Singer Sunitha: నమ్మి మోసపోయానంటూ ఓపెన్ అయిన సింగర్ సునీత... రెండో పెళ్లి ఎలాంటి నిర్ణయమో చెబుతూ!
సింగర్ సునీత తన జీవితంలో అనేక ఎత్తు పల్లాలు ఉన్నాయని ఓపెన్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో మోసపోయానంటూ కీలక కామెంట్స్ చేశారు. సునీత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సింగర్ సునీతకు భారీ అభిమానగణం ఉంది. ఆమె పాట, మాటను, కట్టు బొట్టు ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కమ్మని పాటలతో పాటు పదుల సంఖ్యలో హీరోయిన్స్ కి తన గాత్ర దానం చేశారు. అలాగే బుల్లితెర మీద కూడా ఆమె హవా కొనసాగింది. సింగర్ సునీత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి.
సునీత 17 ఏళ్లకే పరిశ్రమకు వచ్చారు. ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతనితో విబేధాలు తలెత్తి విడిపోయారు. 2021 జనవరిలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్నారు. 42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. ఈ విషయంలో పలువురు సెలెబ్స్ ఆమెకు అండగా నిలిచారు. ఆమె వ్యక్తిగత నిర్ణయం విమర్శించడానికి మీరెవరని ఖండించారు.
కాగా తాజా ఇంటర్వ్యూలో సునీత తన జీవితాన్ని నెమరు వేసుకున్నారు.లైఫ్ లో ఎదురైన ఒడిదుడుకులు, కష్టనష్టాలు, విజయాలు, వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యారు. సునీత మాట్లాడుతూ... జీవితంలో ఎత్తుపల్లాలు చాలా సాధారణం. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కొన్నామనేది ముఖ్యం. నా లైఫ్ లో జరిగిన చాలా విషయాలు నేను మర్చిపోయాను. బంధువులు ఆ రోజున నువ్వు ఏడుస్తుంటే చాలా బాధేసిందని గుర్తు చేసినప్పుడు ఆవేదన కలుగుతుంది.
నేను చాలా విషయాల్లో మోసపోయాను. నాపై వచ్చిన విమర్శలు అయితే లెక్కేలేదు. 17 ఏళ్లకే కెరీర్ మొదలుపెట్టాను. 19 ఏళ్లకే పెళ్లి, సంపాదన. కుటుంబ బాధ్యత తీసుకున్నాను. 21 ఏళ్ల వయసులో కొడుకు, 24 ఏళ్లకు కూతురు పుట్టింది. నాన్న వ్యాపారం చేసి నష్టపోయారు. ఉన్న ఇల్లు కూడా పోయింది. 35 ఏళ్ళు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నాను.
ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను మోసం చేశారు. మోసపోయానని తెలిశాక ఆశ్చర్యం వేసేది. చాలా మంది నాది ఫేక్ స్మైల్ అంటారు. నాకు సంబంధించిన ఏదైనా విషయం చెప్పడం ఇష్టం లేకపోతే నవ్వి వదిలేస్తాను. దాన్ని కొందరు ఫేక్ స్మైల్ అనుకుంటారు.
28 ఏళ్ల కెరీర్లో 5 వేలకు పైగా షోలు చేశాను. నాది హస్కీ వాయిస్. పదాలు గొంతులో మింగేస్తుందని అనేక విమర్శలు చేశారు. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. స్టూడియో లోపల పర్సనల్ మేటర్స్ ఎందుకు మాట్లాడతారు. నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చేస్తాను. నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం రెండో వివాహం చేసుకోవడం... అని సునీత అన్నారు.
సునీతకు మొదటి భర్త సంతానంగా ఆకాష్, శ్రేయ ఉన్నారు. శ్రేయ తల్లి మాదిరి సింగర్ గా రాణించే ప్రయత్నం చేస్తుంది. ఆకాష్ హీరో కానున్నాడని సమాచారం. రామ్ వీరపనేని నిర్మాతగా భారీగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.