The Warriorr: రామ్ ' ది వారియర్ ' మూవీ రివ్యూ
రామ్ తన కెరీర్ లో తొలిసారి పోలీస్ కథని ఎంచుకుని ‘ది వారియర్’ (The Warrior) చేశారు. ఇదే చిత్రంతో తమిళంలోకీ ఎంట్రీ ఇచ్చారు. రెండు భాషలపైనా మాస్ దర్శకుడిగా పరిచయం ఉన్న లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. (The Warrior Review) మరి ఆ అంచనాలకి తగ్గట్టుగా సినిమా ఉందో లేదో చూద్దాం

రామ్ సినిమా అంటే ఒక టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఖచ్చితంగా వెళ్లాల్సిన సినిమాగా ఎంచుకునేవారు. అందుకు తగ్గట్లే ఫన్, లవ్ కలగలిపిన సినిమాలు చేసేవాడు. అయితే ఇంకా తన కథలు కేవలం ప్రేమలు, ప్రేమలు చుట్టూ తిరగటం ఇష్టం లేనట్లుంది. అందుకే మాస్ సినిమాల వైపు మ్రొగ్గుచూపెడుతున్నాడు. అలా తన లవర్ బోయ్ ఇమేజ్ ని వదిల్చుకునే ప్రాసెస్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్ అతన్ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అందుకే ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేయటం కోసం రామ్ ఇప్పుడు మరోసారి ది వారియర్ గా భాక్సాఫీస్ పై యుద్దం ప్రకటించారు. ప్రమోషన్స్ తో మంచి ఎక్సపెక్టేషన్స్ రైజ్ చేసాడు. మరి అందిన మేరకు కలెక్షన్స్ కొట్టుకుపోతాడా ఈ వారియర్? ఈ చిత్రం కథేంటి...మాస్ కు పట్టే మ్యాజిక్ ఈ సినిమాలో ఉందా, తమిళ దర్శకుడు లింగుస్వామిని ఎంచుకోవటం వెనక రామ్ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
డాక్టర్ సత్య (రామ్ పోతినేని) హౌస్ సర్జన్ చేయడం కోసం కర్నూల్ వస్తాడు. అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ప్రాణాపాయ స్థితిలో ఉంటే...కాపాడతాడు. ఈ విషయం తెలిసుకున్న అక్కడ లోకల్ డాన్ గురు (ఆది పినిశెట్టి) మనుషులు హాస్పటిల్ కు వచ్చి మరీ ఆ వ్యక్తిని చంపేస్తారు. సత్య పోలీస్ లను ఆశ్రయిస్తాడు. దాంతో కర్నూల్ అంతటా సత్యా పేరు మారు మ్రోగుతుంది. అయితే ఆ ముచ్చట ఎంతో సేపు ఉండదు. తనని ఎదిరిచిన వాడిని గురు ఎందుకు వదిలెడతాడు. తన మనుష్యులను వేసుకొచ్చి కొండారెడ్డి బురుజు దగ్గర సత్యను గురు చావ కొడతాడు. సత్య ఎదురుతిరగడు. దాంతో తన రివేంజ్ ని ఓ రేంజిలో తీర్చుకోవాలనుకుంటాడు. డాక్టర్ గా తను చేయలేనిది ఓ పోలీస్ గా చేయాలనుకుని.. రెండేళ్ల అదే కర్నూల్‌కు డీసీపీగా వస్తాడు. అప్పుడు సత్య ఏం చేసాడు... గురు ఊరుకున్నాడా... ? సత్య జీవితంలో ఆర్జే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
డాక్టర్ గా తను ఏమి చేయలేక పోలీస్ గా వచ్చి తన పవర్ చూపెట్టిన కుర్రాడి కథ ఇది. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం అయితే ఏమీ లేదు. నిజ జీవితంలో డాక్టర్ లేదా మరొకరు..వెళ్లి రౌడీలతో తలపడలేడు. గెలవలేడు. అదే తెరపై జరిగాలని కోరుకుంటాము. అదే హీరోయిజం గా మనం గుర్తిస్తాం. అంతే కానీ అదే డాక్టర్ ..నేను పోలీస్ అయ్యి నీ పని పడతా...రౌడీ అయ్యి వచ్చి నీ తాట తీస్తా అంటే చేసేదేముంది. అంటే పోలీస్ గా కూడా ఏమీ చేయలేక ఏ పొలిటీషన్ అడ్డుపడితే రాజకీయనాయకుడు అవుతాడన్నమాట. అప్పుడూ కాకపోతే ...విలన్ లాగే రౌడీ అవుతాడన్నమాట. ఇదేదో చిన్నప్పుడు చెప్పే కథను గుర్తు తెస్తోంది.
హీరో ఎందుకు ఈ కథను ఓకే చేసాడా అని ఆలోచిస్తే...అతని సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని రౌడీ శంకర్...మెమెరీస్ మార్పడితో పోలీస్ గా ట్రాన్సఫర్మేషన్ గుర్తు వస్తుంది... ఈ సినిమాలో డాక్టర్ తనంతట తానుగా పోలీస్ గా మారి విలన్ పని పడతాడు. అలాంటి కథే ఇది కూడా అని ఒప్పుకున్నాడేమో రామ్. అయితే ఇక్కడ ఇస్మార్ట్ మ్యాజిక్ జరగలేదు. దాంతో రొటీన్ గా, ప్రెడిక్టబుల్ గా కథ,కథనం సాగిపోయాయి. విలన్, హీరో ఫైట్స్ కోసమే జనం వచ్చినా, హీరోనే గెలుస్తాడు అని తెలిసినా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటేనే జనం భుజాన మోస్తారు.
తెలుగు తెరపైమాస్ హీరోయిజం అనే దానికి గత కొంతకాలంగా అర్దం మారిపోయింది. ఆర్. ఆర్. ఆర్, కేజీఎఫ్, విక్రమ్ వంటి మాస్ కు కేరాఫ్ ఎడ్రస్ వంటి సినిమాలు వచ్చి విజయం సాధించాక హీరోలు ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్దితి ఏర్పడింది. మరీ మూసకొట్టుడు ఫైట్స్, లవ్ ట్రాక్, కామెడీ చూపించి మాస్ సినిమా అనుకోమంటే జనం ఒప్పుకోవటం లేదు. ఇప్పటి ప్రేక్షకాభిరుచికి తగినట్లు మాస్ ఎలిమెంట్స్ ని మస్తుగా అందిస్తేనే జనం జైజైలు పలుకుతున్నారు. ఈ క్రమంలో వచ్చిందే వారియర్. అయితే లింగుస్వామివాటిని గమనించుకుంటూ కొత్తగా ఏమన్నా చూపించాడా అంటే లేదనే చెప్పాలి. రొటీన్ స్టోరీ లైన్ కు స్పీడుగా నడిచే సీన్స్ ని అద్దాడు. తన రన్ (మీరా జాస్మిన్, మాధవన్)సినిమా నాటి నుంచి అనుసరిస్తున్న ఫార్ములానే కంటిన్యూ చేసాడు. అయితే ఫస్టాఫ్ పరుగెట్టినట్లుగా సెకండాఫ్ లో జరగలేదు. ఇంతకు మించి ఈ సినిమాకు విశ్లేషణ కూడా అనవసరం.
నటీనటుల్లో ...
కొంత కాలం క్రితం వరకూ సరదా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తున్న రామ్ కు ఇస్మార్ట్ శంకర్ నుంచి తనను తాను మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ సినిమా కథలో లోపముందేమో కానీ ...అతని నటనలో వంకపెట్టలేము. అయితే ఎగ్జైట్ చేయలేకపోయాడు తన పాత్రతో . సాధారణంగా రామ్ ఎనర్జీ లెవల్స్ మాములుగా ఉండవు. అవీ ఇక్కడ కంట్రోలు చేసినట్లున్నారు. సినిమా మొత్తం రామ్ మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు, అరుస్తాడు. టైటిల్ సాంగ్ లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ.. యాక్షన్ సీన్స్ లో మ్యానరిజమ్స్ కానీ మాస్ ఆడియన్స్ కు విందు భోజనంలా ఉండేలా ప్రయత్నం చేసారు. అయితే అన్ని ఉన్నా ఏదో తగ్గినట్లు కథ,కథనం రామ్ కు ప్లస్ కాలేకపోయాయి. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరవదమే రామ్ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఇక ఆది పినిశెట్టి చేసిన గురు పాత్ర సినిమాకి మెయిన్ ఎస్సెట్. రాయలసీమ యాస మాట్లాడుతూ అందులో ఒదిగిపోయారని చెప్పాలి. విజిల్ మహాలక్ష్మిగా కృతి బాగుంది.
టెక్నికల్ గా ...
ఈ సినిమాకు దేవిశ్రేప్రసాద్ తన టిపికల్ కమర్షియల్ మాస్ సాంగ్స్ ఇచ్చే ప్రయత్నం చేసారు. అవి బాగానే పేలాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. చాలా లౌడ్ గా ఉంది. ఇక సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కు వస్తే ఫస్టాఫ్ ని ఇంకాస్త ట్రిమ్ చేయచ్చు అనిపించింది. పాటల కొరియోగ్రఫీ బాగుంది. డైలాగులు సోసో గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
బాగున్నవి:
రామ్, ఆది పోటా పోటీ నటన
మాస్ సాంగ్స్
యాక్షన్ బ్లాక్స్
బాగోలేనివి:
Predictable మారిన కథ,కథనం
విలన్ Vs హీరో సీన్స్ రొటీన్ గా అనిపించటం
ఎక్కడా హై ఇచ్చే ఎలిమెంట్స్ లేకపోవటం
ఫైనల్ థాట్
ఫైట్స్, పాటలు చూడటానికి జనం థియేటర్స్ దాకా రావటం లేదు...జీవితంలో దొరికని మ్యాజిక్, షో కనపడాలి
Rating:2
----సూర్య ప్రకాష్ జోశ్యుల
నటీనటులు: రామ్ పోతినేని, కృతిశెట్టి, ఆది పినిశెట్టి, నదియా, అక్షర గౌడ, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి తదితరులు;
కూర్పు: నవీన్ నూలి;
కళ: డి.వై.సత్యనారాయణ;
పోరాటాలు: విజయ్ మాస్టర్, అన్బు-అరివు;
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్;
మాటలు: సాయిమాధవ్ బుర్రా, లింగుస్వామి;
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్;
సమర్పణ: పవన్ కుమార్;
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి;
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్;
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి;
విడుదల తేదీ: 14 జులై 2022