Virataparvam: సాయి పల్లవి చేసిన పాత్ర ఇదే, సరళ హత్య వెనక భయానక సత్యం
విరాటపర్వంలో సాయిపల్లవి పోషిస్తున్న సరళ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఆమె హత్యకు కారణాలు ఏంటి? అసలు ఆ టైమ్‌లో ఏం జరిగిందనే రహస్యాలు బయటకొచ్చాయి. సంచలన నిజాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ చర్చగా మారిన సినిమా `విరాటపర్వం`. రాజకీయ నేపథ్యంతో కూడిన కథ కావడంతో ఇది హాట్ టాపిక్‌గా మారుతుంది. 1992లో జరిగిన ఘటన. ముఖ్యంగా అప్పటి నక్సల్స్ ఉద్యమం, రాజకీయంగా జరిగిన సంఘర్షణ, రాజకీయ సంక్షోభం వంటి అంశాలను చర్చించే చిత్రం కావడంతో ఇది చర్చనీయాంశమవుతుంది. ఎవరూ బయటకు తీయని నిజాలను దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రం ద్వారా చెప్పబోతుండటంతో వార్తల్లో నిలుస్తుంది. సినిమాకి అతీతంగా ఇది క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
ఇందులో రవన్న, సరళ పాత్రల ఆధారంగా అప్పటి సంఘటనలు, వారి మధ్య ఉన్న ప్రేమ కథని అద్భుతంగా `విరాటపర్వం`లో ఆవిష్కరించబోతున్నట్టు దర్శకుడు వేణు ఉడుగుల తెలిపారు. రవన్నగా రానా, సరళగా సాయి పల్లవి నటిస్తుండటంతో సినిమాకి మరింత హైప్ వచ్చింది. పైగా మంచి ప్రమోషన్ చేస్తుండటం ఈ సినిమా హైప్‌ని పెంచింది. అదే సమయంలో సరళ ఎవరు? సరళ ఎలా ఉద్యమంలోకి వెళ్లింది, ఆమె ఎలా చంపబడిందనేది మిస్టరీగా మారిన నేపథ్యంలో తాజాగా ఆ విషయాలు బయటకు వచ్చాయి. పలువురు మాజీ నక్సల్స్, సరళ కుటుంబ సభ్యులు లేటెస్ట్ సరళకి సంబంధించిన అసలు విషయాలను వెల్లడించారు.
`విరాటపర్వం`లో సాయిపల్లవి పోషించిన వెన్నెలనే సరళ. సరళ జీవితం ఆధారంగానే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. ఆమె కథే ఈ సినిమా అని తెలిపారు. పోలీసుల కోవర్ట్ గా అనుమానించబడి నకల్స్ చేతిలో హత్యగావించబడిన ఉద్యమ నాయకురాలే సరళ. 1992లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో సుప్రభాతం అనే వార పత్రిక ఈ ఘటనపై ఓ లోతైన కథనాన్ని ప్రచురించింది. అందులో పేర్కొన్నట్టు.. సరళ పదిహేడేళ్ళ ఇంటర్ బైపిసి విద్యార్థిని. తను పుస్తకాల పురుగు. సామాజిక చైతన్యం గల యువతి. ఉద్యమానికి ఆకర్షితురాలై ఒక పార్టీ ఆఫీసులో సైకిల్ వదిలేసి అడవిబాట పడుతుంది.
ఆ రోజుల్లోనే అప్పటి సిర్నాపల్లి దళ కమాండర్ జ్యోతి ఎన్ కౌంటర్ కావడంతో ఆ స్థానంలో తాను వెళ్లి సమాజ మార్పుకోసం ఉత్తేజంతో పనిచేయాలనుకుంటుంది. అనేక కష్టాలు పడి జిల్లా నాయకత్వాన్ని కలుస్తుంది. వారు తనను నమ్మకుండా అనుమానించి హత్య చేయడంపై అనేక వివరాలతో సుప్రభాతం కథనం రాసింది. ఒక్కమాటలో ఒక విద్యార్థిని అయిన సరళ ఉద్యమం టచ్ లోకి వెళ్ళే ముందు నెలరోజులు సిర్నాపల్లి ప్రాంత ప్రజలకు అత్మీయురాలే అవుతుంది. కొండలు గుట్టలు ఎక్కుతుంది. రాత్రి పగలూ పార్టీ కాంటాక్ట్ కోసం తపిస్తుంది. సాయుధ పోరాటంలో భాగం కావాలనే వచ్చాను రెండు ఉత్తరాలను తల్లిదండ్రులకు రాస్తుంది.
చివరకు మిలిటెంట్ల సాయంతో ఆ యువతి ఉద్యమకారుల వద్దకు చేరుతుంది. ఆమె ఎందుకు అగ్ర నాయకత్వం వద్దకు వచ్చిందీ అనడానికి అనేక కారణాలు చెబుతారు. అందులో ఒకరిని(రవన్న) ప్రేమించడం కూడా ఒకటి. ఏమైనా ఆమె హత్య వెనక చాలా మిస్టరీ ఉంది. సందేహాలు ఉన్నాయ్. కానీ ఆమెను నిజానికి ఇన్ ఫార్మర్ కాదు. ఉద్యమం పట్ల ఎంతో నిబద్దతతో ఆకర్శితురాలైన ప్రేమికురాలు అన్నది నిజం. ఆమెను అనుమానించి నిర్దారించుకోకుండా చంపడం పట్ల మావోయిస్టు పార్టీ ఆలస్యంగా క్షమాపణలు వేడుకోవడం నిజం.
1992, నవంబర్ 11న భారత కమ్యూనిస్టు పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్యాం పేరిట ఈ క్షమాపణల ప్రకటన విడుదలైంది. అప్పట్లో కాకతీయ ఎక్స్ ప్రెస్ బోగిని నక్సల్స్ కార్యకర్తలే దగ్ధం చేయడం వల్ల 37 మంది అమాయక ప్రజలు మరణించారు. ఆ సంచలన ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ప్రజలను క్షమాపణలు వేడుకుంటూ విడుదల చేసిన ఈ ఉత్తరంలో సరళ హత్య గురించి కూడా చింతిస్తూ ఆ తీవ్ర తప్పిదం గురించి ప్రస్తావిస్తూ శ్యాం ఆ ప్రకటన విడుదల చేశారు.
ఇందులో ఏం రాశారంటే.. `…1992 ఫిబ్రవరిలో సరళ అనే మహిళ విపవోద్యమంలో పని చేయడానికి ఖమ్మం నుంచి నిజామాబాద్ దళాల వద్దకు చేరింది. విప్లవోద్యమంలో పాల్గొనడానికి వచ్చిన సరళ పోలీస్ ఇన్ ఫార్మర్ గా అనుమానించబడి మా పార్టీ కార్యకర్తల చేతిలో మరణించింది. ఈ సంఘటన మా పార్టీని, యావత్ ప్రజల హృదయాలను కలచివేసిన సంఘటనగా తీవ్రమైన తప్పుగా భావిస్తున్నాం.”
“విప్లవోద్యమంపై మరో దాడిని ప్రారంభించిన ప్రభుత్వం ఇన్ ఫార్మర్లుగా మార్చుకుని పార్టీని దళాలను తుదముట్టించాలని పథకం సిద్దం చేసుకున్న నేపథ్యంలో మా కార్యకర్తలు సరళను ఇన్ ఫార్మర్ గా అనుమానించినప్పటికీ సరైన పరిశీలన లేకుండా తొందరపాటు చర్యవలన జరిగిన తప్పుగా సరళ సంఘటనను గుర్తించాలని ప్రజలకు, ప్రజస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇది పరిస్థితులను సాకుగా తెసుకుని మా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాదని అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాం. మా కార్యకర్తల తొందరపాటు వల్లనే జరిగిన తప్పుగా అంగీకరిస్తూ, సరళ కుటుంబ సభ్యులను, ప్రజలను మా వల్ల జరిగిన తప్పును క్షమించమని కోరుతున్నాం` అని పేర్కొన్నారు.
ఇదీ సరళ హత్యగావింప బడిన వైనంపై పీపుల్స్ వార్ ప్రకటన. ఈ సంఘటనని ఆధారంగా చేసుకుని, వీటివెనకాల జరిగిన అనేక సంఘటనలను బ్యాక్ డ్రాప్‌లో తీసుకుని దర్శకుడు వేణు ఉడుగుల వెన్నెల పాత్రను రూపొందించి సరళ ప్రేమకు, ఆమె పోరాట గాథకు గొప్పగా ఆవిష్కరించడం విశేషం. సరళ పాత్రధారి అయిన సాయి పల్లవిని సరళ తల్లి సరోజతో కలిపించడం అంటే చరిత్ర నిర్మాణంలో గాయపడ్డ హృదయాలకు ఒక ఆత్మీయ లేపనం అనే అనాలి. వేణు ఊడుగుల ‘అన్నల’ చేతిలో బలైన ఈ ‘సరళ’ను ఎట్లా చూపించారూ, ఏ పరిస్థితుల మధ్య నాటి పార్టీ ప్రజల్లో పనిచేసిందీ, ఈ ‘వెన్నెల’ను ఎలా ఆవిష్కరించారనేది మరో ఒక్క రోజులో తేలిపోనుంది. ఈ సినిమా రేపు(జూన్ 17న)న విడుదల కానున్న విషయం తెలిసిందే.