Brahmamudi: కంగారులో తప్పుచేసి దొరికిపోయిన రాహుల్.. చిక్కుల్లో పడ్డ రాజ్!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భార్య తప్పు చేసిందనుకొని ఆమె మీద కక్ష సాధించాలనుకుంటున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో గదిలోకి వచ్చిన స్వప్న నేను మంచం మీద పడుకుంటే నువ్వు ఎక్కడ పడుకుంటావు అని అప్పుని అడుగుతుంది. నా గదికి వచ్చి నువ్వేదో త్యాగం చేస్తున్నట్టు ఫీల్ అవ్వకు మూసుకొని కిందన పడుకో అని చాప ఇస్తుంది అప్పు. నన్ను ఇంత అవమానిస్తావా అంటుంది స్వప్న. లేచిపోయిన దాన్ని ఇంటికి రానివ్వడమే ఎక్కువ అంటూ చులకనగా మాట్లాడుతుంది అప్పు.
మరోవైపు రంగులు వేస్తూ కూర్చున్న కావ్యని చూసి రాత్రంతా పడుకోలేదా అని అడుగుతాడు కృష్ణమూర్తి. ఈ రాత్రి నేను పడుకుంటే మరో పది రాత్రులు మీరు నిద్ర లేకుండా గడిపేవారు. ఇప్పుడు హాయిగా నేను అత్తగారింటికి వెళ్లొచ్చు అంటుంది కావ్య. రాత్రి జరిగిన గొడవకి మీ ఆయన నిన్ను తప్పు పట్టలేదు కదా అంటాడు కృష్ణమూర్తి. తప్పు పట్టినా నేను ఒప్పుకోను తప్పులేదని నిరూపించుకుంటాను అంటుంది కావ్య. నేను ఆ నమ్మకంతోనే ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను అంటాడు కృష్ణమూర్తి
మరోవైపు స్వప్న తిరిగి వచ్చింది అన్న విషయాన్ని రాహుల్ కి చెప్తాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్. ఈలోపు స్వప్న రాజ్ తో మాట్లాడటం కోసం అతని గదికి వస్తుంది. కోపంతో ఫోన్ మాట్లాడటం మానేసి ఆమెని గది బయటికి వెళ్లి మాట్లాడమంటాడు రాజ్. ఈ తింగరిది ఏం చెప్తుందో ఏంటో అంటూ కంగారు పడిపోతాడు రాహుల్. మరోవైపు గుమ్మం బయట ఉన్న స్వప్న నీకు అన్యాయం జరిగిపోయింది.
నీ అందానికి ఏమాత్రం సరితూగని కావ్యతో నీకు పెళ్లి అవుతుందని ఊహించలేదు నాకు చాలా బాధగా ఉంది అంటుంది స్వప్న. నీ సానుభూతి ఎవరికి కావాలి తప్పు మీ చెల్లెలు చేస్తే ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం ఈ తప్పు ఎందుకు చేశానా అని జీవితాంతం బాధపడేలాగా చేస్తాను. అంతవరకు మీ చెల్లెలు గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదు అంటూ కోపంగా స్వప్నని అక్కడ నుంచి పొమ్మంటాడు రాజ్.
మరోవైపు చాలా రకాల టిఫిన్స్ రెడీ చేస్తుంది కనకం. అవన్నీ ఎందుకు ఇప్పుడు మేము బయలుదేరిపోతాము అంటుంది కావ్య. అలా ఎలా వెళ్తారు తినేసి వెళ్దురు గాని నేను అల్లుడుగారు మాట్లాడతాను అని రాజ్ దగ్గరికి వెళ్తుంది కనకం. ఈ లోపల స్వప్న ఫోన్ రింగ్ అవ్వటంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కావ్య. ఫోన్ లిఫ్ట్ చేసింది స్వప్న అనుకొని నిన్ను ఆ ఇంటికి ఎవడు వెళ్ళమన్నాడు, నాతో లేచిపోయానని మాత్రం ఎక్కడా చెప్పకు. ఇద్దరం రోడ్డుని పడాల్సి వస్తుంది అంటాడు రాహుల్.
ఇంతలో రాజ్ బయటకు రావడం గమనించి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. బయటికి వచ్చిన రాజ్ బయలుదేరుతావా అని కావ్యని అడుగుతాడు. మీకు కొత్త బట్టలు పెట్టాలి బాబు అని కనకం చెప్పినా వినిపించుకోకుండా బయటికి వెళ్లిపోతాడు రాజ్. కావ్య చేతిలో తను ఫోన్ చూసి షాక్ అవుతుంది స్వప్న. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావ్ అంటూ లాక్కుంటుంది. త్వరలోనే నీ వెనుక ఉన్న మనిషి ఎవరో రాజ్ ముందు నిలబెడతాను అంటూ వెళ్ళిపోతుంది కావ్య.
దీనికి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతుంది స్వప్న. మరోవైపు ఇంటికి వచ్చిన రాజ్ దంపతులని గుమ్మం బయటే నుంచోపెట్టి మన ఇద్దరి మధ్యన దూరానికి కారణమైన ఆ మనిషిని లోపలికి రానివ్వకూడదని నిర్ణయించుకున్నాను. కొంచెం డబ్బిచ్చి కళ్యాణి తోడిచి వాళ్ళింటికి పంపించేయి అంటుంది అపర్ణ. నా కొడుకు అలాంటి పని చేసి పాపం మూట కట్టుకోడు అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి మీద కోప్పడుతుంది అపర్ణ.
మన ఇంట్లో ఎప్పుడూ లేని గొడవలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఎందుకో అంటూ బాధపడతాడు సుభాష్. అప్పుడే వచ్చిన చిట్టి మీ అత్తగారింటికి వెళ్ళటం కోసం మేమందరం నీకు సపోర్ట్ చేశాము కానీ మీ అమ్మ కడుపు తీపి కోసం ఇష్టం లేకపోయినా నీ కోసం అక్కడికి వచ్చింది. తనతో పాటు ఎందుకు రాలేదు అంటూ నిలదీస్తుంది. కారణం చెప్పలేను కానీ ఖచ్చితంగా కారణం ఉంది అంటాడు రాజ్.
ఆయన నడుము నొప్పితో నడవలేక పోయారు అందుకే రాలేకపోయారు అంటుంది కావ్య. అదే నిజం కదా మనం కూడా చూశాం కదా అంటుంది రుద్రాణి. కానీ ఆ ఇంట్లో నాకు ఎదురైనా అవమానం గురించి ఆలోచించవా ఉంటుంది అపర్ణ. అందుకు కారణం నేనా మా పుట్టింటికి నేను వెళ్ళననే చెప్పాను. అయినా అమ్మమ్మ గారితో చెప్పించి మరీ తీసుకువెళ్లారు. అత్తయ్య గారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా తల్లి కొడుకులిద్దరే మాట్లాడుకున్నారు అందులో కూడా నా తప్పులేదు.
ఏ తప్పు చేయకుండా నేనెందుకు పుట్టింటికి వెళ్ళాలి అమ్మమ్మ గారు, తాతయ్య గారు మీరే న్యాయం చెప్పండి అంటుంది కావ్య. తరువాయి భాగంలో నీ తప్పుని నేను క్షమిస్తాను కానీ ఆ మనిషిని క్షమించలేను నా కొడుకుగా ఇంట్లోకి వస్తే రా, లేదు కావ్య తోనే లోపలికి వస్తాను అంటే నాకు కొడుకే లేడనుకుంటాను అంటూ రాజ్ ని ఇరకాటంలో పెట్టేస్తుంది అపర్ణ.