- Home
- Entertainment
- `పుష్ప2` అసలు కథ ఇదే.. టీజర్, పోస్టర్‌తోనే స్టోరీ చెప్పిన సుకుమార్..? హాట్ టాపిక్
`పుష్ప2` అసలు కథ ఇదే.. టీజర్, పోస్టర్‌తోనే స్టోరీ చెప్పిన సుకుమార్..? హాట్ టాపిక్
`పుష్ప2`కి సంబంధించి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టీజర్, పోస్టర్ విడుదల చేయగా అవి ఫ్యాన్స్ ఖుషీ చేస్తూ, ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సుకుమార్ చూపించిన కొత్త అంశాలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయ్యాయి. అవి `పుష్ప2` స్టోరీ రివీల్ చేసినట్టుగా అనిపిస్తుంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న `పుష్ప2`పై ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన టీజర్, పోస్టర్లు ఆ అంచనాలను భారీగా పెంచాయి. అదే సమయంలో ఈ టీజర్, పోస్టర్లలో దర్శకుడు సుకుమార్ ఇచ్చిన హింట్లు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అవి పుష్ప2` కథని చెబుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో `పుష్ప2` స్టోరీ డిటెయిల్స్ కి సంబంధించిన అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అసలు స్టోరీ ఇదే అని నెటిజన్లు ఎవరికి తోచింది వారు చెబుతున్నారు.
అందులో ప్రధానంగా మొదటి భాగంతో పోల్చితే రెండో భాగానికి సంబంధించిన కథకి దగ్గరగా అనిపించే అంశాలు కొన్ని వినిపిస్తున్నాయి. సుకుమార్ కాలిక్యులేషన్స్ ని, వదిలేసిన లాజిక్స్ ని డీ కోడ్ చేస్తే `పుష్ప2` కథ తేలిపోతుందంటున్నారు. బన్నీ గంగమ్మ అవతారం, లేడీ గెటప్‌లోకి మారడం, ఏడమ చేతి చిటికనవేలుకి గోర్ల పెయింట్ పెట్టుకుని ఉండటం, బ్లాక్ అండ్ వైట్ వీడియోలో ఆ ఒక్క పెయింట్ మాత్రం కలర్‌లో చూపించడం, జైలు నుంచి పారిపోవడం, అడవిలో ఉండటం, అడవి తల్లి గంగమ్మ రూపంలో ఆయన శతృ సంహారానికి పూనుకోవడం వంటివి `పుష్ప2` కథని తెలియజేస్తున్నాయని అంటున్నారు నెటిజన్లు.
మొదటి భాగంలో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షేకావత్‌తో గొడవ పడి ఇంటికెళ్లి రష్మిక(శ్రీవల్లి)ని పెళ్లి చేసుకుంటారు పుష్పరాజ్(బన్నీ). దీంతో షేకావత్‌కి, పుష్పరాజ్‌కి మధ్య వార్ ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అయితే రెండో భాగంలో రష్మిక పాత్ర కొద్దిసేపే ఉంటుందని, ఆమె పాత్ర మధ్యలోనే చనిపోతుందనే టాక్ ఉంది. ఇదే నిజమని తాజాగా తెలుస్తుంది. అమితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యని శత్రువులు (షేకావత్).. చంపేసి, పుష్పపై కేసులు పెట్టి జైల్లో వేస్తాడని సమాచారం. పుష్పరాజ్‌ని ఎన్‌కౌంటర్‌లో చంపేసే క్రమంలో ఆయన అక్కడి నుంచి తప్పించుకుని శేషాచలం అడవుల్లోకి వెళ్లిపోతాడని తెలుస్తుంది. అక్కడి నుంచి శత్రు సంహారానికి ప్లాన్ చేసి, ఎవరెవరిని ఎలా చంపాలనేది స్కెచ్ వేసి అమ్మోరు(గంగమ్మ) జాతరలో ఆ పగ తీర్చుకునేందుకు బన్నీ ఇలా లేడీ గెటప్‌లో అమ్మోరులా వస్తాడట.
అంతేకాదు ఆ పగ, ప్రతీకారాన్ని తన భార్యతో కలిసి తీర్చుకునే కాన్సెప్ట్ లో భాగంగా శివుడు అర్థనారీశ్వరుడి గెటప్‌ని తలపించేలా బన్నీ ఇలా లేడీ గెటప్ వేసినట్టు సమాచారం. ఆయన శివ శక్తి రూపం చూపించడం వెనకాల సుకుమార్ లాజిక్ ఇదే అని అంటున్నారు. గుర్తు పట్టకుండా అమ్మోరిలా మారిపోయి ఒక్కోక్కడి గుర్తించి చంపుతాడని, ఈ గంగమ్మ తల్లి లుక్ `పుష్ప2` క్లైమాక్స్ పార్ట్ అని తెలుస్తుంది. ఈ జాతరలోనే షేకావత్‌తోపాటు ఉన్న శత్రువులందరిని చంపడంతో కథ ముగుస్తుందని సమాచారం. దర్శకుడు సుకుమార్ ఇలా టీజర్, పోస్టర్లతోనే అసలు కథని రివీల్ చేశారని అంటున్నారు నెటిజన్లు.
Pushpa 2 Teaser
అయితే టీజర్‌లో పుష్పని అక్కడి పేద జనం పాలిట దేవుడిగా చూపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో తాను సంపాదించింది, ఆయన పెద్దల వద్ద కొట్టింది పేదలకు పంచడానికే అని టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. ప్రభుత్వం దృష్టిలో పుష్ప నేరస్థుడైనా, జనం దృష్టిలో ఆయన దేవుడు. తాను అక్రమంగా సంపాదించిందైనా మంచి కోసం ఉపయోగించాడనే కోణంలో రాబిన్ హుడ్ తరహాలో పుష్పరాజ్‌ని పాత్రని చూపించి ఎమోషనల్‌గా ఆడియెన్స్ కి కనెక్ట్ చేసే ప్రయత్నం దర్శకుడు సుకుమార్ చేశాడని తెలుస్తుంది. దీంతోపాటు పుష్ప2 టైటిల్ చైనా స్టయిల్‌లో ఉండటం, డ్రాగన్ సింబల్స్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాని చైనాలోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. `పుష్ప`ని ఆ మధ్య రష్యాలో ప్రదర్శించారు. మంచి ఆదరణ దక్కింది. పైగా శేషాచలంలో దొరికే అరుదైన ఎర్రచందనానికి చైనాలో భారీగా డిమాండ్ ఉంటుంది. ఆ రకంగా ఈ కథకి చైనాకి సంబంధం ఉంటుంది. కథ పరంగానూ చైనీయులు `పుష్ప2`కి రిలేట్ అవుతారని, అందులో భాగంగానే టైటిల్ చైనా స్టయిల్‌లో డిజైన్ చేసినట్టు సమాచారం. `పుష్ప` సినిమా నార్త్ లో విశేషంగా ఆదరణ పొందింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. విదేశాల్లోనూ తెలుగు మార్కెట్ విస్తరించిన నేపథ్యంలో ఈ రెండో భాగాన్ని భారీగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తరహాలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.