'47 డేస్' రివ్యూ
పస లేని థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి ఓటీటిలు. ఇవన్నీ చూస్తూంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే బెస్ట్ అనిపిస్తున్నాయి. డైరక్ట్ రిలీజ్ కోసం తీసామని చెప్పి, ఓటీటిలో రిలీజ్ చేస్తున్నా... వాటిలో పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేసే అంశాలేమీ కనపడటం లేదు. ట్రైలర్ లో చూపెట్టే సస్పెన్స్ సైతం సినిమాలో కనపడటం లేదు. థిన్ లైన్ ని తీసుకుని దానిపై సర్కస్ ఫీట్ చేస్తున్నట్లుగా కథనాన్ని నడుపుతున్నారు. తాజాగా రిలీజైన '47 డేస్' దీ అదే తంతా.. లేక ఏమన్నా కొత్తదనం ఉందా...అసలు 47 రోజుల వ్యవహారం ఏమిటి...ఓటీటిలో వర్కవుట్ అయ్యే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి;
తన భార్య పద్దు (రోషిని ప్రకాష్)ఆత్మహత్యతో, వైజాగ్ సిటీ ఏసీపి సత్య(సత్యదేవ్) డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. తను చేస్తున్న జాబ్ పై కూడా ఫోకస్ పోగొట్టుకుంటాడు.తాగుబోతు అవుతాడు. ఈ క్రమంలో తన తోటి ఆఫీసర్ విషయంలో చేసిన పొరపాటుతో డిపార్టమెంట్ అతన్ని ఆర్నెళ్ల పాటు సస్పెండ్ చేస్తుంది. ఈ క్రమంలో మరింతగా భార్య జ్ఞాపకాలు వెంబడిస్తుంటాయి. భార్య చనిపోయిన బాధకు తోడు ఆమె ఆత్మహత్యకు కారణమేంటో తెలియక సతమతమవుతుంటాడు సత్య. ఈ క్రమంలో ఓ రోజు అతని కోలీగ్ రవి (రవి వర్మ) ఓ కేసు విషయంమై అతనితో డిస్కస్ చేస్తాడు. అది ఓ సూసేడ్ కేసు.
అయితే భార్య చనిపోయిన రోజే ఫార్మా ఇండస్ట్రలియిస్ట్ శ్రీనివాస్ సూసైడ్ చేసుకుంటాడు. ఆ కేసు అనుమానాస్పదంగా కనిపిస్తుంది సత్యకు. శ్రీనివాస్ ఆత్మహత్యకి పద్దూ ఆత్మహత్యకి సంబంధం ఉందేమోనని ఆ యాంగిల్ లో కేసుని సొంతంగా ఇన్విస్టిగేషన్ చేయటం మొదలెడతాడు. ఈ క్రమంలో అనేక నిజాలు బయిటకు వచ్చి సత్యకు షాక్ ఇస్తాయి. ఆ విషయాలు ఏమిటి... అసలు బయిటపడ్డ ఆ నిజాలేంటి, పద్దు ఆత్మహత్య వెనక ఉన్న మిస్టరీ ఏమిటి, మిస్టీరియస్ గర్ల్ జూలియట్ (పూజ జవేరీ) ఎవరు... 47 రోజుల సంకేతం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ఎలా ఉంది;
స్టోరీ లైన్ గా వింటానికి ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఈ కథ స్క్రిప్టు గా మారే ట్రీట్మెంట్ దశలో దిస కోల్పోయింది. ఈ సినిమాని ఒకే థ్రెడ్ మీద నడిపితే బాగుండేది. థ్రెడ్స్ ఎక్కువై అసలు చెప్దామనుకున్న కథ మరుగన పడింది. ఏదో థ్రిల్లర్ చూస్తున్నాం కదా అనుకుంటే ఎమోషనల్ లింకు లేకపోతే పండదు అనుకుని ఆ సీన్స్ పెట్టి, థ్రిల్ ని మిస్ చేశాడు. పద్దు ఆత్మహత్యతో మొదలైన ఈ కథ... కొంతదూరం వెళ్లేసరికి ఎటు నుంచి ఎటో వెళ్లిపోతుంది. సబ్ ప్లాట్స్ ఓపెన్ అవుతూ మెయిన్ కథపై ఫోకస్ తగ్గించేస్తుంది. ఆ విషయం దర్శకుడుకి క్లైమాక్స్ వచ్చే వరకూ గుర్తుకు రానట్లుంది. అప్పుడు ఏం చేసినా ఫలితం లేకుండా పోయింది.