RRR, పుష్ప ఎంత గొప్ప చిత్రాల్లో చెప్పిన రణ్వీర్ సింగ్.. మతి పోయిందట
బాలీవుడ్ విలక్షణ నటులలో రణ్వీర్ సింగ్ ఒకరు. పాజిటివ్, నెగిటివ్ ఎలాంటి పాత్రలో అయినా రణ్వీర్ సింగ్ తన విశ్వరూపం ప్రదర్శిస్తుంటారు.

బాలీవుడ్ విలక్షణ నటులలో రణ్వీర్ సింగ్ ఒకరు. పాజిటివ్, నెగిటివ్ ఎలాంటి పాత్రలో అయినా రణ్వీర్ సింగ్ తన విశ్వరూపం ప్రదర్శిస్తుంటారు. ఇక పాన్ ఇండియా చిత్రాల తాకిడి పెరిగినప్పటి నుంచి సౌత్ సినిమాల గురించి బాలీవుడ్ లో చర్చ జరుగుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్ 2 చిత్రాల ప్రభంజనం ముందు బాలీవుడ్ మూవీస్ తేలిపోతున్నాయి.
దీనితో హిందీ భాష ఆధిపత్యంపై కూడా వివాదం చెలరేగింది. కిచ్చా సుదీప్, అజయ్ దేవ్ గన్ ఇద్దరూ ట్విటర్ లో హిందీ భాష గురించి చర్చించుకున్న విధానం వివాదంగా మారింది. సౌత్ సినిమాల ప్రభంజనం, హిందీ వివాదం గురించి రణ్వీర్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
రణ్వీర్ సింగ్ స్పందిస్తూ.. నేను నటుడ్ని మాత్రమే. ఈ వివాదాలు, బాక్సాఫీస్ లెక్కల గురించి నాకు తెలియదు. నా ప్రతిభ మొత్తం కెమెరా ముందు మాత్రమే ప్రదరిస్తాను. అంతవరకే. నేను బిజినెస్ మ్యాన్ ని కాదు కాబట్టి ఈ డబ్బు లెక్కల గురించి నాకు తెలియదు.
కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఇటీవల హిందీలో డబ్ అయిన సౌత్ సినిమాలు చాలా గొప్పవి. నేను ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలని చూశాను. ఆ చిత్రాలని చూస్తున్నప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోయా. అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న చిత్రాలు అవి. నాకు తెలుగు రాదు. కానీ ఆ సినిమాలు చూసి ఎంతో ఎంజాయ్ చేశా.
ఈ అద్భుతమైన కాన్సెప్ట్ తో హిందీ ప్రేక్షకులని వారు మెప్పించిన విధానం నాకు ఇప్పటికి ఆశ్చర్యంగానే ఉంది. వ్యక్తిగతంగా సినిమాలు మనవి.. ఇండియన్ సినిమాలు అని ఫీల్ అవుతానని.. భాషా బేధం తనకు లేదని రణ్వీర్ అన్నారు.
ఇదిలా ఉండగా రణ్వీర్ సింగ్ ప్రస్తుతం 'జోయేశ్ భాయ్ జోర్దార్' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సరసన షాలిని పాండే నటిస్తోంది.