లోకేష్, నెల్సన్‌లా చేయలేను అన్నాడు, నేనే తగ్గాను, `వేట్టైయాన్` దర్శకుడిపై రజనీ కీలక వ్యాఖ్యలు
రజనీకాంత్, వేట్టైయాన్ దర్శకుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన స్టయిల్‌లో సినిమా చేయలేదని, ఆయన స్టయిల్‌లోకి తాను వెళ్లినట్టు తెలిపారు. ఈ వెనుక జరిగిన స్టోరీ రివీల్ చేశాడు రజనీ.
`జైలర్` సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ మూవీ ఆరు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఇప్పుడు మరో భారీ సినిమాతో వస్తున్నారు రజనీ. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్,అభిరామి, రితికా సింగ్‌లతో కలిసి `వేట్టైయాన్` అనే మూవీలో నటిస్తున్నారు. `జైభీమ్` ఫేమ్ టి జే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో శుక్రవారం భారీ స్థాయిలో ఆడియో ఈవెంట్ జరిగింది. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
ఇందులో రజనీకాంత్ మాట్లాడుతూ, చిత్ర దర్శకుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `జైలర్ తర్వాత తాను చాలా కథలు విన్నట్టు, కానీ ఏది నచ్చడం లేదని, దీంతో కథలు వినడం ఆపేసినట్టు తెలిపారు. ఈ సమయంలోనే సౌందర్య ఫోన్ చేసిన జ్ఞానవేల్ వద్ద మంచి లైన్ ఉందని, వినమని చెప్పిందట. `అప్పటికే `జై భీమ్` సినిమా చూశాను. నచ్చింది.
సౌందర్య చెప్పాక మరోసారి చూశాను, ఏ డైరెక్టర్ వద్ద పని చేయకుండా ఇలాంటి సినిమాని ఎలా తీసి ఉంటాడని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఫోన్‌లో మీరు సందేశాత్మక సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. తర్వాత తను చెప్పిన కథ విన్న తర్వాత నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చేయమని చెప్పాను.
పది రోజుల సమయం అడిగిన డైరెక్టర్.. రెండు రోజుల్లో మళ్లీ ఫోన్ చేసి నేను లోకేష్, నెల్సన్ స్టైల్లో కమర్షియల్ సినిమా చేయలేను.. నా స్టైల్లో నేను చేస్తానని అన్నారు. నాకు కూడా అదే కావాలని నేను అనటంతో ఆయన కథను తయారు చేశారు. కథ నిర్మాత సుభాస్కరన్, అమితాబ్, రానా, ఫహద్‌లను కలిపింది.
ఎప్పుడైతో అమితాబ్‌గారు ఇందులో నటింటానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, పర్సనల్‌గానూ అమితాబ్ నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి. ఇప్పటి జనరేషన్ పిల్లలకు అమితాబ్ ఎంత పెద్ద నటుడో తెలియదు. నేను ఆయన్ని దగ్గర నుంచి చూశాను.
ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రను తనెలా చేస్తాడోనని అనుకున్నాను. తను చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈతరంలో తనలాంటి నటుడ్ని నేను చూడలేదు. రామానాయుడుగారి మనవడిగా రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బయటకు నార్మల్‌గా మాట్లాడుతూ కనిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్టర్‌గా ఆయన మారిపోతారు.
తను చాలా మంచి యాక్టర్. బాహుబలి సహా ఎన్నో సినిమాల్లో మెప్పించిన నటుడు. అనిరుద్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నా బిడ్డలాంటోడు. జ్ఞానవేల్ చాలా మంచి వ్యక్తి. తన కోసం ఈ సినిమా హిట్ కావాలని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, జ్ఞానవేల్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను` అన్నారు.
ఇందులో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ , `రజినీకాంత్‌తో చాలా సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. వృత్తి పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ తను నాకెంతో సన్నిహితంగా ఉంటారు. రజినీకాంత్ పాత్ర గురించి, నా పాత్ర గురించి తెలిసిన తర్వాత నేను జ్ఞానవేల్ నెరేషన్ నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను.
రజినీకాంత్‌తో యాక్ట్ చేయటానికి గొప్పగా, గర్వంగా భావిస్తున్నాను. తను మనందరికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యుమన్ బీయింగ్. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. వేట్టైయాన్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా` అని చెప్పారు బిగ్ బీ.
డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ మాట్లాడుతూ, `జై భీమ్` మూవీ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం వస్తుందని తెలుసు. కానీ ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందని అనుకోలేదు. సాధారణంగా `జై భీమ్` హిట్ అయిన తర్వాత మంచి సినిమాలను అప్రిషియేట్ చేసే రజినీకాంత్ దగ్గరి నుంచి నాకు ఫోన్ వస్తుందని అనుకున్నాను. కానీ వారం దాటినా కూడా కాల్ రాలేదు.
రెండో వారంలో సౌందర్య నాకు ఫోన్ చేసి అభినందించారు. అదే సమయంలో నాన్నగారికి మీ దగ్గర మంచి లైన్ ఉంటే చెప్పమని అన్నారు. నేను ముందు నమ్మలేదు. తర్వాత నా దగ్గర రెండు లైన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇన్‌టెన్స్ ఉన్న లైన్ అయితే, మరోటి కామెడీ టచ్‌తో సాగే కాన్సెప్ట్. ముందుగా సౌందర్యకి ఇన్‌టెన్స్ లైన్ తో ఉన్న `వేట్టైయాన్` కథ వినిపించాను. ఆమెకు ఈ లైనే నచ్చింది.
తర్వాత రజినీకాంత్‌గారితో మాట్లాడాను. ఆయనకు సన్నివేశాలు రాసే సమయంలో ఆయన మాత్రమే చేయగలడు అనేలా మాస్ సన్నివేశాలు కుదిరాయి. కథ రాసుకునే సమయంలోనే అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా.. ఇలా అందరినీ ఉహించుకునే రాసుకున్నాను. రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఉండటం వల్లనే వారందరినీ ఈ సినిమాలో యాక్ట్ చేసేలా ఒప్పించగలిగాను.
సుభాస్కరన్‌గారు కథ వినగానే మీకెలా కావాలో సినిమాను అలా చేయండి అన్నారు. రజినీకాంత్, అమితాబ్ నుంచి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. అభిమానులు సినిమాను ఊహించుకున్న దాని కంటే ఎక్కువగానే వేట్టైయాన్ సినిమా ఉంటుంద`న్నారు.