- Home
- Entertainment
- విలన్ పాత్రలకు స్టార్ హీరోలు ఎన్టీఆర్, సూర్య, ఫహద్ క్యూ.. ఇదెక్కడి ట్రెండ్ రా బాబూ.. వారి పరిస్థితే దారుణం
విలన్ పాత్రలకు స్టార్ హీరోలు ఎన్టీఆర్, సూర్య, ఫహద్ క్యూ.. ఇదెక్కడి ట్రెండ్ రా బాబూ.. వారి పరిస్థితే దారుణం
మాకు హీరో కంటే విలన్ పాత్రలే కావాలంటున్నారు స్టార్ హీరోలు. దీంతో హీరోలు విలన్లుగా చేయడం ఇప్పుడు నయా ట్రెండ్ అవుతుంది. కానీ అందులోని మరో కీలక అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది.

చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. విలన్ పాత్రలకు సపరేట్ ఆర్టిస్టులుండటం గతంలో చూశాం. విలన్ అంటేనే గంభీరమైన ఆకారం, భారీ పర్సనాలిటీ, గుబూరు మీసాలు, భయంకర రూపం అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు విలన్ స్టయిలీష్‌గా ఉంటున్నారు. ఆయన రాజకీయ నాయకులు, కార్పొరేట్స్ గా, బిజినెస్ మ్యాన్‌లుగా కనిపిస్తున్నారు. సమాజంలో దోపిడి రూపం మారడంతో సినిమాల్లోనూ విలన్ రూపాంతరం చెందుతున్నాడు.
ప్రస్తుత సమాజంలో నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చి లీడర్స్ గా మారుతున్నారు, జనాలను దోచుకుని కార్పొరేట్లు, బిజినెస్ మ్యాన్‌లు అవుతున్నారు.టెక్నాలజీ రూపంలో, మార్కెట్ రూపంలో దేశాన్ని దోచేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిని అంతం చేస్తున్నారు. అదే ట్రెండ్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చింది. అలాంటి వారి స్ఫూర్తితో స్టయిలీష్ విలన్లు(నెగటివ్ రోల్) తెరపైకి వస్తున్నారు. కోటు వేసుకుని సూటు, బూటుతో అత్యంత స్టయిల్‌గా,జెంటిల్‌మెన్‌లను తలపిస్తున్నారు.
`సరైనోడు`, `అజ్ఞాతవాసి`, `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `మహర్షి` ఇలా ఏ సినిమాలో చూసినా విలన్ కార్పొరేటో, బిజినెస్ మ్యానో, రాజకీయ నాయకుడో అయి ఉంటున్నారు. వాళ్లే సమాజాన్ని, మార్కెట్‌ని, రాజకీయాలను శాసిస్తున్నారు. దీంతో విలన్ పాత్రలు కూడా అంతే స్టయిలీష్‌గా, అత్యంత బలంగా మారిపోతున్నాయి. పై సినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
ట్రెండ్‌కి తగ్గట్టు సినిమా కథల్లో మార్పులు వచ్చినట్టు, హీరోలు కూడా మారిపోతున్నారు. విలన్ పాత్రల్లో నటిస్తూ వాహ్ అనిపిస్తున్నారు. హీరో పాత్రలకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. హీరోగా నటించే ఆది పినిశెట్టి `సరైనోడు`, `అజ్ఞాతవాసి` సినిమాలతో విలన్ అవతారం ఎత్తాడు. ఇప్పుడు రామ్ `వారియర్స్`లోనూ నెగటివ్ రోల్ చేస్తున్నారు. అంతకు ముందు హీరోగా రాణించిన జగపతిబాబు సైతం `లెజెండ్`తో విలన్‌గా విశ్వరూపం చూపించారు.
ఇప్పుడు మరో ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే విలన్లుగా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హీరో పాత్రల కంటే నెగటివ్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటి కోసం క్యూ కడుతున్నారు. `పుష్ప`లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా మెరిశాడు. `కాల్ మీ సర్` అంటూ పుష్పకి చుక్కలు చూపించాడు. విలన్ పాత్రలకూ ఓ రెస్పెక్ట్ ఉంటుందనే విషయాన్ని చాటి చెప్పాడు.
కమల్ హాసన్ నటించిన `విక్రమ్`లోనూ సూర్య, విజయ్ సేతుపతి విలన్లుగా నటించారు. చివర్లో సూర్య `రోలెక్స్` పాత్రలో వచ్చి మొత్తం అటెన్షన్ తనవైపు తిప్పుకున్నారు. తనని సర్ అని పిలవనందుకు ఒకడి తలనే నరికేశాడు. అందులో సూర్య ఎంతటి భయంకరమైన విలన్‌గా కనిపించాడో తెలిసిందే. ఆ పాత్ర నిడివి ఐదు నిమిషాలే అయినా సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్తుంది. ఇలా బలమైన పాత్రలు వస్తే హీరోలు చేసేందుకు ఆసక్తి చూపడం విశేషం. అంతేకాదు `దశావతారం` వంటి పలు చిత్రాల్లో కమల్ హాసనే విలన్.
ఓ వైపు హీరోగా చేస్తూనే శ్రీకాంత్ కూడా `అఖండ`లో విలన్‌గా కనిపించాడు. అంతకు ముందు కూడా విలన్‌గా చేశాడు. బలమైన పాత్రలు వస్తే నెగటివ్ రోల్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నాడు. ఇంకోవైపు చిరంజీవి నటిస్తున్న `గాడ్ ఫాదర్`లో యంగ్ హీరో సత్యదేవ్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. కన్నడలో హీరోగా చేసే సుదీప్ `ఈగ`లో నెగటివ్ రోల్ చేశాడు.
ఓ వైపు హీరోగా, కీలక పాత్రలతో మెప్పించిన సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. `కేజీఎఫ్ 2`లో అధీర పాత్రలో ఆయన విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ సైతం నెగటివ్ రోల్స్ చేస్తున్నారు. `ఆదిపురుష్`లో ఆయన రావణాసురుడి పాత్రని పోషిస్తున్నారు. `పద్మావత్`లో రణ్‌వీర్ సింగ్‌ది కూడా విలన్ పాత్రనే. ఆ పాత్ర సినిమాకే హైలైట్.
హీరోగా చేస్తూ ఆకట్టుకుంటున్న రానా `బాహుబలి`లో నెగటివ్ రోల్ చేశారు. `భళ్లాలదేవ`గా విశ్వరూపం చూపించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో `భీమ్లా నాయక్` చిత్రంలోనూ నెగటివ్ రోల్ చేసి క్రెడిట్ మొత్తం కొట్టేశాడు. నెగటివ్‌రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఇప్పటికే అనే సినిమాల్లో విలన్‌గా చేశాడు. ఇప్పుడు `సలార్`లో ఆయన నెగటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఓ వైపు మలయాళంలో హీరోగా, దర్శకుడిగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
అంతేందుకు ఎన్టీఆర్ సైతం నెగటివ్ రోల్ చేశారు. `జై లవకుశ`లో క్లైమాక్స్ వరకు ఆయన నటించిన జై పాత్ర విలన్‌గానే కనిపిస్తుంది. అందులో హీరోల పాత్రలకంటే విలన్ పాత్రలోనే ఎన్టీఆర్ అద్బుతంగా నటించినట్టు ప్రశంసలు దక్కాయి. ఆయన కూడా తనకు జై పాత్రనే నచ్చిందని చెప్పడం విశేషం. మరోవైపు `వీ` సినిమాలో నాని కూడా నెగటివ్ రోలే చేశారు. హీరోల పాత్రలకంటే నెగటివ్ పాత్రలే బలంగా దర్శకులు రాస్తున్న నేపథ్యంలో వాటి కోసం ఇప్పుడు హీరోలు క్యూ కడుతుండటం విశేషం.
ఇదిలా ఉంటే ఇది మరో కొత్త చర్చకి తెరలేపుతుంది. విలన్ రోల్స్ చేసే ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే చర్చమొదలవుతుంది. మొన్నటి వరకు విలన్ పాత్రలకు సపరేట్ ఆర్టిస్లున్నారు. ప్రకాష్‌రాజ్, ముఖేష్ రుషి, షియాజీ షిండే, అజయ్, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, సంపత్ రాజ్, రెహ్మాన్, రావు రమేష్ వంటి వారు విలన్ పాత్రలు చేసే వారు. కానీ ఇప్పుడు హీరోలే విలన్లుగా చేయడంతో వారి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఉంటే మెయిన్ విలన్‌కి కింద ఉండటమో, లేదంటే అసలే లేకపోవడమో జరుగుతుంది. ఈ ట్రెండ్ వారి అవకాశాలను దెబ్బతీస్తుందనే వాదన కూడా వినిపిస్తుంది.
అయితే సినిమాల్లో మల్టీస్టారర్ ట్రెండ్, పాన్ ఇండియా ఇమేజ్ ఊపందుకుంది. దీంతో ఇతర భాషల్లో కూడా తమ సినిమాలు ఆడాలంటే ఆయా భాషల్లో ఉండే ఇమేజ్ ఉన్న నటులను తీసుకోవడం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇతర భాషల హీరోలనే తీసుకుంటున్నారు. అయితే ప్రతి సినిమాని మల్టీస్టారర్‌గా చేయలేరు, అందుకే నెగటివ్ రోల్స్ ని బలంగా రాసుకుంటున్నారు. ఆయా పాత్రలను హీరోలతో చేయిస్తున్నారు దర్శకులు. ఈ నయా ట్రెండ్‌తో సక్సెస్ కొడుతున్నారు. దీంతో ఈ ట్రెండ్ సక్సెస్ మంత్రంగా మారింది. సినిమా మార్కెట్‌ని పెంచుతుంది. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుంది. అదే సమయంలో విలన్ ఆర్టిస్టుల పొట్టకొడుతుందని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.