- Home
- Entertainment
- రోజా భర్త సెల్వమణికి బిగ్ షాక్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ.. తండ్రి మరణించినా వదలని కొడుకు
రోజా భర్త సెల్వమణికి బిగ్ షాక్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ.. తండ్రి మరణించినా వదలని కొడుకు
రోజా 2002లో తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. సెల్వమణి తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు.ప్రస్తుతం సెల్వమణి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సినీ నటి, ఏపీ మంత్రి రోజా గురించి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో ఆమె ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నారు. రోజా 2002లో తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. సెల్వమణి తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. రచయితగా, నిర్మాతగా సైతం సెల్వమణి సినిమాలు చేశారు.
ప్రస్తుతం సెల్వమణి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సెల్వమణి చాలా కాలంగా ఎదుర్కొంటున్న వివాదంలో తాజాగా ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. ఆయనపై ఏకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అంతలా ఏం తప్పు చేశారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
తమిళ సినిమాలకు ఫైనాన్స్ చేసే ప్రముఖ ఫైనాన్షియర్ ముకుంద్ చాంద్ బోత్రా ఓ కేసులో 2016లో అరెస్ట్ కావడం ఆ తర్వాత విడుదల కావడం జరిగింది. ఆ సమయంలో ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరుళ్ అంబరాసుతో కలసి ఓ టివి ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సెల్వమణి ముకుంద్ పై పలు ఆరోపణలు చేశారు. ముకుంద్ తనని కూడా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడని సెల్వమణి ఆరోపించారు.
దీనితో సెల్వమణి తన పరువుకు భంగం కలిగించే విధంగా తనపై ఆరోపణలు చేసారు అంటూ ముకుంద్ పరువునష్టం కేసు ఫైల్ చేసారు. సెల్వమణికి తనకి ఎలాంటి సంబంధం లేనప్పటికీ లేనిపోని ఆరోపణలు చేశారని ముకుంద్ మండిపడ్డారు. ఆ సమయంలో ముకుంద్ జార్జ్ టౌన్ లోని ఎక్స్వి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెల్వమణిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం మొదలైంది.
కొంత కాలానికి ముకుంద్ చాంద్ మరణించారు. తండ్రి మరణించినప్పటికీ ఈ కేసుని ముకుంద్ తనయుడు వదిలిపెట్టడం లేదు. సెల్వమణికి వ్యతిరేకంగా కేసు కొనసాగిస్తున్నారు. అయితే పలు సందర్భాల్లో సెల్వమణి కేసు విచారణకి హాజరుకాలేదు. సోమవారం రోజు మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణకి సెల్వమణి కానీ, ఆయన లాయర్ కానీ హాజరు కాలేదట. దీనితో కోర్టు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
ఇది సెల్వమణికి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 22న జరగనున్నట్లు తెలుస్తోంది. మరి నాన్ బెయిలబుల్ వారెంట్ ని సెల్వమణి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. పూలన్ వైశారని, కన్మణి, తెలుగులో దుర్గ లాంటి చిత్రాలని సెల్వమణి తెరకెక్కించారు.