ఆర్ ఆర్ ఆర్ 2 డైరెక్టర్ రాజమౌళి కాదు... ఫ్యాన్స్ కి విజయేంద్రప్రసాద్ షాక్!
ఆర్ ఆర్ ఆర్ చిత్ర సీక్వెల్ పై రచయిత విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే రాజమౌళి డైరెక్ట్ చేస్తాడనే నమ్మకం లేదన్నారు.

RRR 2
ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ వైడ్ రూ . 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ జపాన్ లో వంద రోజులకు పైగా ఆడింది. అక్కడ రూ. 140 కోట్లు కొల్లగొట్టి అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది.
కలెక్షన్స్ కి మించి అంతర్జాతీయ గౌరవాలు అందుకుంది. తెలుగు సినిమా ఊహల్లో కూడా లేని ఆస్కార్ గెలిచి దేశం గర్వించేలా చేసింది. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఫేమ్ పొందారు.
రామ్, భీమ్ అనే రెండు ఫిక్షనల్ పాత్రలతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ రూపొందింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో తెలియజేశారు. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. భవిష్యత్ లో ఆర్ ఆర్ ఆర్ 2 పట్టాలెక్కుతుందని స్పష్టత ఇచ్చారు. దీంతో మరోసారి మెగా నందమూరి హీరోలు సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫ్యాన్స్ ఆశపడ్డారు.
తాజాగా ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈసారి ఆయన ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేశారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. అనంతరం ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ చేసే అవకాశం కలదన్నారు. అయితే రాజమౌళి డైరెక్ట్ చేస్తారని చెప్పలేం. ఆయన పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ తెరకెక్కించవచ్చన్నారు.
మహేష్ మూవీ పూర్తయ్యాక రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు. అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సమయం దానికి కేటాయించాలనేది ఆయన కోరిక, అంటూ బాంబు పేల్చారు. అసలు ఆర్ ఆర్ ఆర్ 2 చిత్రానికి రాజమౌళి కాకుండా మరొక దర్శకుడిని ఊహించుకోగలమా? అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే వంద శాతం రాజమౌళి చేయరు అని చెప్పలేదు. చేయకపోవచ్చు అన్నారు. కాబట్టి ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ కి రాజమౌళి దర్శకుడు కాకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ చేయకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.