్స్‌ను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.









