భార్య పిల్లలని పోషించడానికి చిల్లిగవ్వ లేదు, శోభన్ బాబు ఏం చేశారో తెలుసా.. సూపర్ హిట్ తర్వాత కూడా దుస్థితి
స్టూడెంట్ గా ఉన్న సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన చిత్రాలు చూసేవారట. మల్లీశ్వరి చిత్రాన్ని అయితే శోభన్ బాబు 22 సార్లు చూశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
టాలీవుడ్ లో నట భూషణుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు..ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణలతో పోటీ పడే స్థాయికి ఎదిగారు. అయితే శోభన్ బాబు సినీ కెరీర్ కేక్ వాక్ అనే తరహాలో ఏమి సాగలేదు. తాను కూడా నటుడిని కావాలనే కోరిక ఏఎన్నార్ నటించిన కీలుగుర్రం చిత్రంతో మొదలైందట.
స్టూడెంట్ గా ఉన్న సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన చిత్రాలు చూసేవారట. మల్లీశ్వరి చిత్రాన్ని అయితే శోభన్ బాబు 22 సార్లు చూశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుకుని అవకాశాలు ఇచ్చింది కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్ అని శోభన్ బాబు తెలిపారు. చాలా చిత్రాల్లో పాత్రలకు ఎన్టీఆర్, ఏఎన్నార్ నన్ను రికమండ్ చేశారు. ఎన్టీఆర్ చాలా పౌరాణిక చిత్రాల్లో నాకు అవకాశం ఇచ్చారు.
ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరినీ నేను తరచుగా కలిసేవాడిని. వాళ్ళ సహకారం లేకుంటే నేను నటుడిగా నిలబడగలిగేవాడిని కాదు అని శోభన్ బాబు తెలిపారు. నర్తనశాల, వీరాభిమన్యు రెండు చిత్రాలు నా కెరీర్ ని మార్చేశాయి. రెండు చిత్రాల్లో అభిమన్యుడిగా నటించాను. వీరాభిమన్యు అయితే సంచలన విజయం గా నిలిచింది. కానీ విధి విచిత్రమైనది.
వీరాభిమన్యు లాంటి సంచలన విజయం తర్వాత నాకు నాలుగైదేళ్ల పాటు సరైన అవకాశాలు రాలేదు. రెండు సినిమాల్లో హీరోగా నటిస్తే ఆ రెండూ ఫ్లాప్ అయ్యాయి. అప్పటికి నాకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. భార్య పిల్లలని పోషించడానికి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి అనుభవించా అని శోభన్ బాబు తెలిపారు. దీనితో తప్పని పరిస్థితుల్లో చిన్న చిన్న వేషాలు వేశాను.
ప్రతిజ్ఞ పాలన అనే చిత్రంలో నారదుడి పాత్ర కోసం 750 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాను. 700 రూపాయలు, 1000 రూపాయల రెమ్యునరేషన్ తో చిన్న చిన్న పాత్రలు చేసినట్లు శోభన్ బాబు తెలిపారు. అంతటి కష్టాలు అనుభవిస్తూనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నా. ఏఎన్నార్, ఎన్టీఆర్ తరహాలో పెద్ద హీరో కావడానికి ఈ సమయమే నాకు పాఠాలు నేర్పింది.
వీరాభిమన్యు చిత్రం నాకు గుర్తింపు తెచ్చిపెడితే.. నా కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'మనుషులు మారాలి'. 1969లో తెరకెక్కిన ఈ చిత్రం నాకు హీరోగా ఫస్ట్ సోలో హిట్. ఈ చిత్రంతో నా కష్టాలు తీరడమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది అని శోభన్ బాబు తెలిపారు. 70వ దశకం నుంచి శోభన్ బాబు అనేక సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగారు.