- Home
- Entertainment
- Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
'పెద్ది' సినిమాలో క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా కనిపించేందుకు రామ్ చరణ్ చాలా కష్టపడి తనను తాను మార్చుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు తెలిపాడో తెలుసా?

క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా రామ్ చరణ్..
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కు పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం చరణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ సినిమాలో చరణ్ 'పెద్ది' అనే క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా నటిస్తున్నారు. అంటే, ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు వేర్వేరు క్రీడల్లో పోటీపడే పాత్ర అన్నమాట. పాత్ర సహజంగా కనిపించాలని, ప్రతి ఆటకు తగ్గట్టు తన శరీరాకృతి, లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై చాలా కష్టపడాల్సి వచ్చింది.

సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లకు క్రెడిట్ ఎందుకు?
ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో, చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి అడిగినప్పుడు, ఆయన ముందుగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లకు థ్యాంక్స్ చెప్పారు. “అన్నిటికంటే ముందు సల్మాన్ సర్, అమీర్ సర్‌లకు థ్యాంక్స్. ఎందుకంటే, 'సుల్తాన్', 'దంగల్' లాంటి సినిమాలతో వాళ్లు మాకు ఇలాంటి చిత్రాలకు దారి చూపించారు. ఇది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది” అని రామ్ చరణ్ అన్నారు. ఆ సినిమాల విజయమే, స్పోర్ట్స్ డ్రామా కథలను ప్రేక్షకులు ఇష్టపడతారనే నమ్మకాన్ని ఇచ్చిందని కూడా ఆయన చెప్పారు.
చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది
'పెద్ది' షూటింగ్ శారీరకంగానే కాదు, మానసికంగా, ఎమోషనల్‌గా కూడా చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని చరణ్ అన్నారు. కథ విన్నప్పుడే ఈ పాత్ర చేయడం అంత ఈజీ కాదని అర్థమైంది. “లుక్ మార్చడం కథలో చాలా ముఖ్యం. బుచ్చిబాబు మా ఇంటికి వచ్చి మొత్తం స్క్రిప్ట్ చెప్పిన రోజు నాకు గుర్తుంది. దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు నేను మౌనంగా కథ విన్నాను. అప్పుడే నాకు తెలిసింది, ఈ సినిమా శారీరకంగా చాలా అలసట పెడుతుందని. కానీ ఈ కథకు, పాత్రకు అది చాలా అవసరం” అని చరణ్ గుర్తుచేసుకున్నారు.
గుర్తింపు కోసం 'పెద్ది' చేసే పోరాటం
ఈ సినిమా కేవలం క్రీడల గురించే కాదని, తన గుర్తింపును వెతుక్కునే ఒక వ్యక్తి కథ అని చరణ్ చెప్పారు. “ఇది తన సొంత గుర్తింపు కోసం వెతుకుతున్న వ్యక్తి కథ. మనమందరం జీవితంలో ముందుకు సాగడానికి, బతకడానికి ఏదో ఒక గుర్తింపు కావాలి. పెద్ది కూడా తన గుర్తింపును వెతుక్కుంటున్నాడు” అని వివరించారు. సినిమాలో తన పాత్ర మొదట స్ట్రగుల్ అవుతుంది... ఆ తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. “చివరికి, క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా మారడానికి అతనికి ఏది ప్రేరణ ఇచ్చిందనేదే ఈ కథ మొత్తం. ఈ కథ చాలా సహజంగా ఉంటుంది, కానీ అదే సమయంలో పక్కా కమర్షియల్‌గా కూడా ఉంటుంది” అని చరణ్ అన్నారు.
క్రికెట్, కుస్తీ, పరుగు పందెంలో రామ్ చరణ్
ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెట్, కుస్తీ, పరుగు పందెంలో పాల్గొనడం చూడొచ్చు. దీనికోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. 'పెద్ది' చిత్రానికి బుచ్చిబాబు సానానే కథ రాసి దర్శకత్వం వహించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. ఇషాన్ సక్సేనా సహ నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.
సినిమాలో స్టార్ నటీనటులు..
'పెద్ది'లో రామ్ చరణ్ జంటగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు బాలీవుడ్ యంగ్ స్టార్ దివ్యేందు శర్మ, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది.

