క్యాస్ట్ ఫీలింగ్ లేదనేది పెద్ద అబద్దం.. నేను ప్రత్యక్షంగా చూశా.. రామ్‌చరణ్, బన్నీలపై నిర్మాత వ్యాఖ్యలు
ఈ వారం విడుదలైన `ఆయ్` చిత్రంలో క్యాస్ట్ గురించి చూపించారు. అదే సమయంలో ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ గురించి షాకింగ్ కామెంట్ చేశాడు స్టార్ ప్రొడ్యూసర్.
కాలం మారే కొద్ది, అభివృద్ధి జరిగే కొద్ది, చదువుకునే వాళ్ల సంఖ్య పెరిగే కొద్ది క్యాస్ట్ ఫీలింగ్(కులం భావన) తగ్గాలి. కానీ పెరుగుతుంది. మరింత ముదురుతుంది. గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఈ క్యాస్ట్ ఫీలింగ్ మరింతగి పెరిగింది. రాజకీయాల్లో ఇది చాలా ప్రభావితం చూపుతుంది. అంతేకాదు సినిమా పరిశ్రమలోనూ ఈ ఫీలింగ్ చాలానే ఉంది. చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.
Allu Arjun Ram Charan
అయితే సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఈ కాస్ట్ ఫీలింగ్ ఓ పరిమితి దాటిన తర్వాత తక్కువగానే కనిపిస్తుంటుంది. బంధుత్వాలు కలుపుకునే విషయంలో క్యాస్ట్ ని పట్టించుకోరు. కాకపోతే తక్కువ కులం వారిని పెళ్లి చేసుకోవడం కూడా జరగదు. ఆ విషయంలో ఎవరి లెక్కలు వారికుంటాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. అలాంటిది తాజాగా `ఆయ్` సినిమాలో క్యాస్ట్ ఫీలింగ్ గురించి చూపించారు.
గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన చిత్రమిది. ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నే హీరోగా నటించాడు. అంజి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురువారం విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. కాకపోతే ఆడియెన్స్ థియేటర్‌కి రావడం లేదట. దీంతో ప్రమోషన్స్ పెంచుతున్నారు మేకర్స్. అందులో భాగంగా శనివారం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నిర్మాత బన్నీవాసు. అదే సమయంలో కులం ప్రస్తావన వచ్చింది.
మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ `ఆయ్` సినిమాలో కులం గురించి హీరోయిన్‌తో చెప్పించడానికి కారణమేంటి? అని రిపోర్టర్ ప్రశ్నించగా, బన్నీ వాసు స్పందన షాకిచ్చేలా ఉంది. కులం లేదు అనేది నేను ఒప్పుకోను. ఆ విషయంలో బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తాను. క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని ఈ స్టేజ్‌మీద నుంచి చాలా డిప్లామాటిక్‌గా సమాధానం చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పలేను. క్యాస్ట్ ఫీలింగ్ ఎంత డీప్ రూటెడ్ ఉంది. జనాలు దాని వల్ల ఎలా బిహేవ్ చేస్తారనేది నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని. నేను ఫిల్మ్ నగర్‌లో కూర్చొని సినిమాలు చేయడం లేదు. ప్రతి వారం పాలకొల్లు వెళ్తాను, అక్కడ అన్నీ చూస్తుంటాను, క్యాస్ట్ ఫీలింగ్ అందరిలోనూ ఉందని కుండబద్దలు కొట్టాడు నిర్మాత బన్నీవాసు. పరోక్షంగా మెగా ఫ్యామిలీలోనూ ఆ ఫీలింగ్ ఉందని ఆయన చెప్పకనే చెప్పారు.
ఇక `ఆయ్` సినిమా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. నితిన్ నార్నే హీరోగా నటించిన ఈ చిత్రానికి నెమ్మదిగా థియేటర్లు పెంచుతామని, మూడు నాలుగు రోజులకు సినిమా బాగా పుంజుకుంటుందని తెలిపారు. ఈ ఫ్రైడే నాటికి థియేటర్లు కూడా దొరుకుతాయని చెప్పారు. ఇక సినిమా సక్సెస్ మీట్‌కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని పిలిచే అవకాశం ఉందా? అనే ప్రశ్నకి, ఇప్పుడు వాళ్లు ఉన్న బిజీకి పిలవడం సరైనది కాదు, ఆ రేంజ్ సినిమా కాదు, వాళ్ల ఆశిస్సులు ఉంటే చాలు అని చెప్పాడు బన్నీ వాసు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.