అత్తారింటికి వెళ్తా అమ్మా అన్నది.. ఆత్మహత్య చేసుకుంటుందనుకోలేః నటి అన్నపూర్ణ కన్నీళ్లు..
సీనియర్ నటి అన్నపూర్ణ తన కూతురుని తలుచుకుని ఎమోషనల్ అయ్యింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని కన్నీరుమున్నీరైంది.
నటిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది సీనియర్ నటి అన్నపూర్ణ. విలక్షణ నటిగా మెప్పించింది. ఇప్పటికీ తనదైన నటనతో, కామెడీ పాత్రలతో అలరిస్తుంది. అయితే ఆమె నవ్వు వెనుక, అద్భుతమైన నటన వెనుక అంతులేని విషాదం ఉంది. ఆమె వ్యక్తిగత జీవితంలో సంతోషం లేకుండా అయ్యింది. ఒక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుంగిపోయింది. కొంత గ్యాప్‌తో కోలుకుని ఇప్పుడు మళ్లీ నటిగా ఆకట్టుకుంటుంది.
నటి అన్నపూర్ణ తాజాగా సుమ యాంకర్‌గా చేస్తున్న సుమ అడ్డా షోలో పాల్గొంది. విజయ, శ్రీలక్ష్మి, జయలక్ష్మిలతో కలిసి ఆమె ఈ షోలో సందడి చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లంతా షోలో రచ్చ రచ్చ చేశారు. కామెడీ చేస్తూ మెప్పించారు. పంచ్‌లతో నవ్వులు పూయించారు. యాంకర్ సుమకి కూడా ఝలక్ ఇస్తూ కామెడీని పంచారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ తన కూతురు విషయాన్ని వెల్లడించారు. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అసలు విషయం చెప్పింది. ఇందులో అన్నపూర్ణ చెబుతూ, తాను బజ్జీలు తెస్తే తిన్నదని, ఇక చాలు అంటూ తన అత్తగారింటికి వెళ్లిపోయిందని, అయితే ఇలా చేస్తుందని తాను అస్సలు ఊహించలేదని చెప్పింది. `నేను బజ్జీలు పట్టుకొచ్చి పిలిచాను. రెండు తిని ఇక చాలా మమ్మీ అన్నది. మా అత్తగారు ఊరెళ్తున్నారు అంటే ఇక్కడ పడుకో అమ్మా అన్నాను. లేదు లేదు మా ఆయన ఉంటాడు కదా నేను అక్కడే పడుకుంటాను అని చెప్పి వెళ్లిపోయింది. తాను హ్యాంగ్ చేసుకుంటుందని నాకు ఆలోచనే లేదు` అని చెప్పింది.
అయితే తాను తెల్లారిగంట్ల గుర్తొస్తుందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అందరి ముందు అన్నపూర్ణ కన్నీరుమున్నీరైంది. చలించిన యాంకర్ సుమ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. నటి అన్నపూర్ణకి పిల్లలు లేరు. దీంతో ఆమె చిన్నప్పుడే కీర్తిని దత్తత తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుని పెద్ద చేసింది. తెలిసిన వారికే ఇచ్చి పెళ్లి చేసింది. వారిది మంచి ఫ్యామిలీ అని, ఆ వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని, కీర్తి కూడా హ్యాపీగానే ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అన్నపూర్ణ.
అయితే తనకు ఆ మధ్య పాప పుట్టిందని, పాపకి ఐదేళ్లయినా మాటలు సరిగా రాకపోవడంతో థెరపీ చేయిస్తున్నారని, కానీ ఆ కారణంగానే తాను మానసికంగా కుంగిపోయిందని, దీంతో ఆత్మహత్య చేసుకుందా అనేది అనుమానంగా ఉందని తెలిపింది. అయితే కూతురు మరణానికి అసలు కారణం ఏంటనేది తెలియదని, తన చెప్పకుండానే వెళ్లిపోయిందని, దీంతో నిజం ఆమెతోనే వెళ్ళిపోయిందని తెలిపింది. అన్నపూర్ణ కూతురు ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని కన్నుమూసింది.